నేనంటే ప్రాణమంటోంది.. కానీ!

నా వయసు 17. ఇంటర్‌ చదువుతున్నాను. గతంలో దాదాపు ఏడాది పాటు డిప్రెషన్‌తో బాధపడ్డా. ఈ సమయంలో నా ప్రాణ స్నేహితురాలు నాకు ఎంతో సహాయం చేసింది. ఆమె వల్లే నేను తిరిగి కోలుకోగలిగాను. తనలాంటి స్నేహితురాలు ఉండడం నా అదృష్టం. కానీ, ఈ మధ్య తన ప్రవర్తన నాకు నచ్చడం లేదు.

Published : 20 Apr 2024 12:54 IST

నా వయసు 17. ఇంటర్‌ చదువుతున్నాను. గతంలో దాదాపు ఏడాది పాటు డిప్రెషన్‌తో బాధపడ్డా. ఈ సమయంలో నా ప్రాణ స్నేహితురాలు నాకు ఎంతో సహాయం చేసింది. ఆమె వల్లే నేను తిరిగి కోలుకోగలిగాను. తనలాంటి స్నేహితురాలు ఉండడం నా అదృష్టం. కానీ, ఈ మధ్య తన ప్రవర్తన నాకు నచ్చడం లేదు. తను చేసే కొన్ని పనులు నాలో ఆందోళనను పెంచుతున్నాయి. ఉదాహరణకు.. ఈ మధ్య తనను చాలాసార్లు మా ఇంటికి పిలిచా.. కానీ తను మాత్రం ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటోంది. తనకు కూడా నేనంటే ప్రాణమని చెబుతోంది.. కానీ తన చేతల్లో ఎక్కడా నాపై అంతకుముందున్న ప్రేమ కనిపించట్లేదు. ఇలా నా ప్రాణ స్నేహితురాలి గురించిన ఆలోచనలు గత కొంత కాలంగా నన్ను వేధిస్తున్నాయి. నేను తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? ఈ ఆలోచనల్లోంచి బయటపడాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు మీ స్నేహితురాలిపై ఎక్కువగా ఆధారపడినట్టు అనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఒకరిపై ఒకరు ఆధారపడడం సహజమే అయినప్పటికీ దానికంటూ ఒక పరిధి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని విషయాల్లో ఒకరి నిర్ణయాలు మరొకరిని ప్రభావితం చేసే విధంగా ఉండకూడదు. అది మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించచ్చు. కాబట్టి, ప్రాణ స్నేహితురాలైనా తనకు మీరు అవసరమైనంత మేరకే స్వేచ్ఛ ఇవ్వడానికి ప్రయత్నించండి.. అవసరమైనప్పుడే మీ విషయాల్లో తన సలహాలు అడగండి.

ఒక వ్యక్తి మరొకరి గురించి ఇంతలా ఆలోచించడం, ప్రతి విషయంలో వారిపై ఆధారపడడం అంత మంచిది కాదు. కాబట్టి మీ స్నేహితురాలితో ఒకసారి మనసు విప్పి మాట్లాడండి. ఈ మధ్య తన ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి విడమరచి చెప్పండి. దానివల్ల మీరు పడుతున్న ఇబ్బందుల్నీ ఆమె ముందుంచండి. ఈ క్రమంలో ఆమె మనసులో ఏముందో బయటపడుతుంది. దాన్ని బట్టి మీరు మారాలా? తను తన ప్రవర్తనను మార్చుకోవాలా? అన్న విషయాలు అర్థమవుతాయి. అలాగే తన గురించిన అతి ఆలోచనలూ మీలో తగ్గుముఖం పడతాయి.

ఓవైపు మీరు డిప్రెషన్‌ నుంచి బయటపడడానికి మీ స్నేహితురాలే కారణమని చెబుతున్నారు.. మరోవైపు తను చేసే పనులు మీలో ఆందోళన పెంచుతున్నాయని అంటున్నారు. తన వ్యక్తిగత సమస్యలు, ఇతర కారణాల వల్ల మిమ్మల్ని ఇలా దూరం పెట్టి ఉండచ్చేమో? అన్న దిశగా ఓసారి ఆలోచించి చూడండి. ఈ సానుకూల దృక్పథమే మిమ్మల్ని పాజిటివిటీ దిశగా నడిపిస్తుంది.. ఇద్దరి మధ్య అనుబంధం దెబ్బతినకుండానూ ఉంటుంది. ఇక మీ అతి ఆలోచనలు చూస్తుంటే.. మీలో డిప్రెషన్‌ తాలూకు లక్షణాలు ఇంకా ఉన్నాయనిపిస్తోంది. దీన్నుంచి పూర్తిగా బయటపడాలంటే అభిరుచులే అందుకు చక్కటి మార్గం. కాబట్టి నచ్చిన వ్యాపకంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. యోగా, పుస్తక పఠనం.. వంటివి జీవనశైలిలో చేర్చుకోండి. నచ్చిన వారితో మాట్లాడితే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా మీ సమస్య పరిష్కారమవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే మానసిక నిపుణుల కౌన్సిలింగ్‌ మీకు మేలు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్