Beauty - Fashion: ఆసక్తి ఉంటే ఈ రంగాల్లో అవకాశాలెన్నో!

ఒకప్పుడు తమ అభిరుచికి సంబంధించిన పనులను ఖాళీ సమయాల్లో చేసేవారు. కానీ, ఇప్పుడు చాలామంది తమ అభిరుచినే కెరీర్‌గా మలచుకుంటున్నారు. దాంతో ఇటు ఆత్మసంతృప్తిని పొందడంతో పాటు ఆదాయమూ సంపాదిస్తున్నారు. ఇందులో మహిళలకు సంబంధించి....

Published : 20 Mar 2023 14:35 IST

ఒకప్పుడు తమ అభిరుచికి సంబంధించిన పనులను ఖాళీ సమయాల్లో చేసేవారు. కానీ, ఇప్పుడు చాలామంది తమ అభిరుచినే కెరీర్‌గా మలచుకుంటున్నారు. దాంతో ఇటు ఆత్మసంతృప్తిని పొందడంతో పాటు ఆదాయమూ సంపాదిస్తున్నారు. ఇందులో మహిళలకు సంబంధించి బ్యూటీ, ఫ్యాషన్ రంగాలు ముందు వరుసలో ఉంటాయి. ఆసక్తి ఉన్నవారికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎన్నో..!

బ్యూటీ బ్లాగర్

ఈ రోజుల్లో ఏ సమాచారం పొందాలన్నా చాలామంది అంతర్జాలాన్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే సౌందర్య చిట్కాలకు సంబంధించి ఇంటర్నెట్‌లో వెతకడం మనం చూస్తునే ఉంటాం. కాబట్టి, మీకు బ్యూటీకి సంబంధించిన అన్ని అంశాలపై పట్టు ఉంటే బ్యూటీ బ్లాగర్‌గా రాణించవచ్చు. ఈ క్రమంలో పలు సౌందర్య సమస్యలు, వాటి పరిష్కారాల గురించి బ్లాగుల్లో వ్యాసాలు రాస్తూ డబ్బు సంపాదించవచ్చు. అలాగే యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పలు సౌందర్య చిట్కాలపై వీడియోలు చేసి పోస్ట్ చేయచ్చు. ఈ క్రమంలో వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు, సాధనాలు, వాటి వివరాలు, ప్రయోజనాలు, రివ్యూలకు సంబంధించిన వీడియోలు కూడా చేయచ్చు. అలాగే బ్యూటీకి సంబంధించిన వెబ్‌సైట్లకు కాలమిస్ట్‌గా కూడా పని చేయవచ్చు.


ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్/ డిజైనర్..

ఏ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ తెరచి చూసినా అందులో అందమైన మోడళ్ల ఫొటోలు దర్శనమిస్తుంటాయి. వాళ్లను చూడగానే ఎవరికైనా కళ్లు తిప్పుకోనివ్వవు. వాళ్లు అలా కనబడడానికి అందంతో పాటు ఫొటోగ్రాఫర్ల నైపుణ్యం కూడా అవసరమే. మోడళ్లు ఆకర్షణీయంగా కనబడడానికి ఫొటోగ్రాఫర్లు తీవ్రంగా కష్టపడుతుంటారు. అలాంటి ఫొటోలు తీయాలంటే బ్యూటీ, ఫ్యాషన్లకు సంబంధించిన విషయాలపై అవగాహన ఉండాల్సిందే. మీకు కూడా ఈ విషయాలపై అవగాహన ఉండి, ఫొటోగ్రఫీపై మక్కువ ఉంటే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా ప్రయత్నించవచ్చు. వీరు మోడళ్లు, సినిమా తారలు, కాస్మెటిక్ బ్రాండ్లు, ఫ్యాషన్‌ డిజైనర్లతో పని చేయాల్సి ఉంటుంది. ఈ రంగంలో ఆదాయంతో పాటు తగిన గుర్తింపు కూడా లభిస్తుంటుంది. అలాగే ఫ్యాషన్లకు సంబంధించిన లేటెస్ట్ అంశాలపై ఆసక్తి, అవగాహన ఉంటే ఫ్యాషన్ డిజైనర్ గానూ రాణించవచ్చు.


హెయిర్‌ స్టైలిస్ట్

ఆకర్షణీయంగా కనబడాలంటే ముఖారవిందంతో పాటు, దానికి తగ్గట్టుగా హెయిర్‌ స్టైల్‌ కూడా ఉండాలి. ఒకప్పుడు మహిళలు జడలు వేసుకోవాలంటే నాలుగైదు డిజైన్ల కంటే ఎక్కువ ఉండేవి కావు. అది కూడా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లాలనుకున్నప్పుడు ఆ డిజైన్లను ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు వివిధ రకాల హెయిర్‌స్టైల్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని వేయడానికి ప్రత్యేకంగా హెయిర్‌ స్టైలిస్ట్‌లూ ఉంటున్నారు. భిన్న రకాల హెయిర్‌ స్టైల్స్‌ను ప్రయత్నించడంలో మక్కువ ఉంటే మీరూ హెయిర్‌ స్టైలిస్ట్‌గా రాణించవచ్చు. ఇందులో అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటున్నాయి. వెండితెర, బుల్లితెరల్లో వచ్చే పాత్రలు మరింత అందంగా కనబడడానికి నిర్మాణ సంస్థలు ప్రత్యేకంగా హెయిర్‌ స్టైలిస్ట్‌లను నియమించుకుంటాయి. కొంతమంది నటీమణులు సొంతంగానూ హెయిర్‌ స్టైలిస్ట్‌లను పెట్టుకుంటారు. ఇవిగాక కొన్ని పేరుగాంచిన సెలూన్లు కూడా ప్రత్యేకంగా హెయిర్‌ స్టైలిస్ట్‌లను తీసుకుంటుంటారు. ఇలా హెయిర్‌ స్టైలిస్ట్‌గా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.


ఇమేజ్‌ కన్సల్టెంట్

ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా చూసిన వెంటనే మొట్టమొదట కలిగే అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందంటారు నిపుణులు. అందుకే చాలామంది తమ వ్యక్తిగత, వృత్తిగత, సామాజిక జీవితాల్లో విజయం సాధించే క్రమంలో మొదటి పరిచయంలోనే ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం చూస్తుంటాం. ఈ క్రమంలో ఇమేజ్ కన్సల్టెంట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తి ఉంటే మీరూ ఇమేజ్ కన్సల్టెంట్‌గా ప్రయత్నించవచ్చు. ఇందులో చక్కటి ప్రావీణ్యం ఉంటే అవకాశాలు కూడా అంతే విస్తృతంగా లభిస్తుంటాయి. విమాన రంగం, ఆతిథ్య రంగం, ఫ్యాషన్ వంటి రంగాల్లో ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో శిక్షణ పొందడానికి పలు సంస్థలు సర్టిఫికెట్‌ కోర్సులు కూడా అందిస్తున్నాయి.


కాస్మెటాలజిస్ట్

ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అందమంటే కేవలం ముఖానికి మాత్రమే సంబంధించింది కాదు. చర్మం, జుట్టు, గోళ్లు.. ఇవన్నీ అందం పరిధిలోకే వస్తాయి. వీటికి సంబంధించిన సౌందర్య చికిత్సలలో నైపుణ్యం ఉన్నవారిని కాస్మెటాలజిస్ట్ అంటారు. వీరు హెయిర్‌ స్టైలింగ్‌, మేకప్ అప్లికేషన్, మసాజ్ థెరపీ, స్కిన్‌కేర్ ట్రీట్‌మెంట్ వంటివి చేస్తుంటారు. వీరికి బ్యూటీకి సంబంధించిన అన్ని ట్రీట్‌మెంట్లపై శాస్త్రీయపరమైన అవగాహన ఉంటుంది. వీరికి పెద్ద పెద్ద సెలూన్లు, స్కిన్ క్లినిక్స్, బ్యూటీ క్లినిక్స్‌లలో ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. ఒకవేళ ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేకపోతే సొంతంగానూ రాణించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్