ఇలా ఉంటేనే స్వేచ్ఛగా.. స్వతంత్రంగా..!

మహిళలుగా మనం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నాం. స్వతంత్రంగా జీవిస్తున్నాం. అయితే డబ్బు, కెరీర్... ఇలాంటి వాటిలోనే కాదు.. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది....

Published : 15 Aug 2023 12:04 IST

మహిళలుగా మనం అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నాం. స్వతంత్రంగా జీవిస్తున్నాం. అయితే డబ్బు, కెరీర్... ఇలాంటి వాటిలోనే కాదు.. జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ స్వతంత్రంగా జీవించగలిగితేనే మనం కోరుకునే సంతృప్తి లభిస్తుంది. ఈ క్రమంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడానికి దోహదపడే కొన్ని అంశాలేంటో చూద్దాం...

ఆత్మవిశ్వాసంతో ముందుకు..
ఏ విషయంలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మన సొంతమవుతుందనే విషయం తెలిసిందే. అయితే కొన్ని విషయాల్లో లోపల ఏదో భయం, బెరుకు మనల్ని వెంటాడుతూ స్వేచ్ఛగా జీవించకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఉదాహరణకు.. మీకు పాటలంటే చాలా ఇష్టం.. మీ గొంతు కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది. కానీ ఎవరిముందైనా పాడమంటే మాత్రం చాలా భయం. దీనివల్ల మీకున్న అవకాశాలను కోల్పోవడమే కాదు.. మీలోని ప్రతిభను నలుగురికీ చూపే అవకాశాన్నీ చేజార్చుకుంటారు. దీనికి బదులుగా కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతే విజయం మీ వెంటే ఉంటుంది. అయితే దారిలో అపజయాలు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. దీనివల్ల స్వేచ్ఛగా మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసే అవకాశం మనకు లభిస్తుంది.

ఆర్థిక స్వేచ్ఛ..
మీరు నిజంగా ఎవరిమీదా ఆధారపడకుండా.. స్వతంత్రంగా జీవించాలంటే మీ సంపాదన మీకే ఉండాలి. అయితే సంపాదించే డబ్బును విచ్చలవిడిగా కాకుండా అవసరమున్న సందర్భాల్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అంతేగానీ మా డబ్బు.. మా ఇష్టం.. దేనికైనా ఖర్చు పెట్టుకుంటామంటే.. భవిష్యత్తు అవసరాలకు డబ్బు మిగలదు. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇలా ఇతరుల మీద ఆధారపడటం వల్ల స్వతంత్రం లేకుండా పోయే సందర్భాలు కూడా ఎదురవుతాయి. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా మన భవిష్యత్తుకు తగ్గట్టుగా మనమే ప్లాన్ చేసుకొని పొదుపు చేస్తే ఆర్థికంగానూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో జీవించగలుగుతాం.

మాట్లాడే స్వేచ్ఛ
ఎవరితో అయినా సరే.. భయపడకుండా మనసులోని భావాలను స్వేచ్ఛగా వెల్లడించే గుణం అలవాటు చేసుకోవడం మంచిది. ఇతరులతో మాట్లాడటానికి భయపడితే మనలోని భావాలన్నీ లోపలే మిగిలిపోతాయి. అలా భావాలన్నీ గూడుకట్టుకొని మిగిలిపోయినప్పుడు జీవితంలో అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. ఒక్కోసారి కెరీర్లో కొన్ని చక్కటి అవకాశాలను కూడా కోల్పోవాల్సి రావచ్చు. మీ జీవితం అలా కాకుండా ఉండాలంటే ఎంతమంది ముందైనా మీ మనసులోని మాట చెప్పడానికి వెనకడుగు వేయొద్దు. ఎదుటివారు మీకంటే వయసులోనో, హోదాలోనో పెద్దవారని భయపడాల్సిన అవసరం లేదు. మీ అభిప్రాయాలు తప్పు కానంతవరకూ మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇతరులు మీ మీద అభాండాలు వేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కూడా మర్చిపోవద్దు.

మీకు నచ్చిందే..
స్వతంత్రంగా బతకడానికి మంచి నడవడిక, విద్యాబుద్ధులు కూడా చాలా అవసరం. వీటివల్ల భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలు అలవడతాయి. అలాగే ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవడమూ ముఖ్యమే. ఇవన్నీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడతాయి. అయితే చదువు, ఉద్యోగం విషయంలో వేరొకరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ మనసు చెప్పిన రంగాన్ని ఎంచుకోవడం వల్ల ఆ వృత్తిలో మీరు ఉన్నత స్థానాలకు ఎదగగలుగుతారు. అలా కాకుండా ఎవరో చెప్పారని మీ కెరీర్‌ని ఎంచుకుంటే మీకు నచ్చని వృత్తిలో మిగిలిపోవాల్సి రావచ్చు..

మీరే బెస్ట్!
మీ మనసు స్వతంత్రంగా ఆలోచించాలంటే మిమ్మల్ని మీరు ఇంకొకరితో పోల్చుకోవడం మానేయాలి. ఒకరితో పోల్చుకుంటూ ఉండటం వల్ల వాళ్ల దగ్గర ఉన్నదాన్నే మనసు కోరుకుంటూ ఉంటుంది. జీవితంలో మీకు ఎందులో అసలైన ఆనందం లభిస్తుందో మీ మనసు మీకు సూచించలేకపోతుంది. అందుకే ప్రతి విషయంలోనూ మీరే బెస్ట్ అనుకోండి. ఇతరులతో పోల్చుకోవద్దు. నెగెటివ్ ఆలోచనలను మీ దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దు. ఇతరులతో పోలిక వల్ల అసూయ, ద్వేషం లాంటి నెగెటివ్ ఫీలింగ్స్‌కి మీరు దగ్గరవుతారు. అందుకే మీలో ఉన్న మంచి లక్షణాలను తెలుసుకోండి. ఏదైనా సందర్భంలో ఇతరులతో పోల్చుకున్నా దాన్ని నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా తీసుకొని వారిలోని మంచి గుణాలను మీరూ అలవర్చుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉంటుంది.

శరీరం పట్ల శ్రద్ధ
ఇంకొకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం అవసరం. అలా ఉన్నప్పుడే మనం ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతాం. అందుకే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. మంచి ఆహారం తినడం, వేళకు పడుకోవడం.. ఇవన్నీ అలవాటు చేసుకోవాలి.

మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి!
అన్నింటికంటే ముఖ్యమైన సంగతి.. జీవితంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలనుకుంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీకు ఏం అవసరమో గుర్తించి, దాన్ని మీకు మీరే అందించుకోండి. మీ శరీరానికి ఆరోగ్యాన్నందించే అలవాట్లు చేసుకోండి. మీ మనసును మీరే ఇబ్బంది పెట్టకుండా నడుచుకోండి. ఈ క్రమంలో ఇతరులను గౌరవించి, వారితో ప్రేమగా ఉండడమూ ముఖ్యమే.. అయితే దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్