Ramanujacharyulu: దివ్య క్షేత్రం.. భవ్య యాగం

ఆధ్మాత్మికపరులకు చూడ కనులు చాలవన్నంత మహాద్భుత ఘట్టం.. నేటి తరానికి తెలియని మహత్తర క్రతువు.. సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ఆరంభమైంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో భగవద్రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ఈ యాగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

Updated : 04 Feb 2022 05:07 IST

శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం ఆరంభం
ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న  శ్రీరామనగరం

ఈనాడు, హైదరాబాద్‌: ఆధ్మాత్మికపరులకు చూడ కనులు చాలవన్నంత మహాద్భుత ఘట్టం.. నేటి తరానికి తెలియని మహత్తర క్రతువు.. సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ఆరంభమైంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో భగవద్రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా ఈ యాగాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దేశవిదేశాల నుంచి వచ్చిన అయిదువేల మంది రుత్విజులు నాలుగు వేదాల్లోని 9 శాఖల మంత్ర హవన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఓం నమో నారాయణాయ, జై శ్రీమన్నారాయణ నామస్మరణతో యాగప్రాంగణాలు మార్మోగాయి. దేశవిదేశాల నుంచి దాదాపు 30 వేల మంది భక్తులు వేడుకలకు విచ్చేశారు.

అగ్నిమథనంతో ఆరంభం..
తొలుత ఉదయం పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం అరణి మథనంతో క్రతువు ప్రారంభమైంది. ప్రధాన యాగశాలలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నేపాల్‌ నుంచి విచ్చేసిన 9 మంది జీయర్‌ స్వాముల పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అగ్నిహోత్ర ఘట్టాన్ని ఆరంభించారు. మంగళ వాయిద్యాల నడుమ శమీ, రావి కర్రలను మథించి బాలాగ్ని పుట్టించారు. దీంతో అగ్నిహోత్రం తయారు చేసి, తొలుత ప్రధాన యాగశాలలో పశ్చిమాన ఉన్న కుండాన్ని వెలిగించారు. ఇందుకు ప్రత్యేకంగా ఆవుపేడతో తయారు చేసిన సమిధలను వినియోగించారు. మొత్తం 114 యాగశాలల్లోని 1035 కుండాలను వెలిగించి శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క కుండం వద్ద ఇద్దరు లేదా ముగ్గురు రుత్విజులు హోమాలు నిర్వహిస్తున్నారు. క్రతువును యజ్ఞశాలల నిర్వాహకులు శ్రీనివాసాచార్య, మాధవాచార్య బృందం పర్యవేక్షిస్తున్నారు.

రెండు దఫాలుగా..
రోజూ హోమాలు రెండు విడతలుగా జరుగుతాయి. మహిళా వాలంటీర్లు యాగశాలలను అందమైన రంగవల్లికలతో అలంకరించారు. ప్రతి కుండం వద్ద జరిగే యాగానికి రోజుకు ఆరు కిలోల స్వచ్ఛమైన నెయ్యి వినియోగిస్తారు.

ఘనంగా సుదర్శనేష్టి
వేదమంత్రోచ్చారణలతో శ్రీరామనగరం మార్మోగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు యాగశాలలు, ప్రవచన మండపాల్లో పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తూ పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. ప్రధాన యాగశాలలో పెరుమాళ్‌ కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రవచన మండపంలో చినజీయర్‌ స్వామి చేతుల మీదుగా పెదజీయర్‌ స్వామి అష్టోత్తర శతనామపూజ నిర్వహించారు. దాదాపు 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఇష్టిశాలలో దుష్ట నివారణకు శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్టసిద్ధికి శ్రీ వాసుదేవేష్టి నిర్వహించారు. సాయంత్రం అగ్ని ఆరాధన చేశారు.

6న ఏపీ సీఎం జగన్‌ రాక
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేయనున్నట్లు నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని జగన్‌ సందర్శిస్తారని, లక్ష్మీనారాయణ మహాయాగ క్రతువులో పాల్గొంటారని పేర్కొన్నారు.

నాలుగు దిక్కుల్లో నాలుగు పేర్లతో మండపాలు: చిన జీయర్‌ స్వామి
యాగశాలలను నాలుగు భాగాలుగా విభజించినట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. ఉదయం హోమాల ప్రారంభం సందర్భంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. శ్రీరంగ క్షేత్రానికి సూచికగా భోగ మండపం, తిరుమలకు పుష్ప మండపం, కాంచీపురానికి త్యాగమండపం, మేల్కొటె క్షేత్రానికి జ్ఞాన మండపంగా పేర్లు నిర్ణయించినట్లు వివరించారు. ఈ నాలుగు క్షేత్రాలతో రామానుజాచార్యులకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. యాగాల సందర్భంగా భక్తులందరూ భగవన్నామస్మరణపైనే దృష్టి పెట్టాలన్నారు. దేవుడిని భయంతో కాకుండా భక్తితో కొలవాలన్నారు.

9 అంకెతో ముడిపడి: సమతా స్ఫూర్తి కేంద్రం ప్రాజెక్టు ఆరంభం నుంచి అన్ని అంశాలు 9 అంకెతో ముడిపడి ఉన్నాయి. విగ్రహం ఎత్తు నుంచి దివ్య దేశాల నిర్మాణం వరకు అన్నిటికీ 9 అంకె వచ్చేలా రూపకల్పన చేశారు. అనూహ్యంగా అగ్ని మథనం క్రతువు సైతం అదే అంకెతో ముడిపడింది. కచ్చితంగా 9 నిమిషాలపాటు మథించిన తర్వాత అగ్ని పుట్టింది.ఈ విషయాన్ని స్వయంగా చిన జీయర్‌ స్వామి ప్రకటించారు.


సమతా స్ఫూర్తి కేంద్రానికి ప్రపంచ ఖ్యాతి
- ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష

శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: భవిష్యత్తులో సమతాస్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు యావత్‌ దేశానికే గర్వకారణమన్నారు. ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో గురువారం ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. గంట మండపంలో భారీ గంటను మోగించారు. అనంతరం ఓమ్నీ మ్యాక్స్‌ థియేటర్‌కు చేరుకుని రామానుజాచార్యులపై రూపొందించిన వీడియోను తిలకించారు. అక్కడి నుంచి యాగశాలలకు చేరుకోగా.. పండితులు వేదమంత్రోచ్చారణ మధ్య ఆహ్వానం పలికారు. పెరుమాళ్‌ను దర్శించుకుని సీఎం పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్రిదండి చిన జీయర్‌స్వామి కృషి, పట్టుదలతో సమతామూర్తి కేంద్రం రూపుదిద్దుకుందని చెప్పారు. రామానుజాచార్య ప్రబోధించిన సమతా సిద్ధాంతానికి వారధిలా చిన జీయర్‌ స్వామి ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఇక్కడి నుంచి రామానుజాచార్య శాంతి సందేశం యావత్‌ ప్రపంచానికీ చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చినజీయర్‌ స్వామి వెంట అందరం కార్యకర్తల్లా నడుద్దామన్నారు. సమతామూర్తి కేంద్రం తెలంగాణకు, ప్రత్యేకించి హైదరాబాద్‌కు వరంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్‌కుమార్‌, మై హోం అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, ఏపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు. సీఎం పర్యటన రెండు గంటలకు పైగా సాగింది. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు క్షేత్రాన్ని సందర్శించారు.


శ్రీరామనగరంలో నేటి కార్యక్రమాలు
* శుక్రవారం ఉదయం 6.30 నుంచి 7.30 వరకు అష్టాక్షరీ మహామంత్ర జపం.
* 8.30 గంటలకు హోమాలు.
* మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి.
* సాయంత్రం 5 గంటలకు  మరోమారు హోమాలు.
* ఇష్టిశాలల వద్ద శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టి నిర్వహిస్తారు.
* ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తరశతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
* ఉదయం 10.30కు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని