Hamsa Nandini: క్యాన్సర్‌ను జయించి.. ఇక్కడ మళ్లీ పుట్టాననిపిస్తోంది!

ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యను జయిస్తే.. ప్రపంచాన్నే ఓడించినంతగా సంబరపడిపోతాం. ఇది దేవుడు మనకు ప్రసాదించిన పునర్జన్మగా భావిస్తుంటాం. టాలీవుడ్‌ అందాల తార హంసానందిని కూడా ప్రస్తుతం అలాంటి అనుభూతిలోనే ఉన్నానంటోంది. ఇటీవలే రొమ్ము క్యాన్సర్‌ను....

Published : 09 Dec 2022 18:31 IST

(Photos: Instagram)

ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యను జయిస్తే.. ప్రపంచాన్నే ఓడించినంతగా సంబరపడిపోతాం. ఇది దేవుడు మనకు ప్రసాదించిన పునర్జన్మగా భావిస్తుంటాం. టాలీవుడ్‌ అందాల తార హంసానందిని కూడా ప్రస్తుతం అలాంటి అనుభూతిలోనే ఉన్నానంటోంది. ఇటీవలే రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సినిమా సెట్‌లోకి అడుగుపెట్టింది. అక్కడే తన పుట్టినరోజును కూడా జరుపుకొంది. ఈ క్రమంలోనే ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ హంస పెట్టిన సోషల్‌ మీడియా పోస్ట్‌ ప్రస్తుతం వైరలవుతోంది.

నటిగా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా తెలుగు తెరపై మంచి పేరు తెచ్చుకుంది హంసానందిని. పలు ప్రత్యేక గీతాలతో, కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలతో అలరించింది. అయితే 2018 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె.. ఆపై తన యూట్యూబ్‌ ఛానల్‌తో అందరికీ దగ్గరైంది. అయితే గతేడాది డిసెంబర్‌లో తాను రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నానని వెల్లడించి అందరినీ షాక్కు గురిచేసిందీ ముద్దుగుమ్మ. ఇక అప్పట్నుంచి ఎప్పటికప్పుడు తన చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తోన్న హంస.. తనకు 16 పర్యాయాలు కీమోథెరపీ చికిత్స పూర్తయిందని, పలు సర్జరీల అనంతరం ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తాను గుండుతో దిగిన ఫొటోల్ని పంచుకోవడానికీ వెనకాడలేదామె. ఇక ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో సినిమా సెట్‌లోకీ అడుగుపెట్టిందీ టాలీవుడ్‌ బ్యూటీ.

ఐ యామ్‌ బ్యాక్!

సినిమా సెట్‌లో వ్యానిటీ వ్యాన్‌ మెట్లపై దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న హంస.. ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ పూర్తి ఆత్మవిశ్వాసంతో తన మనసులోని మాటల్ని పంచుకుంది. ‘సినిమా సెట్‌లో మళ్లీ పుట్టినట్లనిపిస్తోంది. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక నేను జరుపుకొన్న తొలి పుట్టినరోజు ఇది. నేను ఎక్కువగా సమయం గడిపే కెమెరా ముందు ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం మర్చిపోలేని అనుభూతి. నా సహనటులు, సినిమా బృందంతో కలిసి గడిపిన ఈ క్షణాలు నాకెంతో అపురూపం. ఇన్ని రోజులు ఇంత ఆనందాన్ని మిస్సయ్యానా అనిపిస్తోంది. మీ అందరి ప్రేమాభిమానాలు, ప్రార్థనలే నన్ను ఈ మహమ్మారి నుంచి కోలుకునేలా చేశాయి. యస్‌.. ఐ యామ్‌ బ్యాక్‌!’ అంటూ తన మనసులోని ఆనందాన్ని అక్షరీకరించిందీ అందాల తార. ఇలా హంస పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. చాలామంది నెటిజన్లు ‘లేడీ బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’, ‘ఆల్‌ ది బెస్ట్‌’.. అంటూ కామెంట్లు షేర్‌ చేస్తున్నారు.

జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా..!

ఇక తాను రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన విషయాన్ని గతేడాది డిసెంబర్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో పంచుకుంటూ అందరినీ షాక్‌కి గురిచేసింది హంస. తన జీవితంలో ఎదురైన ఈ ప్రతికూలతల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నానంటూ తన అనుభవాలను ఇలా గుదిగుచ్చింది.

‘జీవితం నాకు ఎన్ని సవాళ్లు విసిరినా, అది నా పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా.. నేను దానికి బాధితురాలిని కాదల్చుకోలేదు. అనుక్షణం భయంతో, నిరాశతో, ప్రతికూల భావనలతో కుంగిపోవాలనుకోలేదు. ప్రేమతో, ధైర్యంతో ఈ గడ్డు దశను దాటి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. 18 ఏళ్ల క్రితం మా అమ్మ రొమ్ము క్యాన్సర్‌తో చనిపోయింది. ఇన్నాళ్లూ ఆ ప్రతికూలతల్లోనే బతికాను. కొన్ని నెలల క్రితం నా రొమ్ములో గడ్డ తగలగానే మనసులో ఏదో తెలియని భయం ఆవహించింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఆ క్షణం నాకు అర్థమైంది.

ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది!

సమస్యను నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకున్నా. నా భయమే నిజమైంది. ‘Grade 3 Invasive Carcinoma (Breast Cancer)’ ఉందని తేలింది. కొన్ని పరీక్షలు, స్కాన్ల అనంతరం నా రొమ్ములోని కణితిని ఆపరేషన్‌ ద్వారా తొలగించారు వైద్యులు. ఇది భవిష్యత్తులో తిరిగి వ్యాప్తి చెందదని తేల్చి చెప్పారు. త్వరగా గుర్తించడం వల్లే ముప్పు తప్పిందని సంతోషపడ్డా. కానీ నా ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. ఎందుకంటే BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్‌) పరీక్షలో నాకు పాజిటివ్‌ అని తేలింది. అంటే.. దీని జన్యు పరివర్తన కారణంగా నాకు భవిష్యత్తులో.. 70 శాతం రొమ్ము క్యాన్సర్‌, 45 శాతం అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కచ్చితంగా పొంచి ఉందని చెప్పారు వైద్యులు. అయితే ఈ ముప్పును తగ్గించడానికి కొన్ని విస్తృత రోగనిరోధక శస్త్రచికిత్సలు చేయించుకోవాలన్నారు. అలాగని నేను అధైర్యపడలేదు. ఈ మహమ్మారికి నన్ను జయించే అవకాశం, నా జీవితాన్ని శాసించే అధికారం ఇవ్వాలనుకోలేదు. చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతోనే ఈ యుద్ధాన్ని గెలవాలనుకున్నా.. గెలిచా..’ అంటూ తన క్యాన్సర్‌ కథను పంచుకుందీ బ్రేవ్‌ బ్యూటీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్