Cannes: బ్లాక్‌ డ్రస్‌లో మెరిసిపోతూ.. బాడీ పాజిటివిటీని చాటిన ఐశ్వర్య!

భారతీయులకు కేన్స్‌ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా 22 ఏళ్ల నుంచి మిస్‌ కాకుండా ఈ చిత్రోత్సవంలో పాల్గొంటోందీ బాలీవుడ్‌ తార. ప్రతిసారీ రెడ్‌ కార్పెట్‌పై విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోతూ ఇటు తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని.. అటు భారతీయతను చాటుతోంది....

Published : 18 May 2024 17:27 IST

(Photos : Twitter)

భారతీయులకు కేన్స్‌ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా 22 ఏళ్ల నుంచి మిస్‌ కాకుండా ఈ చిత్రోత్సవంలో పాల్గొంటోందీ బాలీవుడ్‌ తార. ప్రతిసారీ రెడ్‌ కార్పెట్‌పై విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోతూ ఇటు తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని.. అటు భారతీయతను చాటుతోంది. ఈసారీ ఈ వేడుకల్లో నలుపు రంగు గౌన్‌లో మెరిసిపోయింది ఐష్‌. అయితే ఈసారి తన చేతికి గాయమైనా వేడుకల్లో పాల్గొనడం ఒకెత్తయితే.. నిండైన ఆత్మవిశ్వాసంతో ఈ చిత్రోత్సవంలో బాడీ పాజిటివిటీని చాటడం మరో ఎత్తు! దీనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు ఐష్‌ కూతురు ఆరాధ్య తన తల్లికి చేయందించి సహకరించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఏటా ఫ్రాన్స్‌ వేదికగా జరిగే కేన్స్‌ చిత్రోత్సవంలో పాల్గొన్న తొలి భారతీయ నటిగా ఖ్యాతి గడించింది ఐశ్వర్యారాయ్‌. 2002లో తొలిసారి రెడ్‌కార్పెట్‌పై మెరిసిన ఈ అందాల తార.. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మిస్సవకుండా ఈ వేడుకల్లో పాల్గొంటూ వస్తోంది. ఇలా ఐష్‌ కేన్స్‌కు హాజరవడం ఇది 22వ సారి! అయితే ఈ వేడుకల కంటే ముందే ఆమె కుడిచేతికి గాయమైంది. అయినా కేన్స్‌ వేడుకలకు ఎప్పటిలాగే సిద్ధమైంది ఐశ్వర్య!

బ్లాక్‌ గౌన్‌లో బుట్టబొమ్మలా!
ఏటా కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ఐష్‌ ఫ్యాషన్‌బుల్‌ లుక్స్‌ని చూడ్డానికి ఫ్యాన్స్‌ ఆసక్తి చూపుతుంటారు. అటు మోడ్రన్‌గా కనిపిస్తూనే.. ఇటు నిండుదనం ఉట్టిపడేలా ఉండే దుస్తుల్ని ఎంచుకోవడంలో ఆమెకు ఆమే సాటి! ఈసారీ కేన్స్‌ కోసం అలాంటి దుస్తుల్నే ఎంచుకుందీ బాలీవుడ్‌ అందం. నలుపు-గోల్డ్‌ రంగులు కలగలిసిన ఆఫ్‌-షోల్డర్‌ గౌన్‌ని ఎంచుకున్న ఐష్‌.. దానిపై పఫ్ఫీగా ఉన్న వైట్‌ ష్రగ్‌ని జత చేసింది. ఇక ఆమె డ్రస్‌కి వెనుక వైపు ఉన్న పొడవాటి వెయిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. దానిపై సమాన దూరాల్లో అమర్చిన గోల్డెన్‌ పూలు డ్రస్‌ అందాన్ని మరింత పెంచాయని చెప్పచ్చు. తన అభిరుచులకు తగినట్లుగా ఈ గౌన్‌ని ప్రముఖ డిజైనర్‌ ద్వయం ఫల్గుణీ-షేన్‌ పీకాక్‌ చేతుల మీదుగా డిజైన్‌ చేయించుకుంది ఐష్‌. తక్కువ మేకప్‌, గోల్డెన్‌ హూప్‌ రింగ్స్‌, వదులైన హెయిర్‌స్టైల్‌తో మెరుపులు మెరిపించిన ఈ ముద్దుగుమ్మ రెడ్‌ కార్పెట్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఎప్పటిలాగే ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. ‘బ్యూటిఫుల్‌ మామ్‌.. తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో అదరగొట్టేస్తోంది..’ అంటూ ఈ ముద్దుగుమ్మ లుక్‌ని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

నిండైన ఆత్మవిశ్వాసంతో..!
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గుల కారణంగా బరువు పెరగడం సహజం! ప్రస్తుతం 50 ఏళ్లున్న ఐష్‌ కూడా కాస్త బొద్దుగా మారింది. బిగుతైన తన డ్రస్‌లో ఆ పఫ్ఫీనెస్‌ కనిపిస్తోంది. అయినా ఏమాత్రం సంకోచించకుండా ఎంతో ఉత్సాహంగా రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయింది. ఇలా నిండైన ఆత్మవిశ్వాసంతో బాడీ పాజిటివిటీని చాటుతూ ఫొటోలకు పోజులివ్వడం చూసి.. ఫ్యాన్స్‌ మరింతగా ప్రశంసిస్తున్నారు.
‘శరీరాకృతుల గురించి అందరూ ఎందుకు మాట్లాడుకుంటారో, వాటిని ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తారో అర్థం కాదు. మనమెలా ఉన్నామో అలాగే మనల్ని మనం స్వీకరించడంలోనే అసలైన అందం దాగుంది. అందుకు తాజా ఉదాహరణే మన ఐష్‌. ఎప్పటిలాగే ఈసారీ రెడ్‌కార్పెట్‌పై ది బెస్ట్‌ లుక్‌లో మెరిసిపోయిందామె..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరోవైపు గాయమైనా చేతికట్టుతోనే పోజులివ్వడం చూసి ఆమె అంకితభావాన్నీ ప్రశంసిస్తున్నారు.


ఆరాధ్య.. పక్కనుండాల్సిందే!

ఐష్‌-అభిషేక్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తల్లి నుంచి క్యూట్‌నెస్‌ని, అందాన్ని పుణికిపుచ్చుకున్న ఈ సెలబ్రిటీ డాటర్‌.. ఎప్పుడూ అమ్మనే అనుసరిస్తుంటుంది. ఎక్కడికెళ్లినా అమ్మతో పాటే వెళ్తుంటుంది. ఇక ఈసారి కేన్స్‌కు వెళ్లేటప్పుడు, అక్కడ రెడ్‌కార్పెట్‌ పైకి చేరుకొనే క్రమంలో తల్లికి తన చేయి అందించి సహాయంగా నిలిచింది ఆరాధ్య. ఇలా కేన్స్‌ చిత్రోత్సవంలో భాగంగా ఈ తల్లీకూతుళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఏ తల్లైనా తన బిడ్డ తన పక్కనే, తన సంరక్షణలోనే ఉండాలని కోరుకుంటుంది. నేనూ అంతే! అందుకే ఎక్కడికెళ్లినా నా కూతురిని వెంట పెట్టుకొని వెళ్తుంటా.. తనే నా జాన్‌..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఐష్‌. ఇప్పటికే ఈ తల్లీకూతుళ్లిద్దరూ కలిసి దేశ, విదేశాల్లో జరిగే పలు చిత్రోత్సవాల్లో మెరిశారు. గతంలోనూ ఓసారి ఆరాధ్య తన తల్లితో కలిసి కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై పసుపు రంగు డ్రస్‌లో మెరిసిపోయింది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్