Celebs Ugadi : మా ‘ఉగాది’ సంబరాలు ఇలా!

ఏడాది పొడవునా ఎన్ని రోజులున్నా పండగ రోజుకున్న ప్రాశస్త్యం, ప్రత్యేకతే వేరు. ఎందుకంటే కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు. తామూ ఇందుకు మినహాయింపు....

Updated : 23 Mar 2023 14:02 IST

(Photos: Instagram)

ఏడాది పొడవునా ఎన్ని రోజులున్నా పండగ రోజుకున్న ప్రాశస్త్యం, ప్రత్యేకతే వేరు. ఎందుకంటే కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపడానికి ఇష్టపడతారు. తామూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఇక తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున ఈ ఆనందం మరింత రెట్టింపవుతుందంటున్నారు. వచ్చే ఏడాదంతా పాజిటివిటీతో నిండిపోవాలని కాంక్షిస్తున్నారు. మరి, ‘శోభకృత్‌’ నామ ఉగాదిని పురస్కరించుకొని.. కొందరు ముద్దుగుమ్మలు తమ ఉగాది/గుడి పడ్వా సంబరాలను, చిన్ననాటి జ్ఞాపకాలను ఇలా నెమరువేసుకున్నారు.

పాజిటివిటీని తీసుకొస్తుంది! - పూజా హెగ్డే

ప్రతి పండగలాగే ఉగాది/గుడి పడ్వాను చిన్నప్పుడు కర్ణాటకలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకొనేదాన్ని. ప్రస్తుతం ముంబయిలో ఉన్నా ఈ ఆచారాల్ని కొనసాగిస్తున్నా. ఈ పండగ రోజున ఉదయాన్నే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం, కుటుంబ సభ్యులతో పూజలో పాల్గొనడం, అమ్మ చేసే పిండి వంటలు రుచిచూడడం.. ఇవన్నీ నాకు తీపి గుర్తులే! మా ఇంట్లో గుడి పడ్వాకు పాయసం, ఖీర్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇంట్లో ఉంటే నేనే వీటిని తయారుచేస్తా. ఇక అమ్మ చేసే పూరన్‌ పోలీ (బొబ్బట్లు), బాసుందీ స్వీట్లంటే నాకు చాలా ఇష్టం. దసరా, దీపావళి మాదిరిగానే గుడి పడ్వా చాలా పెద్ద పండగ. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ పర్వదినం.. మన జీవితాల్లోకి పాజిటివిటీని, సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇక పూజలు పూర్తై భోజనం చేశాక.. అందరం కలిసి అలా సరదాగా గడుపుతాం.


కొత్త బట్టలు వేసుకోవాల్సిందే! - రేణూ దేశాయ్

నేను పుట్టింది గుజరాతీ కుటుంబంలోనే అయినా పెరిగింది పుణేలో! ఇక్కడ గుడి పడ్వా (ఉగాది) ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఉదయం లేచాక ఫ్రెషప్‌ అయి కొత్త బట్టలు ధరించడం, ఇంటిని అలంకరించడం, పనుల్లో అమ్మకు సహాయపడడం.. పండగ రోజున ఎంతో సందడిగా ఉండేది. ఇక హైదరాబాద్‌ వచ్చాక.. అటు పుణే, ఇటు హైదరాబాద్‌.. రెండు రాష్ట్రాల సంప్రదాయాల్నీ పాటిస్తున్నా. పండగ రోజున ఉగాది పచ్చడి, బొబ్బట్లు.. వంటి వంటకాలతో పాటు గుజరాతీ వంటకాల్ని తయారుచేస్తుంటా. ఇలా ఉగాది రోజున మా ఇంట్లో మూడు రాష్ట్రాల వంటకాలు దర్శనమిస్తాయి.


అవన్నీ మధుర జ్ఞాపకాలే! - శ్రద్ధా కపూర్

గుడి పడ్వా, ఛెత్రీ చంద్ర, నవరాత్రి, ఉగాది.. పేరేదైనా పండగ ప్రాముఖ్యత ఒక్కటే. ఆయా సంప్రదాయాల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలికే ఈ పర్వదినాన్ని ఏటా సానుకూల దృక్పథంతో, సంతోషంగా మొదలుపెట్టడం నాకు అలవాటు. ఈ పండగ రోజున మహారాష్ట్ర సంప్రదాయ వంటకాలు తయారుచేయడం నాకిష్టం. షూటింగ్స్‌ ఉంటే సెట్స్‌కీ వీటిని తీసుకెళ్తా. చిన్నతనంలో పండగ రోజున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో గడపడానికే ఇష్టపడేదాన్ని. ఇప్పటికీ షూటింగ్స్‌ లేకపోతే ఇదే చేస్తున్నా. ఎంతైనా పండగ సంతోషాన్ని ఇంట్లో వాళ్లతో పంచుకున్నప్పుడు కలిగే మధురానుభూతి ఎప్పటికీ ప్రత్యేకమే!


అమ్మవారిని పూజిస్తా! - కంగనా రనౌత్

పండగ రోజు సంప్రదాయబద్ధంగా తయారైతే ఆ కళే వేరుగా ఉంటుంది. గుడి పడ్వా, నవరాత్రి, న్యూ ఇయర్‌, ఉగాది.. పేర్లు వేరైనా కొత్త సంవత్సరానికి తొలి రోజు ఇది. ప్రతి ఏటా ఈ రోజున నేను అమ్మవారిని పూజిస్తా.. మా అమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటా. నేను సినిమా అవకాశాల కోసం ఇల్లు వదిలి ముంబయి వచ్చేటప్పుడు అమ్మ నాకు అమ్మవారి ఫొటో ఒకటి ఇచ్చింది. నాతో తీసుకెళ్లిన వస్తువులన్నీ పోయినా.. ఈ ఫొటో మాత్రం నాతోనే ఉంది.. బహుశా.. అమ్మవారే సదా నాకు తోడుగా నిలిచి నన్ను కాపాడిందేమో అనిపిస్తుంటుంది. అందుకే నవరాత్రి/ఉగాది ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో తెలియని వారు.. అమ్మవారిని పూజించండి.. కన్నతల్లి ఆశీస్సులు తీసుకోండి..


అటు ఉగాది.. ఇటు గుడి పడ్వా..! - ప్రియాంక జవాల్కర్

నేను పుట్టింది మహారాష్ట్రలోనే అయినా.. పెరిగిందంతా అనంతపురంలో! కాబట్టి అటు మరాఠీ సంప్రదాయం ప్రకారం గుడి పడ్వా, ఇటు తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది.. ఈ రెండు పండగల్నీ మేం జరుపుకొంటాం. వీటిలో అంతర్భాగమైన చిన్న చిన్న వేడుకలు పండగ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి. గుడి పడ్వాలో భాగంగా వెదురు కర్రకు చీర చుట్టి, కలశంతో అలంకరించిన గుడి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక ఉగాది పచ్చడి జీవితంలో మనకు ఎదురయ్యే మంచి చెడులు, కష్టసుఖాల్ని సంయమనంతో స్వీకరించాలన్న తత్వాన్ని బోధిస్తుంది. మొదట్లో మా అమ్మకు ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలియక.. ఫ్రూట్‌ సలాడ్‌ చేసి దానిపై వేప పువ్వులు, పచ్చి మామిడి కాయ ముక్కలతో గార్నిష్‌ చేసేది. కానీ తర్వాత్తర్వాత ఈ వంటకాన్ని నేర్చుకుంది.
ఇక ఉగాది అంటే చిన్నప్పుడు మరింత సరదాగా ఉండేది. ఎండాకాలం కావడంతో ఇంట్లోనే ఐస్‌క్రీమ్‌ చేసుకొని తినడం, ఆవకాయ పెట్టేటప్పుడు అమ్మకు సహాయం చేయడం, మామిడికాయ పులిహోర, బొబ్బట్లు.. ఇలా ఈ పండగ రోజున ఈ వంటకాలన్నీ చేసుకొని.. కుటుంబంతో కలిసి టీవీ చూస్తూ తింటుంటే.. ఆ ఆనందమే వేరు!


ఒబ్బట్టు.. నా ఫేవరెట్‌! - నేహా శెట్టి

ఉగాది అంటేనే కొత్త ఏడాదికి స్వాగతం పలికే రోజు. అందుకే ప్రతిదీ కొత్తగా ఉండాలని కోరుకుంటా. ఈ రోజు ఉదయాన్నే లేచి ఇంటిని అలంకరించడం, కొత్త బట్టలు వేసుకోవడం, పూజ చేయడం నాకు అలవాటు. ఇక ఈ రోజు అమ్మ బేవు బెల్లా తయారుచేస్తుంది. ఇదీ ఉగాది పచ్చడి లాంటిదే. ఇందులో ఉపయోగించే షడ్రుచులు జీవితంలోని భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఇక అమ్మ తయారుచేసే ఒబ్బట్టు (బొబ్బట్లు) అంటే నాకు చాలా ఇష్టం. నా బెస్ట్‌ ఉగాది మెమరీ ఏంటని ఎప్పుడడిగినా ఒబ్బట్టు అనే చెప్తా. అది నాకు అంతిష్టం మరి! ఓసారి మా ఫ్రెండ్స్‌ ‘గల్లీ రౌడీ’ సినిమా సెట్స్‌కి ఒబ్బట్లు తీసుకొచ్చారు. ఎవరికీ ఇవ్వకుండా అన్నీ నేనే తినేశా. ఏదేమైనా పండగ రోజున అమ్మ చేతి ఒబ్బట్టు రుచే వేరు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్