New Year Eve : తారల న్యూ ఇయర్‌ కబుర్లు.. విన్నారా?

ఎంత సంతోషంగా కొత్త ఏడాదిని ప్రారంభిస్తే.. ఆ సంవత్సరమంతా అంత ఆనందంగా గడిచిపోతుందనేది మన నమ్మకం. అందుకే న్యూ ఇయర్‌ని ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌ చేసుకుంటారంతా! మన సినీ తారలూ ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పటికే కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పడానికి కొంతమంది...

Updated : 02 Jan 2023 13:27 IST

(Photos: Instagram)

ఎంత సంతోషంగా కొత్త ఏడాదిని ప్రారంభిస్తే.. ఆ సంవత్సరమంతా అంత ఆనందంగా గడిచిపోతుందనేది మన నమ్మకం. అందుకే న్యూ ఇయర్‌ని ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్‌ చేసుకుంటారంతా! మన సినీ తారలూ ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పటికే కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పడానికి కొంతమంది వివిధ పర్యటక ప్రదేశాల్లో వాలిపోయారు. ఇక, వచ్చే ఏడాదంతా సంతోషంగా గడపడానికి పలు తీర్మానాల్ని కూడా సిద్ధం చేసుకున్నామంటున్నారు మరికొందరు. కొత్త ఏడాదిలో తమ ఫ్యాన్స్‌లో సానుకూల దృక్పథం నింపేలా స్ఫూర్తిదాయక పోస్టులు పెట్టారు ఇంకొందరు. మరి, మన తారల న్యూ ఇయర్‌ వేడుకల కబుర్లేంటో చదివేద్దాం రండి..!

కరీనా కపూర్‌

సాధారణంగానే పర్యటక ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటుంది బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌. షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికితే చాలు.. కుటుంబంతో కలిసి తమకు నచ్చిన టూరిస్ట్‌ ప్లేస్‌లో వాలిపోతుంటుంది. ఇక ఈ న్యూ ఇయర్‌ కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లింది బెబో. భర్త సైఫ్‌, కొడుకులు తైమూర్‌, జహంగీర్‌లతో కలిసి అక్కడి జిస్టాడ్‌ అనే రిసార్ట్‌ ప్రాంతంలో దిగిన ఫొటోల్ని ‘న్యూ ఇయర్‌కి కౌంట్‌డౌన్‌ మొదలైంది..’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ అందాల తార. అంతేకాదు.. కొత్త ఏడాది సంతోషంగా ఉండడానికి ఓ తీర్మానం కూడా తీసుకున్నానంటోంది బెబో.

‘వర్కింగ్‌ మదర్స్‌కి ఇటు ఇంటిని, అటు పనిని బ్యాలన్స్‌ చేయడం పెద్ద సవాలు. నాకూ ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, మరోవైపు షూటింగ్స్‌కి హాజరవడం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి మునివేళ్లపై నిలబడినట్లనిపిస్తుంటుంది. అందుకే ఈ సవాలును ఎదుర్కొని వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేయడమే కొత్త ఏడాది తీర్మానంగా తీసుకున్నా. ఈ క్రమంలో నా తల్లిదండ్రులకూ తగిన సమయం వెచ్చిస్తూ మరింత సంతోషంగా ఉండాలనుకుంటున్నా. ఏటికేడు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని.. అవి చేరుకోలేక బాధపడే బదులు.. చిన్న తీర్మానాల్లోనే మనశ్శాంతిని, సంతోషాన్ని వెతుక్కోవడం మంచిదన్నది నా భావన..’ అంటోందీ అందాల అమ్మ.


సమంత

ప్రతికూల పరిస్థితుల్నీ సానుకూలంగా తీసుకొని ముందుకు సాగుతుంటుంది టాలీవుడ్‌ బ్యూటీ సమంత. ఈ ఏడాది సినిమాల పరంగా ఆమెకు మంచి ఫలితాలే వచ్చినా.. ఆరోగ్యపరంగా పలు సమస్యల్ని ఎదుర్కొందామె. అయినా ధైర్యంగా ముందుకు సాగుతున్నానంటూ పాజిటివిటీని చాటే పోస్టుల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది సామ్‌. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలోనూ మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ని పెట్టిందీ ముద్దుగుమ్మ.

‘కొత్త తీర్మానాలు చేసుకోవడానికి ఇదే సరైన సమయం. అయితే మన వల్ల సాధ్యమయ్యే లక్ష్యాల్ని నిర్దేశించుకుంటేనే సులభంగా వాటిని చేరుకోగలం. తద్వారా మనమూ ఉత్సాహంగా, సంతోషంగా ముందుకు సాగగలుగుతాం.. ఈ క్రమంలో ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయని గుర్తుంచుకోండి. హ్యాపీ 2023!’ అంటూ తాను ప్రతిసారీ సులభమైన లక్ష్యాల్ని ఏర్పరచుకొని సానుకూలంగా ముందుకు సాగుతుంటానని చెప్పకనే చెప్పింది సామ్‌.


మంచు లక్ష్మి

ఏటికేడు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మరింత ఉన్నతంగా ఉండాలనుకుంటాం. తాను కూడా ఇదే కోవకు చెందుతానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ మంచు లక్ష్మి. ప్రతి సంవత్సరంలాగే ఈసారీ కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానంటోన్న ఈ మంచువారి ఆడపడుచు.. కొత్త ఏడాది తాను తీసుకోబోయే తీర్మానాల గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘ఈ ఏడాది ఎంతో సానుకూలంగా గడిచింది. మొదట్లో కొవిడ్‌ కాస్త ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత అంతా సర్దుకుంది. ఇక కొత్త ఏడాది కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలనుకుంటున్నా. ముఖ్యంగా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ని మరింత సమర్థంగా నిర్వర్తించాలనుకుంటున్నా. నా కూతురు విద్యా నిర్వాణతో కలిసి మరింత సమయం గడపాలనుకుంటున్నా. ఓవైపు ప్రశాంతతను కోరుకుంటూనే, మరోవైపు సవాళ్లను స్వీకరించడానికీ సిద్ధంగా ఉన్నా. ఇక కెరీర్‌ పరంగా ఇప్పటికే పలు ప్రాజెక్టులు నా చేతిలో ఉన్నాయి. మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించడానికి ఉవ్విళ్లూరుతున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ టాలీవుడ్‌ మామ్‌.


కత్రినా కైఫ్‌

తమకు నచ్చిన ప్రదేశాల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని చూస్తుంటారు కొందరు. బాలీవుడ్‌ లవ్లీ కపుల్‌ కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ జంట ఇందుకు మినహాయింపు కాదు. వైల్డ్‌లైఫ్‌ను ఎక్కువగా ఇష్టపడే ఈ అందాల జంట.. ఈసారి వన్యప్రాణుల సమక్షంలోనే కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పడానికి రడీ అయిపోయింది. ఇందుకోసమే ప్రస్తుతం రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారీ బాలీవుడ్‌ జంట. అక్కడి బాలీ జిల్లాలోని జవాయి చిరుతపులి సంరక్షణ కేంద్రంలో ఎంతో ఉత్సాహంగా గడుపుతోన్న వీరిద్దరూ.. ఈ క్రమంలో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ‘ఎంతో అద్భుతంగా ఉందీ ప్రదేశం.. నాకు ఇష్టమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి..’ అంటూ అక్కడి సఫారీ సంగతుల్ని పంచుకుంది విక్ట్రీనా జంట.


అనుష్కా శర్మ

ఎలాంటి అకేషన్‌నైనా విదేశాల్లో.. అదీ తమకు నచ్చిన ప్రదేశాల్లో జరుపుకోవడం విరుష్క జంటకు అలవాటే! ఏటా న్యూ ఇయర్‌ను వేర్వేరు దేశాల్లో సెలబ్రేట్‌ చేసుకునే ఈ లవ్లీ కపుల్‌.. ఈసారి ఈ వేడుకల కోసం దుబాయ్‌ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో తమ కూతురితో కలిసి అక్కడి వివిధ పర్యటక ప్రదేశాల్లో దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ సందడి చేస్తోందీ అందాల జంట.


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

తన బాయ్‌ఫ్రెండ్‌ జాకీ భగ్నానీతో కలిసి కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధమైపోయింది టాలీవుడ్‌ అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇందుకోసం ఇప్పటికే థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ అనే దీవికి చేరుకున్న ఈ ముద్దుగుమ్మ.. అక్కడి పచ్చటి ప్రకృతి మధ్య దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ సందడి చేసింది.  ‘చిరునవ్వుతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేద్దాం..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది రకుల్‌.


అనన్యా పాండే

ఈ ఏడాది ‘గెహ్రాయియా’, ‘లైగర్‌’ చిత్రాలతో జోరు మీదుంది బాలీవుడ్‌ క్యూట్‌ గర్ల్‌ అనన్యా పాండే. జీవితంలోని ప్రతి క్షణాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు సాగే ఈ ముద్దుగుమ్మ.. వచ్చే ఏడాదీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తానంటోంది. ‘వ్యక్తిగతంగానే కాదు.. వృత్తిపరంగానూ నాకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది మరో మూడు ప్రాజెక్టులు నా చేతిలో ఉన్నాయి. వాటి గురించి ప్రకటించడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఒక నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉండడం, ఫ్యాన్స్‌ అభిమానాన్ని చూరగొనడం.. ఇంతకంటే ఇంకేం కావాలి?!’ అంటోంది అనన్య. ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో థాయ్‌లాండ్‌లో ఎంజాయ్‌ చేస్తోన్న ఈ బాలీవుడ్‌ బేబ్‌.. అక్కడి ఫుకెట్‌ దీవిలో కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్