ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated : 05 May 2024 05:35 IST

గ్రూప్‌-1 నియామక ప్రక్రియ తుదితీర్పునకు లోబడి ఉంటుందని ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ జీవో ఆధారంగా ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ కింద గ్రూప్‌-1 నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో జారీ చేసిన జీవో 33ను సవాలు చేస్తూ పి.శ్యాంసుందర్‌రెడ్డి, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిబ్రవరి 19న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. ఇందులో ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతమని పేర్కొందని చెప్పారు.

ప్రభుత్వ నిర్ణయం వల్ల రిజర్వేషన్లు 54 శాతానికి పెరిగాయన్నారు. సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని అధికరణ 14, 15, 16లకు విరుద్ధమని చెప్పారు. సాధారణంగా ఒక వర్గానికి రిజర్వేషన్లను పెంచాలంటే సామాజిక వెనకబాటుతనంపై అధ్యయనం చేయాల్సి ఉందని.. అలా చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పెంచడం చెల్లదని పేర్కొన్నారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో ఉన్న ఖాళీల్లో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల కేటాయింపును రద్దు చేసేలా టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ, న్యాయశాఖ, గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శులు, టీఎస్‌పీఎస్సీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్‌ 28వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని