ఉదయం లేవగానే ఈ పొరపాట్లు వద్దు..!

చాలామంది ఉత్సాహంగా ఉండాలని ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం, టైమవుతోందని బ్రేక్‌ఫాస్ట్ తినకుండానే ఆఫీసుకి వెళ్లడం.. వంటివి చేస్తుంటారు. వీటివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది....

Published : 31 Mar 2024 10:19 IST

చాలామంది ఉత్సాహంగా ఉండాలని ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం, టైమవుతోందని బ్రేక్‌ఫాస్ట్ తినకుండానే ఆఫీసుకి వెళ్లడం.. వంటివి చేస్తుంటారు. వీటివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లేంటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకుంటే మంచి జీవన విధానంతో పాటు రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండచ్చంటున్నారు నిపుణులు.

కుడిపక్కకు తిరిగి..
కొంతమంది ఉదయం నిద్ర లేచేటప్పుడు వెల్లకిలా పడుకొని అదే పొజిషన్‌లోనే లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అలా లేవడం వల్ల బిగుసుకుపోయి గట్టిగా తయారైన కండరాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం లేచేటప్పుడు కుడిపక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం మంచిది. ఫలితంగా శరీరంలోని అన్ని అవయవాలకు సరైన శక్తి సరఫరా అవుతుంది. తద్వారా రోజంతా ఉల్లాసంగా ఉండచ్చు.

ఆదరాబాదరా వద్దు..
కొంతమంది ఉదయం త్వరగా నిద్ర లేచినా ఆఫీసు టైం వరకు ఏదో ఒక పని చేస్తూ ఆఖరి క్షణాల్లో ఆదరాబాదరాగా రడీ అవుతుంటారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి గురై క్రమంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఆ రోజుకు అవసరమయ్యేవన్నీ ముందురోజు రాత్రే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆఫీసుకి వేసుకునే డ్రస్, వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులు.. వంటివన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకోవడం వల్ల తర్వాతి రోజు ఉదయం ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్ర లేవడానికి ఆస్కారం ఉంటుంది.

బ్రేక్‌ఫాస్ట్‌ మానద్దు!
అలాగే ఆఫీసుకు టైమవుతున్న క్రమంలో బ్రేక్‌ఫాస్ట్ తినడం కూడా మానేస్తుంటారు మరికొంతమంది. ఇలా పదే పదే చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనమవడంతో పాటు స్థూలకాయం, మధుమేహం.. వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయం లేచిన దగ్గర్నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌కు సమయం చక్కగా సరిపోతుంది.

లేవగానే మొబైలా??
చాలామంది ఉదయం లేవగానే చేసే మరో పెద్ద పొరపాటేంటంటే.. లేచిన వెంటనే ఫోన్లో మెసేజెస్ చెక్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడడం, చాటింగ్ చేయడం.. ఈ క్రమంలో ఒక్కోసారి మూడ్ అంతా అప్‌సెట్ అవుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి అత్యవసర కాల్స్, మెసేజెస్ చేసే పనుంటే తప్ప ఉదయం లేవగానే మొబైల్స్ జోలికి వెళ్లకపోవడం చాలా ఉత్తమం. దీనికి బదులుగా ఉదయం లేవగానే కాసేపు ఒక మంచి పుస్తకం చదవడం చాలా మంచి అలవాటు. దీనివల్ల మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.

వార్మప్‌తో మొదలుపెట్టి..!
రోజంతా శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేయడం ఎంతో అవసరం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేంటంటే.. ఉదయం లేవగానే కొంతమంది అధిక బరువులెత్తడం, ఇతర కఠినమైన వ్యాయామాలు చేయడం.. వంటివి చేస్తుంటారు. ఇవి కండరాల ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఉదయం లేచే సమయానికి కండరాలు, ఎముకలు గట్టిగా, బిగుసుకుపోయి ఉంటాయి. కాబట్టి వీటిని త్వరత్వరగా కదిలించకుండా నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేయాలి. అందుకే ఉదయం వ్యాయామానికి ఉపక్రమించే ముందు కాసేపు వార్మప్ చేయడం, యోగా, ధ్యానం.. వంటివి చేయడం మంచిది. దీంతో కండరాలు రిలాక్సయ్యే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్