Gerascophobia: వయసైపోతోందన్న భయం మీకూ ఉందా?

వయసును అందానికి కొలమానంగా భావిస్తుంటారు కొందరమ్మాయిలు. ఈ ఆలోచనతోనే తమ అసలు వయసును దాచిపెడుతుంటారు. సమాజం చూసే దృష్టి కోణమే ఇందుకు ప్రధాన కారణం అంటోంది బాలీవుడ్‌ అందాల తార కరీనా కపూర్‌. పలువురి నుంచి ఎదురయ్యే విమర్శల్ని తట్టుకోలేకే.....

Updated : 04 Aug 2022 20:50 IST

అయితే కరీనా చెప్పేది వినండి..!

వయసును అందానికి కొలమానంగా భావిస్తుంటారు కొందరమ్మాయిలు. ఈ ఆలోచనతోనే తమ అసలు వయసును దాచిపెడుతుంటారు. సమాజం చూసే దృష్టి కోణమే ఇందుకు ప్రధాన కారణం అంటోంది బాలీవుడ్‌ అందాల తార కరీనా కపూర్‌. పలువురి నుంచి ఎదురయ్యే విమర్శల్ని తట్టుకోలేకే చాలామంది తమ వయసును తక్కువ చేసి చెబుతారని, అయితే తాను మాత్రం ఇందుకు భిన్నం అంటోంది. వయసు పైబడడం అనేది సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ.. అలాంటప్పుడు దాన్ని దాచుకోవాల్సిన పనేముందంటూ తనను విమర్శించిన వారికి సున్నితంగా బదులిచ్చిందీ అందాల అమ్మ. నిజానికి ఇలా వయసు గురించి ఆలోచిస్తూ భయపడడమనేది ఓ మానసిక సమస్య అని, దాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో అమ్మాయిలు వయసును దాచిపెట్టడానికి గల కారణాలు.. దానివల్ల ఎదురయ్యే పరిణామాలేంటో.. తెలుసుకుందాం రండి..

సినీ తారలకు విమర్శలు కొత్త కాదు. ముఖ్యంగా వయసు, శరీరాకృతి, చర్మ ఛాయ.. వీటి విషయంలో చాలామంది ముద్దుగుమ్మలు సమాజం నుంచి ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే వయసు విషయంలో ఎన్నోసార్లు సూటిపోటి మాటల్ని ఎదుర్కొన్న బెబో.. వాటికి దీటుగా బదులిస్తూ నెటిజన్లకు చురకలంటించేది. ఇక ఇటీవలే ‘లాల్‌ సింగ్‌ చద్దా’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. మరోసారి ఈ విషయంలో స్పందిస్తూ తనను విమర్శించిన వారి నోటికి తాళం వేసింది.

నా వయసు 42.. అయితే ఏంటి?

చాలామంది వయసు తక్కువగా కనిపించడానికి తమపై తాము ఒత్తిడి పెడుతుంటారు.. ఏవేవో ఉత్పత్తులు వాడుతుంటారు. చిట్కాలు పాటిస్తుంటారు. కానీ తాను మాత్రం అలా చేయనంటోంది బెబో.

‘వయసు రీత్యా ఈ సమాజం ఆడవాళ్లను చూసే దృష్టి కోణం ఏళ్లు గడిచినా మారట్లేదు. మన వయసు పెరగడం, వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడమనేది సహజంగా జరిగే ప్రక్రియ. అయినా అందులో అసౌకర్యానికి గురవ్వాల్సిన అవసరం ఏముంది? మన వయసు పెరిగినా మనం అందంగానే కనిపిస్తాం. అయితే సమస్య ఎక్కడుందంటే.. 40 దాటాక ఏదైనా ఫొటో సోషల్‌ మీడియాలో పెట్టగానే అది వైరలైపోతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ల వయసు పైనే ఈ సమాజం దృష్టి పెట్టడం, అదే పనిగా దాని గురించి మాట్లాడడం. ఇలా దీన్ని ఎక్కువ చేసి చూపడం వల్లే చాలామంది ఆత్మన్యూనతకు గురై తమ వయసును దాచిపెడుతున్నారు. ఈ విషయానికొస్తే నేను మాత్రం అలా చేయను. ప్రస్తుతం నాకు 42 ఏళ్లు.. అయినంత మాత్రాన ఎవరో ఏదో అనుకుంటారని తక్కువ వయసున్న వారిలా కనిపించాలని అత్యుత్సాహం ప్రదర్శించను.. నా శరీరంపై ఒత్తిడి పెట్టను. ఈ విషయాన్ని గుర్తెరిగి స్వీయ ప్రేమను పెంచుకుంటే ఇతరుల మాటలు పట్టించుకోవాల్సిన పని ఉండదు.. హ్యాపీగా ఉండచ్చు..’ అంటూ బాడీ పాజిటివిటీని చాటుకుందీ బాలీవుడ్‌ అందం.


ఇవీ కారణమేనట!

అమ్మాయిలు తమ వయసును దాచుకోవడానికి ఇతరుల విమర్శలే కాదు.. వివిధ సౌందర్య ఉత్పత్తుల ప్రకటనల ప్రభావం కూడా ఉందంటున్నారు నిపుణులు. వయసు తక్కువగా ఉన్నప్పుడే అందంగా కనిపిస్తారని, వయసు పెరిగే కొద్దీ అంద విహీనంగా మారిపోతామన్న సందేశం ఇచ్చే విధంగా ఉంటాయి ఈ ప్రకటనలు. వీటిని బలంగా నమ్మే అమ్మాయిలు ఆయా ఉత్పత్తుల్ని వాడుతూ, చిట్కాల్ని పాటిస్తూ.. సత్ఫలితాలు పొందక ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటారు. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో ఒక రకమైన భయం ఆవహిస్తుంది. దీన్నే గెరాస్కోఫోబియా (Gerascophobia)గా పేర్కొంటున్నారు నిపుణులు. అయితే ఇలా అమ్మాయిలే కాదు.. తక్కువ వయసున్న అమ్మాయిలతో డేటింగ్‌ చేసే అబ్బాయిలూ తమ వయసును దాస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఏదేమైనా ఇలా వృద్ధాప్యం గురించి అనవసరమైన భయాందోళనలకు లోనయ్యే ఈ పరిస్థితి క్రమంగా మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ ఫోబియాను ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదంటున్నారు.


ఈ లక్షణాలు కనిపిస్తే..!

వివిధ మానసిక రుగ్మతల్లాగే ఈ గెరాస్కోఫోబియాను కూడా కొన్ని లక్షణాలతో గుర్తించచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా ఈ మార్పులు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవడం మంచిదంటున్నారు.

గుండె దడగా అనిపించడం.. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం..

నెర్వస్‌నెస్..

కాలం, వాతావరణంతో సంబంధం లేకుండా విపరీతంగా చెమటలు పట్టడం.. అంతలోనే శరీరం చల్లబడడం..

జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం..

శారీరక నొప్పులు వేధించడం..

ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండాలనిపించడం..

ఎక్కువగా యాంటీ-ఏజింగ్‌ చికిత్సలు తీసుకోవడం..

వయసు తక్కువగా కనిపించేందుకు పలు కాస్మెటిక్‌ సర్జరీలు చేయించుకోవడం..

ఇలాంటి పనులు, ఆలోచనలపై మీ శరీరం, మనసు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లయితే.. అది గెరాస్కోఫోబియాగా అనుమానించి డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.


పరిష్కారం.. మన చేతల్లోనే..!

ఈ మానసిక రుగ్మతను దూరం చేసుకోవడానికి నిపుణుల వద్ద చికిత్స తీసుకుంటూనే.. స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

వయసు పెరగడమనేది ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా జరిగే ప్రక్రియ. ఈ విషయాన్ని గ్రహించి అంగీకరించినప్పుడు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే స్వీయ ప్రేమను పెంచుకోవడం వల్ల కూడా హ్యాపీగా ఉండచ్చు.

వయసు పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఎదుగుతాం. ఇక ముందు కూడా మరింత పరిణతి సాధిస్తాం.. కాబట్టి ఈ క్రమంలో మీరు సాధించిన విజయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే నిరుత్సాహం దూరమై.. ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది.. పైగా పెరిగే వయసును ఆస్వాదిస్తారు కూడా!

వయసుతో పాటే అనారోగ్యాల బెడద కూడా ఎక్కువవుతుంటుంది. ఈ ఆందోళన లేకుండా ఉండాలంటే తరచూ చెకప్స్‌ చేయించుకోవడం, వైద్యుల సలహా మేరకు మీకున్న అనారోగ్యాలను బట్టి మందులు వాడడం మంచిది. తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు.. వయోభారంగా అనిపించదు.

40 దాటాక చాలామంది మహిళల్ని వేధించే సమస్య మెనోపాజ్‌. కొంతమంది ముందు నుంచే దీన్ని తలచుకొని భయపడుతుంటారు. అయితే చక్కటి పోషకాహారం, వ్యాయామాలు చేయడం వల్ల దీని దుష్ప్రభావాల్ని చాలావరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఈ దశనూ సౌకర్యవంతంగా మలచుకోవచ్చంటున్నారు.

మానసిక సమస్యల్ని ఎదుర్కోవడానికి మన చుట్టూ సంతోషకరమైన, ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండేలా ఎలా జాగ్రత్తపడతామో.. గెరాస్కోఫోబియాను దూరం చేసుకోవడానికీ ఈ చిట్కాను పాటించచ్చంటున్నారు నిపుణులు. మీకు నచ్చిన పనులు చేయడం, మీకు ఇష్టమైన వారి మధ్య మెలగడం.. వంటివన్నమాట!

వయసు పెరిగే కొద్దీ మానసిక, శారీరక ఉత్సాహాన్ని పెంపొందించుకోవడం కోసం కొత్త సవాళ్లను స్వీకరించడం, సమాజానికి మీ వంతుగా సహాయం చేయడం.. వంటివీ తోడ్పడతాయి.

కొందరు సెలబ్రిటీలు, సామాన్యులు.. పెరిగే వయసును ఆస్వాదిస్తూనే.. మరోవైపు తమకు నచ్చిన రంగంలో రాణిస్తుంటారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటే మనసులో ఉండే ప్రతికూల ఆలోచనలన్నీ పటాపంచలైపోతాయి.

అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం అంతంతమాత్రంగానే అనిపిస్తే మాత్రం.. నిపుణుల సలహా మేరకు థెరపీలు, కౌన్సెలింగ్‌.. వంటివి ప్రయత్నించచ్చు. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి.. సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్