పిరియడ్స్ సమయంలో షూటింగ్.. వీళ్లేం చేస్తారంటే?!

సాధారణ రోజుల్లో మాదిరిగా నెలసరి సమయంలో ఏ పనైనా చేయడానికి శరీరం సహకరించదు. శారీరక నొప్పులకు తోడు మూడ్‌ స్వింగ్స్‌ వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు మనమైతే ఒకట్రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాం. మరి, మన అందాల తారలో?

Updated : 25 May 2024 21:09 IST

సాధారణ రోజుల్లో మాదిరిగా నెలసరి సమయంలో ఏ పనైనా చేయడానికి శరీరం సహకరించదు. శారీరక నొప్పులకు తోడు మూడ్‌ స్వింగ్స్‌ వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు మనమైతే ఒకట్రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాం. మరి, మన అందాల తారలో? అలాగని ఒక్కరి కోసమని షూటింగ్‌ ఆపేయడం/వాయిదా వేయడం.. కుదరని పని! అందుకే నెలసరి సమయంలో మొదటి రెండు రోజులు తన వంతు షూటింగ్‌ ఉండకూడదని కోరుకుంటానంటోంది బాలీవుడ్‌ అందాల తార హీనా ఖాన్‌. కొన్నిసార్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తోడు నెలసరి నొప్పుల్ని భరిస్తూ పనిచేయడం ఎంతో కష్టంగా ఉంటుందంటూ పిరియడ్స్ సమయంలో తనకెదురైన షూటింగ్‌ అనుభవాల్ని ఇటీవలే ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. హీనాకే కాదు.. తమకూ సినిమా చిత్రీకరణ సమయంలో ఇలాంటి అనుభవాలున్నాయంటున్నారు కొందరు నాయికలు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఆ ఆప్షన్‌ ఉంటే బాగుండేది!
బాలీవుడ్‌ బుల్లితెర, వెండితెరపై నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి హీనా ఖాన్‌. తన సినిమా అప్‌డేట్సే కాదు.. వ్యక్తిగత విషయాల్లోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. నెలసరి సమయంలో తనకెదురైన షూటింగ్‌ అనుభవాల్ని ఇటీవలే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. పిరియడ్స్‌ సమయంలో షూటింగ్‌లో పాల్గొనడం ఎంతో అసౌకర్యంగా ఉంటుందంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది హీనా.

‘నెలసరి సమయంలో తొలి రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొనకుండా నాకు ఆప్షన్‌ ఉంటే బాగుండనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అవుట్‌డోర్‌ షూటింగ్స్‌లో పాల్గొనడం చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులూ సవాలు విసురుతుంటాయి. ముఖ్యంగా వేసవిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు తోడు శారీరక నొప్పులు, మూడ్‌ స్వింగ్స్‌, డీహైడ్రేషన్‌, చర్మంపై వేడి పొక్కులు రావడం, బీపీ తగ్గిపోవడం.. ఇలా ఎన్నో సమస్యలెదురవుతుంటాయి. ఛేజింగ్‌ సీన్లు తెరకెక్కించేటప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది. నెలసరి సమయంలో ఇలాంటి సీన్లు చాలా అసౌకర్యానికి గురి చేస్తాయి. అందుకే ఈ రోజుల్లో షూటింగ్‌ ఉండకూడదని కోరుకుంటా..’ అంటోందీ బాలీవుడ్‌ అందం. ఇటీవలే ఓ పంజాబీ చిత్రంలో అలరించిన హీనా.. ప్రస్తుతం ‘నమాకూల్‌’ అనే టీవీ సిరీస్‌లో నటిస్తోంది.


నొప్పితోనే డ్యాన్స్‌ చేశా!

తన నటనతోనే కాదు.. అద్భుతమైన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తోనూ ఆకట్టుకుంటుంది మలయాళ బ్యూటీ సాయి పల్లవి. ‘ఫిదా’ చిత్రంతో తెలుగువారి మనసుల్లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తన సినిమా విషయాలనే కాదు.. వ్యక్తిగత అనుభవాల్నీ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. అయితే డ్యాన్స్‌ అంటే ప్రాణం పెట్టే ఈ ముద్దుగుమ్మ.. నెలసరిలో ఉన్నప్పుడూ డ్యాన్స్‌ షూటింగ్స్‌లో పాల్గొన్నానంటూ ఈమధ్యే ఓ సందర్భంలో పంచుకుంది.
‘నెలసరిలో ఉన్నప్పుడు డ్యాన్స్‌ చేయడం ఎంతో కష్టంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ సమయంలో శారీరకంగా అలసిపోతుంటా.. అయినా ఈ సవాళ్లను అధిగమించి షూటింగ్స్‌లో పాల్గొంటా. శ్యామ్‌ సింగరాయ్‌లో శాస్త్రీయ నృత్యం మొదలు.. ఇప్పటిదాకా చాలా సినిమాల్లో డ్యాన్స్‌ షూటింగ్స్‌ అన్నీ నేను నెలసరిలో ఉన్నప్పుడే జరిగాయి. అయినా ఈ ప్రతికూలతలన్నీ పక్కన పెట్టి డ్యాన్స్‌తో పాటలకు, నా పాత్రకు పూర్తి న్యాయం చేయడానికే ప్రయత్నించా.. ఇలా నెలసరి సమయంలోనే కాదు.. సాధారణ రోజుల్లోనూ రెండు మూడు రోజులు వరుసగా డ్యాన్సింగ్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరించినా అలసిపోతుంటా. ఆ సమయంలో ఇంటికి రాగానే నాన్నే నా కాళ్లకు మసాజ్‌ చేస్తారు..’ అంటూ తన అనుభవాల్ని గుదిగుచ్చిందీ ఫిదా బ్యూటీ. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘థండేల్‌’ చిత్రంలో నటిస్తోంది సాయి పల్లవి.


ఆ సీన్లు చేయలేను!

నెలసరి సమయంలో చాలామంది మహిళల్లో కనిపించే సాధారణ సమస్య పొత్తి కడుపులో నొప్పి. ప్రతి నెలా తానూ ఇదే సమస్యతో ఇబ్బంది పడతానంటోంది అందాల తార శృతీ హాసన్‌. అయినా షూటింగ్స్‌లో పాల్గొంటానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సమయంలో డ్యాన్స్‌, స్టంట్స్‌ వంటి కఠినమైన షూటింగ్‌ సీక్వెన్స్‌లు చేయడం పెద్ద సవాలే అని చెబుతోంది.
‘నెలసరి సమయంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటా. ఇలాంటప్పుడు షూటింగ్‌లో భాగంగా డ్యాన్స్‌, స్టంట్స్‌ వంటి సీన్లు చేయడం కష్టమే! నొప్పి, ఇతర శారీరక సమస్యలతో బాధపడుతున్నప్పుడు నీరసంగా అనిపిస్తుంటుంది.. తద్వారా అత్యుత్తమ ప్రదర్శన చేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో పనులన్నీ పక్కన పెట్టి సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చొని ప్రశాంతంగా గడపాలనిపిస్తుంటుంది.. వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది.. కానీ ప్రతిసారీ ఇలాంటి అవకాశం దొరకచ్చు.. దొరక్కపోవచ్చు..’ అంటోంది శృతి. ప్రస్తుతం ‘సలార్‌’ సీక్వెల్‌లో బిజీగా ఉందీ భామ.


అందుకు సిగ్గుపడను!

సామాజిక అంశాలు, మహిళలకు సంబంధించిన విషయాలపై తన అభిప్రాయాల్ని బహిరంగంగా పంచుకోవడానికి అస్సలు వెనకాడదు బాలీవుడ్‌ తార రాధికా ఆప్టే. సామాజిక అంశాల్ని స్పృశించే కథల్ని, పాత్రల్ని ఎంచుకునే ఈ భామ.. నెలసరి గురించీ తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా పంచుకుంటుంది. అంతెందుకు.. నెలసరి సమయంలో కఠినమైన సీన్లు తనతో చేయించొద్దని నేరుగా డైరెక్టర్లకే చెబుతానంటూ ఓ సందర్భంలో పంచుకుంది రాధిక.
‘నెలసరిని ఓ ట్యాబూలా కాకుండా గౌరవంగా భావించే వ్యక్తిని నేను. ఈ సమయంలో షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చినా.. నాతో పరుగు, స్టంట్స్‌.. వంటి సీన్లు చేయించొద్దని ముందే ఆ చిత్ర దర్శకులతో చెబుతుంటా. ఈ విషయం గురించి వారి దగ్గర ప్రస్తావించడానికి నేను అస్సలు సిగ్గుపడను. ఎప్పుడైనా మనం ఇంకొకరికి మార్గదర్శకులుగా ఉండాలే తప్ప.. మనం భయపడుతూ ఎదుటివారిని భయపెట్టకూడదు. అప్పుడే ఇలాంటి అంశాలపై ఉన్న అపోహలు తొలగిపోయి.. మరింతమంది తమ అనుభవాల్ని బహిరంగంగా పంచుకోగలుగుతారు..’ అంటోందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఈ ఏడాది ‘మేరీ క్రిస్మస్‌’తో ప్రేక్షకుల్ని అలరించిందీ ముద్దుగుమ్మ.


మా పిరియడ్స్‌ని ట్రాక్‌ చేసి..!

2007లో విడుదలైన ‘చక్‌ దే ఇండియా’ చిత్రం ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే! ఆ సినిమాలో హాకీ టీమ్‌ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించిన విద్యా మాల్వాడే.. అప్పటి షూటింగ్‌ అనుభవాల్ని ఇటీవలే ఓ సందర్భంలో నెమరువేసుకుంది. ముఖ్యంగా నెలసరి సమయంలో చిత్ర బృందం తమకు ఎలాంటి సౌకర్యాలు అందించిందో చెప్పుకొచ్చింది.
‘ఈ సినిమాలో మా టీమ్‌లో మేం 16 మంది అమ్మాయిలం. సాధారణంగా క్రీడా నేపథ్యం ఉన్న సినిమా అంటే శారీరక కసరత్తులు, ఆటను సాధన చేయడం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ నెలసరి సమయంలో ఇలాంటి కఠినమైన పనులు ప్రాక్టీస్‌ చేయడం కష్టమే! ఇలాంటి పరిస్థితుల్ని ముందే ఊహించిన చిత్ర బృందం.. మా టీమ్‌లో ఏ అమ్మాయికీ కష్టం కలగకుండా తగిన సదుపాయాలు/సౌకర్యాలు సమకూర్చారు. ఒక ఆంటీని మాకోసం నియమించి.. మా నెలసరి సమయాల్ని ట్రాక్‌ చేయమని చెప్పారు. దాంతో నెలసరిలో ఉన్న వారికి ప్రాక్టీస్‌, షూటింగ్స్‌ నుంచి విరామం ఇచ్చారు. ఆ సమయాన్ని మాకు నచ్చినట్లుగా గడుపుతూ శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను పొందే అవకాశమిచ్చారు. నిజానికి ఇలాంటి చిత్ర బృందంతో కలిసి పనిచేయడం మా అదృష్టం..’ అంటోంది విద్య. ఇటీవలే ‘రుస్లాన్‌’ అనే సినిమాలో మెరిసిందీ బాలీవుడ్‌ బ్యూటీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్