Alia Bhatt: కోపమొస్తే.. ఆ పని చేస్తా!

తెరపై మనకు తెలిసిన తారలు వేరు.. తెరవెనుక వాళ్లు పాటించే జీవనశైలి వేరు! వాళ్లేం తింటారు? ఎలా ఉంటారు? వాళ్లకు నచ్చినవేంటి? నచ్చనివేంటి?.. ఇలా వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆరాటం చాలామందికి ఉంటుంది. అలా తన జీవితం గురించిన పలు ఆసక్తికర....

Published : 01 Apr 2023 16:26 IST

(Photos: Instagram)

తెరపై మనకు తెలిసిన తారలు వేరు.. తెరవెనుక వాళ్లు పాటించే జీవనశైలి వేరు! వాళ్లేం తింటారు? ఎలా ఉంటారు? వాళ్లకు నచ్చినవేంటి? నచ్చనివేంటి?.. ఇలా వాళ్ల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆరాటం చాలామందికి ఉంటుంది. అలా తన జీవితం గురించిన పలు ఆసక్తికర విశేషాల్ని తాజాగా పంచుకుంది బాలీవుడ్‌ అందాల తార ఆలియా భట్‌. ఇటీవలే 30వ పుట్టినరోజు జరుపుకొన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సందర్భంగా తన రోజువారీ అలవాట్లు-అభిరుచులు, తన ఇష్టాయిష్టాల గురించి ఓ యూట్యూబ్‌ వీడియోలో చెప్పుకొచ్చింది. ‘30 Facts As I Turn 30’ పేరుతో రూపొందించిన ఈ వీడియోలో భాగంగా తన జీవితంలోని 30 ఆసక్తికర విశేషాలేంటో చెప్పుకొచ్చింది ఆలియా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

అందాల ఆలియా జీవితం తెరిచిన పుస్తకం. తన కెరీర్‌ గురించే కాదు.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుందామె. అయినా ‘ఇంకా నా జీవితంలో మీకు తెలియని విషయాలు బోలెడున్నాయం’టూ తన పుట్టినరోజు సందర్భంగా మరిన్ని విషయాల గురించి ఓ వీడియో రూపంలో చెప్పుకొచ్చింది. తన చిన్ననాటి ఫొటోలు, అమ్మానాన్నలతో దిగిన ఫొటోలు, తన ఇంటర్వ్యూ సెషన్స్‌.. వంటివన్నీ గుదిగుచ్చి రూపొందించిన ఈ వీడియోలో ఆలియా తన గురించి పంచుకున్న ఆ ఆసక్తికర విశేషాలు, జ్ఞాపకాలు ఇవే!

⚛ నాకు వస్తువులన్నీ చక్కగా, నీట్‌గా సర్దుకోవడమంటే ఇష్టం.. కానీ సర్దుకోను. దాంతో నా వస్తువులు ఎప్పుడూ చిందరవందరగానే ఉంటాయి.

⚛ షాట్‌ పూర్తి కాగానే నా ముక్కును తడుముకుంటా. అసలు ఇలా ఎందుకు చేస్తానో నాకే తెలియదు.

⚛ నాకు చిరాకెక్కువ. ముఖ్యంగా నా వీపుపై ఎవరైనా నిమిరితే నాకు అస్సలు నచ్చదు.

⚛ ఆఫ్‌లైన్‌ షాపింగ్‌ అంటేనే భయమేస్తుంది. స్టోర్‌కి వెళ్లడం, గంటల కొద్దీ సమయం వెచ్చించడం, నచ్చినా-నచ్చకపోయినా ఏదో ఒకటి కొనేయడం నా వల్ల కాదు. అందుకే ఆన్‌లైన్‌ షాపింగ్‌నే ఎంచుకుంటా.

⚛ మా అక్క షాహీన్‌ను వింత వింత ప్రశ్నలన్నీ అడుగుతుంటా.. తను నా అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిస్తుందని, ఈ ప్రపంచంలో తనకు తెలియని విషయం లేదన్నది నా నమ్మకం.

⚛ కన్ను గీటలేను.

⚛ ఉదయాన్నే లేవడం నాకు అలవాటు.

⚛ నాకు కోపమొచ్చినా, చిరాకు కలిగినా, మూడ్‌ బాలేకపోయినా.. ‘FRIENDS’ ఎపిసోడ్‌ చూసి రిలాక్సవుతా.

⚛ చెవులు, గోళ్లు, పాదాలు.. తరచూ శుభ్రం చేసుకోవడం నాకిష్టం.

⚛ వర్తమానంలో కంటే ఆలోచనల్లోనే ఎక్కువ సమయం గడుపుతా.

⚛ చాలామంది లిప్‌స్టిక్‌ స్టిక్‌ కదిలిస్తూ పెదాలకు రంగు వేసుకుంటారు. కానీ నేను పెదాలు కదిలిస్తూ లిప్‌స్టిక్‌ వేసుకుంటా. ఆఖర్లో వేళ్లతో రుద్దుకోవడం నాకు అలవాటు. అంతేకాదు.. దీన్ని తినే అలవాటూ ఉందనుకోండి!

⚛ 6, 9, 1, 8.. ఇవి నా లక్కీ నంబర్స్‌. వీటికి సంబంధించిన వస్తువులు నా దగ్గరున్నాయి.

⚛ ఎలాంటి సాక్ష్యాధారాలతో, నిజానిజాలతో పనిలేకుండా అసలు వాస్తవాన్ని గ్రహించగలిగే వ్యక్తిని నేను.

⚛ నాకు నీళ్లంటే ఇష్టం. ముఖ్యంగా చల్లటి నీళ్లున్న బౌల్‌లో ముఖాన్ని ముంచి ఉంచడమంటే మరీనూ!

⚛ పోహా, ఛాస్ (మజ్జిగ).. నా ఫేవరెట్‌ ఫుడ్‌.. ఇక నా ఫేవరెట్‌ స్నాక్‌ మఖానా.

⚛ షూటింగ్‌ తర్వాత సినిమా కంటే షోస్‌ చూడ్డానికే ఆసక్తి చూపుతాను.

⚛ పుస్తకం పట్టుకుంటే చాలు.. నిద్రొచ్చేస్తుంటుంది.

⚛ జిమ్‌లో పుల్‌ఓవర్‌ వ్యాయామాలు చేయడమంటే ఇష్టం. బర్పీ వర్కవుట్స్‌ అస్సలు నచ్చవు.

⚛ నిద్రలో కలలొచ్చినప్పుడు.. కొన్నిసార్లు ఇది కలే అని పసిగట్టగలను.

⚛ చీకటి గదిలో ఉండడమంటే భయం.

⚛ ఫోన్‌ ఎక్కువగా ఉపయోగిస్తుంటా.

⚛ అబద్ధాలాడతా.. కానీ మంచి నటిని.

⚛ యుక్తవయసులో ఉన్నప్పుడు నా స్నేహితురాలు బాబీతో ఎక్కువగా ఆడుకునేదాన్ని. తనెప్పుడూ నన్ను అబ్బాయిలా ట్రీట్‌ చేసేది.

⚛ చిన్నతనంలో మెహెందీ పెట్టుకోవడమన్నా, దాని వాసనన్నా పడి చచ్చిపోయేదాన్ని. కానీ నా పెళ్లిలో మాత్రం మెహెందీ తెగ బోరింగ్‌గా అనిపించింది. అయినా మేనేజ్‌ చేశా.

⚛ ౧౨ ఏళ్ల వయసులో వాడిన మెమరీ బుక్‌ ఇప్పటికీ నా దగ్గర ఉంది. లెటర్స్‌, స్కెచెస్‌, డ్రాయింగ్స్‌.. ఇలా ఎన్నో మధురానుభూతులు అందులో నిండి ఉన్నాయి.

ఇలా తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విశేషాల్ని గుదిగుచ్చి రూపొందించిన ఈ వీడియో పోస్ట్‌ చేసిన ఒక్క రోజులోనే సుమారు 6 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్