Holi: మగాళ్ల పైన రంగులు చల్లుతూ.. కర్రలతో కొడుతూ!

హోలీ అంటే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా జరుపుకొనే పండగ. కానీ అక్కడ రంగులతో పాటు కర్రలకూ పని చెబుతుంటారు. రంగులు పులుముకుంటూ ఎంజాయ్‌ చేయడమే కాదు.. మహిళలు పురుషుల వెంట పడుతూ కర్రలతో కొడుతుంటారు కూడా! అయితే ఇదేదో పగతోనో, ప్రతీకారంతోనో అనుకుంటే పొరపడినట్లే!

Published : 25 Mar 2024 12:53 IST

హోలీ అంటే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సరదాగా జరుపుకొనే పండగ. కానీ అక్కడ రంగులతో పాటు కర్రలకూ పని చెబుతుంటారు. రంగులు పులుముకుంటూ ఎంజాయ్‌ చేయడమే కాదు.. మహిళలు పురుషుల వెంట పడుతూ కర్రలతో కొడుతుంటారు కూడా! అయితే ఇదేదో పగతోనో, ప్రతీకారంతోనో అనుకుంటే పొరపడినట్లే! ఎందుకంటే హోలీ సరదాల్లో ఇదీ ఓ భాగమే! ద్వాపర యుగం నుంచి కొనసాగుతూ వస్తోన్న ఈ వింత ఆచారం అక్కడి వారికి ఎంతో సంతోషాన్ని, సరదానూ పంచుతుందట! మరోవైపు స్త్రీపురుష సమానత్వానికీ నిదర్శనంగా నిలుస్తోంది ఇక్కడి పండగ. మరి, హోలీ వేడుకల్లో భాగంగా మహిళలు పురుషుల్ని కర్రలతో బాదే ఈ సంప్రదాయం ఎక్కడుంది? అసలెందుకిలా? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

లఠ్‌మార్‌ హోలీ.. ఈ పేరు చాలామందికి సుపరిచితమే! ఉత్తరప్రదేశ్‌లోని బర్సానా, నంద్‌గావ్‌ ప్రాంతాల్లో ప్రాచీన కాలం నుంచే ఈ తరహా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలంతా ఒక్క చోట చేరి రంగులు చల్లుకోవడంతో.. మనుషులతో పాటు నేల కూడా రంగుల్లో తడిసిముద్దవుతుంది. ఇక్కడి హోలీ సంబరాల్ని ప్రత్యక్షంగా చూడడానికి దేశవిదేశాల నుంచి పర్యటకులు పెద్ద ఎత్తున తరలివస్తారు.. ఈ అనుభూతుల్ని ఫొటోలు, వీడియోల్లో బంధిస్తూ తమ వెంట తీసుకెళ్తారు.

రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా!

అయితే ఇక్కడి హోలీ సంబరాల్లో రంగులతో పాటు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే మహిళలు పురుషుల్ని కర్రలతో కొట్టడం. లఠ్‌మార్‌ అంటే కర్రలతో కొట్టడం అని అర్థం.. అందుకే ఈ హోలీ సంబరాలకు ‘లఠ్‌మార్‌ హోలీ’ అనే పేరొచ్చింది. అయితే ఈ సంప్రదాయం దశాబ్దాలు, శతాబ్దాలుగా కాదు.. యుగాలుగా కొనసాగుతూ వస్తోంది. ద్వాపర యుగంలో రాధాకృష్ణుల ప్రేమ ఈ హోలీ సంబరాలకు అంకురార్పణ చేసింది. బర్సానా అనే గ్రామంలో నివసించే రాధను, ఆమె స్నేహితురాళ్లను.. నంద్‌గావ్‌ వాసి అయిన శ్రీకృష్ణుడు తన చిలిపి చేష్టలతో ఏడిపించడం, తిరిగి వాళ్లు కర్రలతో సరదాగా కృష్ణుడిని దండించడం.. ఇలా ఈ క్రమంలోనే ‘లఠ్‌మార్‌ హోలీ’కి అంకురార్పణ జరిగినట్లు స్థానికులు చెబుతారు. అప్పట్నుంచి ఏటా ఈ రెండు ప్రాంతాల్లో లఠ్‌మార్‌ హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయట! ఈ క్రమంలోనే ఈ రెండు గ్రామాల ప్రజలంతా ఒక్కచోట చేరి.. హుషారెత్తించే సంగీతం ఏర్పాటుచేసుకొని.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్‌ చేస్తారు. అలాగే పండగ సందర్భంగా ఇక్కడి వీధుల్నీ రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరిస్తారు.

రంగులు చల్లుతూ.. కర్రలతో కొడుతూ!

ఇలా పండగలో భాగంగానే నంద్‌గావ్‌కు చెందిన పురుషులు బర్సానాకు చేరుకుంటారు. అక్కడి మహిళలు కర్రలతో వీరికి స్వాగతం పలుకుతారు. వారిపై రంగులు చల్లుతూ, కర్రలతో సరదాగా కొడుతుంటే.. వారు ఈ దెబ్బల్ని తప్పించుకోవడానికి ప్రయత్నించడం.. చూసేవారికి నవ్వు తెప్పిస్తుంది. ఇలా వీళ్లు ఆడే లఠ్‌మార్‌ హోలీ రాధాకృష్ణుల ప్రేమానుబంధాన్ని మరోసారి కళ్లకు కడుతుంది. అయితే ఈ హోలీలో స్త్రీపురుషులిద్దరూ సమ్మిళితం కావడంతో.. ఈ పండగ స్త్రీపురుష సమానత్వానికి, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తుందని అక్కడి వారు చెబుతున్నారు. ఇలా మొత్తానికి ఈ ప్రత్యేకమైన హోలీ పండగ దేశవిదేశీ టూరిస్టుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.. వీక్షకులకు సరికొత్త అనుభూతుల్ని పంచుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్