అందాల తారలు.. సాహసాల్లో సర్టిఫై అయ్యారు!

కెరీర్‌ కాకుండా ప్రతి ఒక్కరిలో ఏదో సాధించాలన్న తపన ఒకటి అంతర్లీనంగా ఉంటుంది. అదేంటో తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నించినప్పుడే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి సక్సెస్‌ను ఇటీవలే అందుకుంది టాలీవుడ్‌ భామ నివేతా పేతురాజ్‌. తెర మీద తన నటనతో అభిమానుల్ని అలరించే ఈ చక్కనమ్మ.. తెరవెనుక కార్‌ రేసింగ్‌ అంటే ప్రాణం పెడుతుంది. అందుకే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికినప్పుడల్లా తన అభిరుచిపై దృష్టి సారిస్తుంటుంది.

Published : 30 Jul 2021 18:38 IST

Photo: Instagram

కెరీర్‌ కాకుండా ప్రతి ఒక్కరిలో ఏదో సాధించాలన్న తపన ఒకటి అంతర్లీనంగా ఉంటుంది. అదేంటో తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నించినప్పుడే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి సక్సెస్‌ను ఇటీవలే అందుకుంది టాలీవుడ్‌ భామ నివేతా పేతురాజ్‌. తెర మీద తన నటనతో అభిమానుల్ని అలరించే ఈ చక్కనమ్మ.. తెరవెనుక కార్‌ రేసింగ్‌ అంటే ప్రాణం పెడుతుంది. అందుకే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికినప్పుడల్లా తన అభిరుచిపై దృష్టి సారిస్తుంటుంది. దాని ఫలితంగానే.. ఇటీవలే ఫార్ములా వన్‌ కార్‌ రేసర్‌గా సర్టిఫికెట్ అందుకుంది. తనొక్కర్తే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు వివిధ రకాల సాహస క్రీడల్లో/అంశాల్లో రాణించి సర్టిఫైడ్‌ స్పోర్ట్స్‌ బ్యూటీస్‌గా కితాబునందుకున్నారు. మరి, వాళ్లెవరు? వారు చేసిన సాహసాలేంటో తెలుసుకుందాం రండి..

అప్పుడే కార్లంటే ఆసక్తి పెరిగింది!

తెలుగు, తమిళ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది చెన్నై బ్యూటీ నివేతా పేతురాజ్‌. ఓవైపు తన కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. తనకిష్టమైన కార్‌ రేసింగ్‌పై క్రమంగా ఆసక్తి పెంచుకుందామె. ఇందులో భాగంగానే ఫార్ములా వన్‌ కార్‌ రేసింగ్‌ క్రీడలో శిక్షణ కూడా తీసుకుంది. ఇటీవలే ‘మొమెంటమ్‌ - స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ రేసింగ్‌’ నిర్వహించిన ‘లెవెల్‌ 1 ఫార్ములా కార్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌’లో పాల్గొని.. తన నైపుణ్యాలను ప్రదర్శించిన నివేత.. సర్టిఫైడ్‌ కార్‌ రేసర్‌గా ప్రశంసా పత్రాన్ని సైతం అందుకుంది. పురుషాధిపత్యం ఉన్న ఇలాంటి రంగాల్లో మహిళలూ దూకుడును ప్రదర్శించాలంటోందామె.

‘దుబాయ్‌లో చదువుకునే రోజుల్లో మా పక్కింట్లో ఉండే ఓ వ్యక్తి స్పోర్ట్స్‌ కారు కొన్నారు. అది చూసి నాకూ కార్లంటే అమితమైన ఆసక్తి ఏర్పడింది. ఆ ఇష్టం నాతో పాటే పెరుగుతూ వచ్చింది. 2015లో నేనూ Dodge Challenger Sports Car కొన్నా. అయితే అది రేసింగ్‌ కారు కావడంతో నాన్నకు నచ్చలేదు. అయినా నేను నడపగలను అన్న ఆత్మవిశ్వాసం నాలో ఉంది. నా తపన చూసి ఆ తర్వాత అమ్మానాన్నలు కూడా నన్ను ప్రోత్సహించారు. నిజానికి ఇలాంటి సాహస క్రీడల్లో పురుషులే ఎక్కువగా ఉంటారు. కానీ ఈతరం మహిళలు ఈ మూసధోరణిని బద్దలు కొట్టడానికి అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఔత్సాహిక మహిళా కార్‌ రేసర్లకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. ఈ క్రీడలో రాణించాలంటే 60-65 కిలోల శరీర బరువుండి.. ఫిట్‌గా ఉంటే చాలు. భవిష్యత్తులో ఫార్ములా వన్‌ రేసింగ్‌ క్రీడల్లో నేనూ పాల్గొనాలనుకుంటున్నా..’ అంటూ కార్‌ రేసింగ్‌ మక్కువ గురించి ఓ సందర్భంలో పంచుకుందీ ముద్దుగుమ్మ.


వాటర్‌ బేబీ ‘ఊర్వశి’!

అందం, అభినయంతోనే కాదు.. తన ఫ్యాషన్లతోనూ మాయ చేస్తుంటుంది బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతెలా. సమయం దొరికినప్పుడల్లా మాల్దీవులకు చెక్కేసే ఈ ముద్దుగుమ్మ.. అక్కడి సముద్రపు అందాల్ని ఆస్వాదించడమే కాదు.. ఆ నీటిలో స్కూబా డైవింగ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో క్లిక్‌మనిపించిన ఫొటోలు, వీడియోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఈ వాటర్‌ స్పోర్ట్స్‌పై తనకున్న మక్కువను చాటుకుంటుంటుందీ చక్కనమ్మ. అయితే తనకున్న ఈ అభిరుచే గతేడాది స్కూబా డైవింగ్‌లో సర్టిఫికేషన్‌ వచ్చేలా చేసిందంటోంది ఊర్వశి.

‘నీటి లోపల ఈత కొట్టడం (స్కూబా డైవింగ్‌) అంటే నాకు ప్రాణం. ఈ క్రమంలో మనకు ఎన్నో సముద్ర జీవులు తారసపడతాయి. అవన్నీ చూస్తుంటే ఏదో తెలియని సంతోషం, సంతృప్తి మనసును మెలిపెడతాయి. నాకు ముందు నుంచీ కొత్త కొత్త సాహసాలు ప్రయత్నించడమంటే ఇష్టం. అయితే సాహసమంటే కొంతమంది భయపడతారు. నన్నడిగితే అలా భయపడిన పని తప్పకుండా చేయమంటా! అప్పుడే మనమెంత బలవంతులమో మనకు అర్థమవుతుంది. ఈ సృష్టిలో అత్యద్భుతమైన మత్తు పదార్థం ఏదైనా ఉందంటే అది స్కూబా డైవింగే! ఈ నీటి క్రీడలో సర్టిఫికెట్‌ పొందడం అదో మధురానుభూతి..’ అంటూ తన స్కూబా డైవింగ్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ క్యాప్షన్‌ పెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ.


పైలట్‌ ‘పనగ్’!

‘మహిళలంటే అనువుగా ఉన్న చోటే ఉండిపోకూడదు.. అరుదైన రంగాల్లోనూ రాణించగలగాలి..’ అంటోంది బాలీవుడ్‌ నటి గుల్‌ పనగ్‌. 1999లో మిస్‌ ఇండియా కిరీటం గెలిచాక నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందామె. అయితే అక్కడితోనే ఆగిపోలేదు.. మోడల్‌గా, నిర్మాతగా, ఎన్జీవో నిర్వాహకురాలిగా, ఆంత్రప్రెన్యూర్‌గా.. ఇలా తనలోని బహుముఖ ప్రజ్ఞను కనబరిచింది. ప్రతి రంగంలోనూ దూసుకుపోవాలన్న వ్యక్తిత్వం ఉన్న ఆమె.. బైక్‌ రైడింగ్‌లోనూ సత్తా చాటింది. మరోవైపు ఫార్ములా వన్‌ కార్‌ రేసింగ్‌లోనూ ఆమెకు ప్రావీణ్యముంది. అయితే చాలామంది అమ్మాయిల్లాగే ఆకాశాన్ని తాకాలన్న మక్కువను పెంచుకుంది పనగ్‌. ఆ అభిరుచే ఆమె పైలట్‌గా శిక్షణ తీసుకునేందుకు.. అందులో లైసెన్స్‌ సంపాదించేందుకు ఊపిరి పోసింది. తన చిరకాల స్నేహితుడు, పైలట్‌ అయిన రిషీ అట్టారీని 2011లో వివాహం చేసుకున్న పనగ్‌.. 2016లో 40 గంటల పాటు విమానం నడిపి.. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ను సొంతం చేసుకుంది. కలలు కంటే సరిపోదని, దాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక వేసుకోవడమూ ముఖ్యమంటోందీ ముద్దుగుమ్మ.

‘ఆకాశంలో ఎగరాలన్న కోరికే నేను పైలట్‌గా శిక్షణ తీసుకునేందుకు ఉసిగొల్పింది. ఐదేళ్ల క్రితం ప్రైవేట్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందడం ద్వారా నా చిరకాల స్వప్నం నెరవేరింది. ఏ కలైనా నెరవేరాలంటే దానికో యాక్షన్‌ ప్లాన్‌ ఉండాలి.. అయితే అలా ప్లాన్‌ చేసుకుంటే సరిపోదు.. దాన్ని చేరుకునే దిశగా మనం ముందుకెళ్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడమూ ముఖ్యమే. ఇక ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను దాటాల్సి ఉంటుంది. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది..’ అంటోందీ పైలట్‌ బ్యూటీ. తాను పైలట్‌ యూనిఫాంలో ముస్తాబైన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయే పనగ్‌.. మరోవైపు అమ్మతనాన్నీ ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి నిహాల్‌ అనే మూడేళ్ల కొడుకున్నాడు.


‘సాహసమే పూబాట’ అంటున్నారు!

‘జీవితమే ఓ ఆట.. సాహసమే పూబాట’ అని ఓ సినీ కవి చెప్పినట్లుగా కొంతమంది ముద్దుగుమ్మలు వివిధ సాహస క్రీడల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. సినిమాల నుంచి ఏమాత్రం విరామం దొరికినా తమకు ఆసక్తి ఉన్న సాహసాల్లో పాల్గొనడానికి సై అంటున్నారు. వారెవరంటే..!

* నటిగానే కాదు.. తన ఫిట్‌నెస్‌ వీడియోలతోనూ అభిమానుల్లో స్ఫూర్తి నింపుతుంటుంది అందాల తార రెజీనా కసాండ్రా. అంతేకాదు.. స్వతహాగా సాహస క్రీడలంటే ఇష్టపడే ఈ చక్కనమ్మకు సైక్లింగ్‌ అంటే ఎంతో మక్కువ! ఈ క్రమంలోనే పారా-అథ్లెట్స్‌ కోసం నిధులు సేకరించడంలో భాగంగా ఇటీవలే చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు నిరంతరాయంగా ఎనిమిది గంటల పాటు సుమారు 140 కిలోమీటర్ల మేర సైకిల్‌ తొక్కి.. అటు ఆటపై ఇష్టాన్ని.. ఇటు తన సేవాభావాన్ని చాటుకుంది.

* బికినీ ధరించి బీచుల్లో సేదదీరడమంటే మన ఇలియానాకు ఎంతో ఇష్టం! సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు గోవా బీచ్‌లో వాలిపోయే ఇల్లూ బేబీకి Surf Paddling, Snorkeling.. వంటి జల క్రీడలంటే ఎంతో మక్కువట! ఈ క్రమంలో దిగిన ఫొటోల్ని సైతం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుందీ ముద్దుగుమ్మ.

* తన మనసులో సైక్లింగ్‌పై ఆసక్తి ఉందని గమనించిన లక్ష్మీ మంచు.. దివ్యాంగుల కోసం పనిచేసే ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ నిధుల సేకరణలో పాలుపంచుకుంది. ఈ క్రమంలో ఎకాఎకిన ఐదు గంటల పాటు వంద కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసి తన మంచి మనసును చాటుకుంది.

* ప్రకృతితో గడపడానికి ఎక్కువగా ఇష్టపడే ప్రగ్యా జైస్వాల్‌.. సాహస క్రీడల్లో పాల్గొనడానికీ తానెప్పుడూ ముందే ఉన్నానంటోంది. ఈ క్రమంలో రివర్‌ రాఫ్టింగ్‌తో పాటు పలు సాహస క్రీడలంటే తనకు మక్కువ అంటూ చెబుతోంది.

* సొట్టబుగ్గల బ్యూటీ లావణ్యా త్రిపాఠి కూడా ఇటీవలే తన ఫ్రెండ్స్‌తో కలిసి రిషికేశ్‌ వెళ్లినప్పుడు 21 కిలోమీటర్లు రివర్‌ రాఫ్టింగ్‌ చేసింది. ఇక హైకింగ్‌ అన్నా తనకు విపరీతమైన ఇష్టమట!

వీరితో పాటు త్రిష (బంగీ జంపింగ్‌, స్కైడైవింగ్‌), రూహీ సింగ్‌ (ట్రెక్కింగ్‌, స్కూబా డైవింగ్‌, పారాసెయిలింగ్‌, స్కీయింగ్‌), భూమిక (డైవింగ్‌, ట్రెక్కింగ్‌).. వంటి తారామణులు కూడా ఆయా సాహస క్రీడల్లో తమ సత్తా చాటుతూ తమ ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరి, ఈ ముద్దుగుమ్మల్లా మీకూ సాహస క్రీడలంటే ఇష్టమా? ఇదివరకే అలాంటి అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న అనుభవం మీకుందా? అయితే ఆ అనుభవాలను మాతో పంచుకోండి. అందరికీ ఆదర్శంగా నిలవండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్