ఎండ.. ప్రచండం

రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్‌లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated : 01 May 2024 04:51 IST

ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు గరిష్ఠ ఉష్ణోగ్రత
జగిత్యాల, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి
ఎండదెబ్బకు ఎనిమిది మంది మృత్యువాత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్‌లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా రాయిల్‌ మండలం అల్లీపూర్‌లో 46.1, బీర్పూర్‌ మండలం కొల్వాయిలో 46, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు, వీణవంక మండల కేంద్రంలో 46 డిగ్రీల ఎండ కాసింది. రాష్ట్రంలో ఈ ఏడాదికి ఇవే అత్యధికం. ఏప్రిల్‌ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లోనూ పదేళ్ల కాలంలో ఇవే గరిష్ఠం. రాష్ట్రంలోని మరో 14 మండలాల్లో 45.5 డిగ్రీల నుంచి 45.9 డిగ్రీల మధ్య ఉన్నాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, దామరచెర్ల, త్రిపురారం మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో బుధ, గురువారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

దప్పికతో అల్లాడి.. బావి వద్దే కుప్పకూలి..

యాదాద్రి జిల్లా పంతంగి వద్ద హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ఉన్న ఓ వెంచర్‌ వద్దకు మంగళవారం ఓ గుర్తుతెలియని మహిళ(50) తీవ్ర దప్పికతో వచ్చారు. తాగేందుకు నీరివ్వాలని అక్కడున్న వారిని కోరగా.. మా వద్ద లేవని, పక్కనే ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లాలని చెప్పారు. దీంతో ఎండిన గొంతుతో ఆ పొలానికి ఉన్న కంచె మధ్యలో నుంచి అతికష్టమ్మీద లోనికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె దేహానికి గాయాలు కూడా అయ్యాయి. కాసేపటికి కౌలు రైతు నర్సింహ బావి వద్దకు వెళ్లి చూడగా.. ఆమె అక్కడే స్పృహతప్పి పడిపోయి కనిపించారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపు స్థానికులు పరిశీలించి చూడగా ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిసింది. మృతురాలి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి తెలిపారు.

జనజాతర సభలో సొమ్మసిల్లి

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో కుర్చీలో కూర్చుని ఉన్న అంబాల అయిలమ్మ(65) సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనున్న వారు హుటాహుటిన పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమెది వీణవంక మండలం రెడ్డిపల్లిగా గుర్తించారు.


ప్రాణాలు తోడేసిన ఎండ

కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్‌ మండలంలోని గిర్నితండాలో కడావత్‌ హీరాబాయ్‌(65) మూడు రోజులుగా ఎండలో ధాన్యం ఆరబోస్తున్నారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కూనేపల్లిలో సంకు గురప్ప(65) భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవారు. మంగళవారం ఓ హోటల్‌ వద్ద అల్పాహారం తింటుండగా.. కళ్లు తిరిగి పడిపోయారు. స్థానికులు పరిశీలించి చూడగా అప్పటికే మృతిచెందారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చామగడ్డ మండలం జంగాలతోటకు చెందిన జె.నగేశ్‌(28) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాంతంలో జామాయిల్‌ కర్ర నరికే పనులకు వచ్చారు. మంగళవారం పని ప్రదేశంలోనే ఉన్నట్లుండి కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లిలో దాసరి రాజయ్య (68) సోమవారం ఇంట్లో కిందపడడంతో కాలికి గాయమైంది. మంగళవారం వీణవంక మండలానికి తీసుకెళ్లి వైద్యం చేయించి మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చారు. కాసేపటికే అస్వస్థతకు గురై వృద్ధుడు మృతిచెందారు. 

 న్యూస్‌టుడే, చొప్పదండి, చౌటుప్పల్‌గ్రామీణం, జమ్మికుంట, మహ్మద్‌నగర్‌, రెంజల్‌, భీమారం, పాల్వంచ, శంకరపట్నం


వడ్ల వద్దే ప్రాణాలు వదిలి

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన ఐతరవేని రాజేశం(47) వ్యవసాయంతోపాటు ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగానూ పనిచేసేవారు. తాను పండించిన ధాన్యాన్ని రాగంపేట కొనుగోలు కేంద్రంలో పది రోజులుగా ఆరబోస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎండలో ఆరబోసిన వడ్లను కలియదిప్పుతూ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.


తీవ్ర అస్వస్థతతో యువజన కాంగ్రెస్‌ నాయకుడు..

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారం గ్రామానికి చెందిన 55వ డివిజన్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగాల నవీన్‌కుమార్‌(29) రెండ్రోజులుగా ఎండలో తిరగడంతో సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని