అవి విశ్వనాథుడు చెక్కిన పాత్రలు.. అందుకే ఆ ఔన్నత్యం..!

ఆయన పేరు చెబితే నాదం ఝుమ్మంటుంది.. పాదం సై అంటుంది.. సంగీతం ఆయన సినిమాలకే కేరాఫ్ అడ్రస్‌గా ఒదిగిపోతే.. నృత్యం ఆయన చిత్రాలకే ఆనవాలుగా నిలిచింది.. పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో సాగిపోతున్న సినిమా ఇండస్ట్రీని తెలుగు సాహిత్యంతో, శాస్త్రీయ సంగీతం-సంప్రదాయ....

Updated : 03 Feb 2023 17:10 IST

ఆయన పేరు చెబితే నాదం ఝుమ్మంటుంది.. పాదం సై అంటుంది.. సంగీతం ఆయన సినిమాలకే కేరాఫ్ అడ్రస్‌గా ఒదిగిపోతే.. నృత్యం ఆయన చిత్రాలకే ఆనవాలుగా నిలిచింది.. పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో సాగిపోతున్న సినిమా ఇండస్ట్రీని తెలుగు సాహిత్యంతో, శాస్త్రీయ సంగీతం-సంప్రదాయ నృత్యాలతో నింపాలన్న ఆలోచన ఆయనకు కాక మరెవరికి వస్తుంది..? ఎందుకంటే ఆయన కళా తపస్వి కాబట్టి..! అయితే ఆయన సినిమాల్లో కేవలం కళా హృదయమే కాదు.. స్త్రీల పట్ల ఆయనకున్న అభ్యుదయ భావాలు కూడా కనిపిస్తాయి. అప్పటి సమాజంలోని మహిళల పరిస్థితులను కళ్లకు కడుతూ.. అభ్యుదయ భావాలను ప్రతిబింబించిన ఘనత ఆయన సినిమాలకే సొంతం! ఆ కళా తపస్వి శివసాయుజ్యం పొందిన వేళ.. ఆయన సృజించిన కొన్ని అపురూప దృశ్యకావ్యాలు, ఆ చిత్రాల్లోని అత్యుత్తమ స్త్రీ పాత్రల గురించి నెమరువేసుకోవడం సందర్భోచితం..!

కాశీనాథుని విశ్వనాథ్.. 1930లో జన్మించిన ఆయన ‘తోడికోడళ్లు’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ముందు సౌండ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారిన ఆయన.. ‘ఆత్మ గౌరవం’ సినిమాతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మిగిలిన దర్శకులందరి సినిమాలు వేరు.. విశ్వనాథ్ చిత్రాలు వేరు.. అనేలా ఆయన తన సినిమాలకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువగా కళలు, సంస్కృతీసంప్రదాయాలే ప్రధానాంశాలుగా చిత్రాలు రూపొందించిన ఆయన.. సామాజిక విలువలు, సమస్యల నేపథ్యంలోనూ సినిమాలు రూపొందించారు.. అతి సున్నితమైన భావోద్వేగాలను కూడా తనదైన శైలిలో చూపగలిగే నేర్పరి ఆయన..! విశ్వనాథ్ రూపొందించిన సినిమాలేవైనా.. అందులో స్త్రీ పాత్రలను ఉదాత్తంగా చూపించేవారే కానీ ఎక్కడా కించిత్తైనా తక్కువ చేసింది లేదు. ఇదీ ఆయన స్త్రీలకిచ్చిన గౌరవం!

తెలుగుదనం.. నిండుదనం..!

ఆడవాళ్లంటే కేవలం ఇంటికే పరిమితమవ్వాలన్న ఆలోచన విశ్వనాథ్ సినిమాల్లో కనిపించదు. ఆయన కళా తపస్వి.. ఆ కళలకు స్త్రీత్వాన్ని జోడించి.. తన నాయికా పాత్రల్లో కళామతల్లిని నిండుగా చూపించేవారు.. విశ్వనాథ్ సినిమాల్లో హీరోలతో పాటు హీరోయిన్లకూ సమప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఆయన సినిమాల్లో చేయడానికి ఎంతోమంది నాయికలు మక్కువ చూపేవారు. ‘శంకరాభరణం’ నుంచి ‘శుభప్రదం’ వరకు.. విశ్వనాథ్ సినిమాల్లో హీరోయిన్లంటే చీరకట్టుతో పదహారణాల తెలుగమ్మాయిలా చక్కగా, నిండుగా ఒదిగిపోవాల్సిందే! తెలుగుదనం, నిండుదనం ఉట్టిపడే హీరోయిన్లను చూడాలంటే విశ్వనాథ్ సినిమాలను చూడాల్సిందే..!

ధీర వనితగా..

తన సినిమాల్లో స్త్రీలకు గౌరవం ఇవ్వడమే కాదు.. వారికి సమున్నత స్థానాన్ని కట్టబెట్టారీ కళాతపస్వి. సమాజంలోని స్త్రీల స్థితిగతులను తన సినిమాల ద్వారా చూపుతూ.. వారి వ్యక్తిత్వాన్ని తన పాత్రల ద్వారా చాటారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం కావాలనే ఒకప్పటి రోజుల్లోనూ.. కలలు కని.. వాటిని నిజం చేసుకునే పాత్రలు విశ్వనాథ్ సినిమాల్లో కనిపిస్తాయి. లేదంటే ‘సీతా మహాలక్ష్మి’ సినిమాలో.. ఎక్కడో పల్లెటూర్లో పుట్టిన సీతాలు సినిమా హీరోయిన్ కావడమేంటి? ‘సిరిసిరి మువ్వ’లో మూగ పిల్ల హైమ.. అన్ని కష్టాలను ఎదుర్కొని మరీ తన లక్ష్యమైన నాట్యాన్ని తన జీవిత గమ్యంగా మార్చుకోవడం ఏంటి? ‘స్వయంకృషి’లో పల్లెటూరి పిల్ల గంగ.. జీవితంలో అన్నీ సాధించాక కూడా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి బడిలో చేరడమేంటి?.. ఇదీ విశ్వనాథ్ సినిమాల్లో స్త్రీలకుండే ప్రాముఖ్యం! ‘వారికీ ఆశయాలుంటాయి.. వాటిని చేరుకోవడానికి వాళ్లూ కృషి చేయగలర’ని ఈ సినిమాలు అంతర్లీనంగా వివరిస్తాయి. కేవలం తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవడమే కాదు.. సమస్య వస్తే దానిపై యుద్ధం చేసే అపర కాళికలుగా కూడా అమ్మాయిలు మారతారని తన సినిమాలతో చెప్పకనే చెప్పారు విశ్వనాథ్.. ‘ఓ సీత కథ’ సినిమానే తీసుకుంటే.. తనకు కాబోయే భర్తను చంపిన వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించే ఓ అమ్మాయి కథ ఇది. అలాగే ‘శుభలేఖ’ సినిమాలో సుమలత పాత్ర ద్వారా కట్న పిశాచాలకు చక్కటి గుణపాఠం చెప్పించారు విశ్వనాథుల వారు.

‘బోల్డ్‌’గానూ చూపారు!

మంజు భార్గవి.. అప్పటివరకూ కొన్ని రకాల పాత్రలకే పరిమితమైన అమ్మాయి.. అలాంటి అమ్మాయి ‘శంకరాభరణం’ చిత్రంలో సోమయాజులు పక్కన నటిస్తుందంటేనే ఆశ్చర్యపోయారంతా.  కానీ ఆ ‘గురుశిష్యుల మధ్య బంధాన్ని ఆయన ఎంత చక్కగా చూపించార’ని..! సినిమా చివర్లో గురువుగారితో పాటే ఆ శిష్యురాలు కూడా మరణిస్తే కంటతడి పెడుతూ బయటకొచ్చారట చాలామంది అభిమానులు.. అదీ ఆయన సినిమా గొప్పదనమంటే..! ‘స్వర్ణ కమలం’లో ‘అర్థం చేసుకోరూ..’ అంటూ చిలిపి మాటలు చెప్పే గడుసు పిల్ల భానుప్రియ.. ఆఖరున చక్కటి నాట్య కళాకారిణిగా మారితే తామే జీవితంలో ఏదో సాధించేశాం.. అన్నట్లుగా ప్రేక్షకులు ఆనందించారు.. ఈ పాత్రలే కాదు.. ‘చెల్లెలి కాపురం’లో ధైర్యంగా అసలు కళాకారుడి గుట్టు బయటపెట్టిన వాణిశ్రీ అయినా.. భర్తను తన కొడుకు ద్వారా మార్చుకోవడానికి ప్రయత్నించే ‘శృతిలయలు’ సుమలత అయినా.. ఒంటరి తల్లిగానైనా ధైర్యంగా జీవనం కొనసాగించిన ‘స్వాతిముత్యం’ రాధిక అయినా.. ఇలా ఆయన రూపొందించిన ఈ పాత్రల్లో మొండిధైర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

‘ఆమె’లో ఎన్నో కోణాలు!

మిగిలిన పాత్రలన్నీ ఒకెత్తయితే.. ఆయన మలిచిన ‘సాగరసంగమం’లోని జయప్రద పాత్ర మరో ఎత్తు.. ఓవైపు విఫల ప్రేమికురాలిగా, తండ్రి మాట జవదాటని కూతురిగా, వివాహ వ్యవస్థ కోసం మనసు చంపుకొనే ఇల్లాలిగా.. ఆపై కూతురి భవిష్యత్తు కోసం ఆలోచించే తల్లిగా, తన స్నేహితుడి జీవితం కోసం ఆరాటపడే వ్యక్తిగా.. ఇలా ఆ పాత్రలో ఎన్నో కోణాలు చూపారాయన. ‘మౌనమేలనోయి..’ పాట ద్వారా ఆమెలోని ప్రేమను చూపిన విశ్వనాథ్.. ఆ తర్వాత ఆమె ఒకరి ఇల్లాలిగా మారగానే వివాహ వ్యవస్థకు గౌరవం ఇచ్చే స్త్రీలా ఆ పాత్రను మలచడం విశేషం.

ఇలా చెప్పుకుంటూ పోతే.. పదహారణాల తెలుగుదనం, నిండుదనం, సమస్యలకు ఎదురొడ్డి పోరాడే తత్వం, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని తాము అనుకున్న స్థాయికి చేరుకోగలిగే సంకల్పం.. ఆయన చిత్రాల్లో నాయికల సొంతం. అందుకే సమున్నత స్త్రీ పాత్రలంటేనే విశ్వనాథుని చిత్రాలు.. విశ్వనాథుని చిత్రాలంటేనే.. సమున్నత స్త్రీ పాత్రలు! ఆయన చెక్కిన ఈ స్త్రీ పాత్రలు తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నది కాదనలేని సత్యం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్