Pomodoro Technique: 25 నిమిషాలు పని.. 5 నిమిషాల విరామం!

ఓవైపు గడియారం వేగంగా పరిగెత్తుతుంటుంది.. మరోవైపు చేయాల్సిన పనులు ఓ పట్టాన తరగవు. ఆఫీస్‌ టైమైపోతోందని, వేళకు పని పూర్తికాక టెన్షన్‌ పడిపోతుంటారు చాలామంది. ఈ ఒత్తిడి పని ఉత్పాదకత పైనే కాదు.. మన ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే కెరీర్‌లో చక్కటి సమయపాలన అవసరమని నిపుణులు చెబుతుంటారు....

Published : 19 May 2024 19:04 IST

ఓవైపు గడియారం వేగంగా పరిగెత్తుతుంటుంది.. మరోవైపు చేయాల్సిన పనులు ఓ పట్టాన తరగవు. ఆఫీస్‌ టైమైపోతోందని, వేళకు పని పూర్తికాక టెన్షన్‌ పడిపోతుంటారు చాలామంది. ఈ ఒత్తిడి పని ఉత్పాదకత పైనే కాదు.. మన ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే కెరీర్‌లో చక్కటి సమయపాలన అవసరమని నిపుణులు చెబుతుంటారు. మరి, ఇందుకు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ‘పొమొడారో పద్ధతి’ని పాటిస్తే సరి! విద్యార్థుల దగ్గర్నుంచి సీఈవోల దాకా.. ఎంతోమంది ఈ టెక్నిక్‌ని అనుసరిస్తూ.. నిర్దేశిత లక్ష్యాల్ని అనుకున్న సమయానికి చేరుకున్నారట! మరి, అటు పనితో పాటు ఇటు మానసిక ప్రశాంతతకూ ప్రాధాన్యమిచ్చే ఈ టైమ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

టొమాటో టైమర్‌తో!
అటు విద్యార్థులకైనా, ఇటు ఉద్యోగులకైనా.. ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్నిసార్లు అర్థం కాదు. మరికొన్నిసార్లు మనసు బాగోలేక చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. దీనివల్ల పనులు వేళకు పూర్తికాక ఆలస్యమవుతుంటుంది.. ఇదే వర్క్‌ బర్నౌట్‌ (పనివల్ల కలిగే విపరీతమైన ఒత్తిడి)కి దారితీస్తుంది. ఇటలీకి చెందిన ఫ్రాన్సెస్కో సిరిల్లో కూడా తాను చదువుకొనే రోజుల్లో ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొన్నాడట! దీన్నుంచి బయటపడేందుకు ఆయన చేసిన ఆలోచనల నుంచి పుట్టిందే ‘పొమొడారో పద్ధతి’. చదువులో, ఉద్యోగాల్లో చక్కటి సమయపాలన పాటించేందుకు ఉపయోగపడే అద్భుత టెక్నిక్‌ ఇది! ‘పొమొడారో’ అంటే ఇటాలియన్‌లో టొమాటో అని అర్థం! ఈ పేరుకు తగ్గట్లే ఈ సమయపాలన పద్ధతిలో భాగంగా టొమాటో ఆకృతిలో ఉన్న ఒక టైమర్‌ని సెట్‌ చేసుకొని.. దాని ప్రకారం అతడు చదువుపై దృష్టి పెట్టాడట! ఇది సానుకూల ఫలితాలనివ్వడంతో.. 2006లో తాను రాసిన ఓ పుస్తకంలో ఈ పద్ధతి గురించి ప్రస్తావించారట! అలా ఈ టైమ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌ గురించి ప్రపంచానికి మొదటిసారి తెలిసింది. ఇక అప్పట్నుంచి సామాన్యుల దగ్గర్నుంచి ప్రముఖుల దాకా ఎంతోమంది ఈ పద్ధతిని పాటించి విజయం సాధించినట్లు కెరీర్‌ నిపుణులు చెబుతున్నారు.

పనుల్ని విభజించుకొని..!
‘పొమొడారో’ పద్ధతిలో భాగంగా.. కొన్ని దశల్ని పాటిస్తూ నిర్దేశిత పనుల్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో..
*ముందుగా ఆ రోజు పూర్తి చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యతను బట్టి విభజించుకోవాలి.
*ఇప్పుడు 25 నిమిషాల టైమర్‌ని సెట్‌ చేసుకొని.. మొదట చేయాల్సిన పనిపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా చూసుకోవాలి.
*ఒకవేళ ఏదైనా అంతరాయం కలిగినా, మీ అవసరం సహోద్యోగులకు కలిగినా.. దాన్ని నోట్‌ చేసుకొని తర్వాత పూర్తిచేసేలా ప్లాన్ చేసుకోవాలి.
*ఇలా సమయం పూర్తికాగానే అలారం మోగుతుంది. అంటే.. ఒక ‘పొమొడారో’ వ్యవధి పూర్తయినట్లు లెక్క! ఇప్పుడు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి.
*ఆపై మరో 25 నిమిషాల సమయం పనికి కేటాయించుకోవాలి. ఈ క్రమంలో మొదట ప్రారంభించిన పని పూర్తైతే రెండో పనిపై దృష్టి పెట్టడం.. లేదంటే మొదటి పనినే పూర్తి చేయాలి.
*ఇలా నాలుగు ‘పొమొడారోలు’ (అంటే.. సుమారు రెండు గంటలు) పూర్తయ్యాక పావుగంట లేదా అరగంట పాటు విరామం తీసుకోవాలి.
*రోజంతా ఈ తరహా పని పద్ధతిని కొనసాగించాలి.
ఇలా తమ తమ పనుల్ని బట్టి కొందరు రోజులో 8 పొమొడారో సెషన్స్‌ని ఉపయోగించుకుంటే.. మరికొందరు 12/16 సెషన్స్‌లో పని పూర్తిచేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

ఏకాగ్రత.. ఉత్పాదకత!
* పొమొడారో పని విధానం వల్ల.. నిర్దేశిత సెషన్స్‌లో పని పూర్తి చేయాలన్న ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా అదనపు సమయం కేటాయించాల్సిన అవసరం రాదు. ఇలా వేళకు పని పూర్తవడం వల్ల మనలో ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది.
*మధ్యమధ్యలో విరామాలు తీసుకొని.. ఆ సమయాన్ని నచ్చిన పనుల కోసం లేదంటే నచ్చిన వారితో మాట్లాడడానికి కేటాయిస్తే.. మానసిక ప్రశాంతత సొంతమవుతుంది.
*ప్రతి పొమొడారో సెషన్‌ ముగిశాక.. మనం పూర్తిచేసిన పనుల్ని నోట్‌ చేసుకోవాలి. ఇది మనకు ప్రోత్సాహకరంగా ఉండడంతో పాటు.. ఇంకా ఎన్ని పనులు చేయాల్సి ఉందో కూడా సులభంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల కూడా సమయం వృథా కాకుండా ఉంటుంది.
*ఈ పద్ధతిని సక్రమంగా పాటిస్తున్నట్లయితే.. రోజులు గడిచే కొద్దీ పని వేగం కూడా పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా మరింత వేగంగా పనులు పూర్తి చేసే సామర్థ్యం అలవడుతుందని అంటున్నారు.
*అంతేకాదు.. అనుభవం గడించే కొద్దీ వారం, నెల రోజుల్లో పూర్తిచేయాల్సిన పనులు పూర్తి చేయడానికి కూడా ముందుగానే ప్రణాళిక వేసుకొనే నైపుణ్యాలు అలవడతాయంటున్నారు నిపుణులు.

*ఉదయాన్నే ఎంతో యాక్టివ్‌గా ఆఫీస్‌కి వస్తుంటారు కొందరు. అయితే పని మొదలుపెట్టే క్రమంలో మాత్రం ఎక్కడ ప్రారంభించాలో వారికి అర్థం కాదు. పొమొడారో పద్ధతిని పాటించడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టచ్చంటున్నారు నిపుణులు. పూర్తిచేసిన, పూర్తి చేయాల్సిన పనుల గురించి స్పష్టత రావడమే ఇందుకు కారణమంటున్నారు.
*ప్రారంభంలో ఎంతో ఉత్సాహంగా పని మొదలుపెట్టినా.. సమయం గడిచే కొద్దీ కొంతమంది నీరసించిపోతారు. తద్వారా పని వేగం నెమ్మదిస్తుంది. పొమొడారో పద్ధతిలో భాగంగా అరగంటకోసారి విరామం తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టచ్చు.. మరింత ఉత్సాహంగా ముందుకు సాగచ్చు.
*గంటల తరబడి కూర్చొని పనిచేయడం వల్ల చాలామందిలో నడుంనొప్పి, మెడనొప్పి, స్థూలకాయం.. వంటి అనారోగ్యాలతో పాటు మానసికంగానూ ఒత్తిడికి గురవుతుంటారు. పొమొడారో పద్ధతిలో భాగంగా తీసుకొనే స్వల్ప విరామాలతో ఈ సమస్యలకు దూరంగా ఉండడంతో పాటు.. ఉత్సాహంగా పనిచేయచ్చు.. మానసికోల్లాసాన్నీ పెంపొందించుకోవచ్చు. ఇలా ఏకాగ్రతతో, ఉత్సాహంగా పనిచేయడం వల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుంది.. ఇదే మన కెరీర్‌ అభివృద్ధికి బాటలు వేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్