Doppelgangers: అచ్చం.. అలానే ఉన్నారే!

‘మనుషుల్ని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురుంటారం’టారు! అలాగని మరీ అచ్చుగుద్దినట్లు కాకుండా.. కళ్లు, ముక్కు, ముఖంలో సగ భాగం.. ఇలా కొంత వరకు ఒకే తరహా పోలికలున్న వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కవల సోదరిలా ఒకే ముఖ కవళికలున్న వ్యక్తులు.....

Updated : 17 Aug 2022 12:48 IST

(Photos: Instagram)

‘మనుషుల్ని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురుంటారం’టారు! అలాగని మరీ అచ్చుగుద్దినట్లు కాకుండా.. కళ్లు, ముక్కు, ముఖంలో సగ భాగం.. ఇలా కొంత వరకు ఒకే తరహా పోలికలున్న వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ కవల సోదరిలా ఒకే ముఖ కవళికలున్న వ్యక్తులు మాత్రం అరుదనే చెప్పాలి. ఇక కొంతమంది అందాల తారలను పోలిన అమ్మాయిల ఫొటోలు సోషల్‌ మీడియాలో తరచూ వైరలవడం మనం చూస్తుంటాం. అలాంటి ఓ ఫొటోనే ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. అది మరెవరిదో కాదు.. బాలీవుడ్‌ డింపుల్‌ బ్యూటీ దీపికా పదుకొణెను పోలిన రిజుతా ఘోష్‌ దేవ్ది. వీళ్లిద్దరూ పక్కపక్కన నిల్చుంటే.. ఎవరెవరో గుర్తుపట్టడం కష్టమంటున్నారు నెటిజన్లు. మరి, ఇంతకీ ఎవరీ రిజుతా? ఇంకా బాలీవుడ్‌లో ఎవరెవరికి డోపెల్‌ గ్యాంగర్స్‌ ఉన్నారో తెలుసుకుందాం రండి..

దీపికా పదుకొణె - రిజుతా ఘోష్‌ దేవ్

సోషల్‌ మీడియా పుణ్యమాని.. ఎంత దూరంలో ఉన్నా అందరూ ఒకే ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలుగుతోంది. ఈ క్రమంలోనే కాస్త వైవిధ్యంగా ఉన్న అంశాల్ని ఒడిసిపట్టుకుంటూ తెగ పాపులర్‌ చేస్తున్నారు నెటిజన్లు. అలా ట్రెండ్‌ అవుతున్నవే సెలబ్రిటీలు, వాళ్ల డోపెల్‌ గ్యాంగర్స్‌ ఫొటోలు. తాజాగా డింపుల్‌ బ్యూటీ దీపికా పదుకొణెను పోలిన అమ్మాయిని కనిపెట్టారు నెటిజన్లు. తనే కోల్‌కతాకు చెందిన రిజుతా ఘోష్‌ దేవ్‌. వృత్తి రీత్యా డిజిటల్‌ క్రియేటర్‌ అయిన ఆమె.. కళ్లు, ముక్కు, చూపులు, స్టైల్‌.. ఇలా అన్నీ దీపికకు అచ్చుగుద్దినట్లుగానే ఉన్నాయి. అందుకే ఇద్దరినీ పక్కపక్కన నిల్చోబెడితే ఎవరెవరో గుర్తుపట్టలేమంటున్నారు దీప్స్‌ అభిమానులు. దీపిక-రిజుతా ఫొటోల్ని కొలేజ్‌ చేసి.. షేర్‌ చేస్తూ.. ‘దీపికా పదుకొణె 2.0’, ‘అచ్చం దీపికలా ఉంది..’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరి ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.


ఆలియా భట్‌ - సెలెస్టీ బైరాగే

డింపుల్‌ స్మైల్, క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది అందాల ఆలియా భట్‌. అసోంకు చెందిన సోషల్‌ మీడియా మోడల్‌ సెలెస్టీ బైరాగే స్మైల్‌ కూడా మన ఆలియాకు తీసిపోదని అంటుంటారు నెటిజన్లు. ఈ బాలీవుడ్‌ బ్యూటీకి వీరాభిమాని అయిన సెలెస్టీ ఇటీవలే ఓ టీవీ షోలో పాల్గొంది. ఈ వేదికపై గంగూబాయి కథియావాడి సినిమాలోని ఓ సీన్‌ని రీక్రియేట్‌ చేసి తన ఇన్‌స్టాలో పంచుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించిందీ అసోం బ్యూటీ. ‘నేను ఆలియా వీరాభిమానిని. చిన్నతనం నుంచే ఆమె సినిమాలు చూడ్డానికి ఇష్టపడేదాన్ని. ఇటీవలే గంగూబాయిలోని ఓ సీన్‌ రీక్రియేట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశా. దీంతో పాపులారిటీనే కాదు.. ఓ టీవీ సీరియల్‌లో నటించే అవకాశం కూడా వచ్చింది..’ అంటూ సంబరపడిపోతోందీ క్యూటీ.


కత్రినా కైఫ్ - అలీనా రాయ్

అలీనా రాయ్.. చూడ్డానికి అచ్చం కత్రినానేమో అనిపించే ఈ అమ్మాయి గుజరాత్‌కు చెందిన మోడల్, నటి. టిక్‌టాక్ వీడియోలతో ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారిపోయిన ఈ అమ్మాయి.. కమాల్‌, లక్నో జంక్షన్‌, రోష్‌.. వంటి చిత్రాల్లో నటించింది. ఫ్యాషన్ బ్లాగర్‌గానూ తన ట్యాలెంట్ నిరూపించుకుంటోంది. ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి ఇన్‌స్టాలో ఆమె పోస్ట్‌ చేసే వరుస ఫొటోలు చూసి నెటిజన్లు.. ఈమె కత్రినానా? అలీనానా? అని తేల్చుకోలేకపోతారంటే అతిశయోక్తి కాదు. కారణం.. ముక్కు, పెదాలు, కళ్లు, నుదురు.. ఇలా ముఖ కవళికలన్నీ అచ్చుగుద్దినట్లు కత్రినాలా ఉండడమే! అయితే సోషల్ మీడియాలో తనను కత్రినాతో పోల్చడంపై స్పందించిన అలీనా.. ‘నేనూ కత్రినాకు అభిమానిని. బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుందామె. అయితే పలువురికి స్ఫూర్తినిచ్చే ఆమెతో నన్ను పోల్చడం కరెక్ట్ కాదు. నాకంటూ సొంతంగా ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. నేను కూడా మరికొందరికి రోల్‌మోడల్‌గా నిలవాలని అనుకుంటున్నా..’ అంటూ చెప్పుకొచ్చిందీ యువ నటి.


ఈషా గుప్తా - ఏంజెలినా జోలీ

మోడల్‌గా కెరీర్ మొదలెట్టి బాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది హీరోయిన్ ఈషా గుప్తా. 2007లో ‘ఫెమినా మిస్ ఇండియా’ విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ చూడ్డానికి సేమ్ టు సేమ్ హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీలా ఉంటుందంటారు నెటిజన్లు. అందుకే చాలామంది ఆమెను ‘ఇండియన్ ఏంజెలినా’ అని పిలుస్తుంటారు. మరోవైపు పాకిస్థాన్‌ నటి సారా లోరెన్‌కు ఈషాకు దగ్గరి పోలికలున్నాయంటుంటారు ఆమె అభిమానులు.


దిశా పటానీ - పెనలోప్ క్రజ్

బాలీవుడ్‌ ఫిట్‌నెస్ ఫ్రీక్ దిశాపటానీ, స్పానిష్ మోడల్ పెనలోప్ క్రజ్ పక్కపక్కన నిల్చుంటే ఎవరెవరో గుర్తుపట్టడం చాలా కష్టం. ‘కుంగ్ ఫూ యోగా’, ‘ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘బాఘీ-3’.. సినిమాలతో సత్తా చాటింది దిశా. ఇక స్పానిష్ భాషలో అడ్వెంచరస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది పెనలోప్ క్రజ్. వీరిద్దరి ముఖ కవళికలు, జుట్టు ఒకేలా ఉంటాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో భాగంగా పెనలోపే తనకు రోల్‌మోడల్ అని చెప్పుకొచ్చింది దిశా పటానీ.


జాక్వెలిన్ ఫెర్నాండెజ్ - అమందా సెర్నీ

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్, అమెరికన్ మోడల్ అమందా సెర్నీ చూడడానికి అక్కాచెల్లెళ్లలాగే కనిపిస్తారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి పలు బాలీవుడ్‌ చిత్రాలతో సత్తా చాటిన జాక్‌.. ప్రస్తుతం ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమన్‌’ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇక అమెరికాలో సోషల్ మీడియా సెన్సేషన్‌గా పేరు పొందింది అమందా సెర్నీ. ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోన్న ఆమెకు 4 మిలియన్ల పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ముంబైలో కలిసిన వీరిద్దరూ సరదాగా ఫొటోలు కూడా దిగారు. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘అవును మేం నమ్ముతున్నాం. పుట్టినప్పుడే మేమిద్దరం విడిపోయాం’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.


ఐశ్వర్యారాయ్ - మహ్లఘా జబేరి

అందాన్ని నిర్వచిస్తే ఐశ్వర్యారాయ్‌లా ఉంటుందంటారు ఆమె అభిమానులు. తన విలక్షణ నటనతో బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఐష్‌ను పోలిన అందమే మహ్లఘా జబేరి. ఈ ఇరాన్‌-అమెరికన్‌ మోడల్ కళ్లు అచ్చం ఐశ్వర్య కళ్లలానే ఉంటాయి. మోడల్‌గా రాణిస్తూ అక్కడి ప్రముఖ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది జబేరి. సోషల్ మీడియాలో నాలుగు మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమె అందంలో ‘ఐష్’కేమీ తీసిపోదంటున్నారు నెటిజన్లు.


ప్రియాంక చోప్రా - నవ్‌ప్రీత్ బంగా

వాంకోవర్‌కు చెందిన ఓ వీడియో బ్లాగర్, నటి అచ్చం మన గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా లాగే ఉంటుంది. శరీరాకృతి, హెయిర్‌స్త్టెల్, ఫ్యాషన్ సెన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్‌ప్రీత్‌కు, ప్రియాంకకు చాలా దగ్గరి పోలికలున్నాయి. ఇద్దరి గొంతు కూడా ఒకేలా ఉంటుందట. ప్రియాంకలా పోజు పెట్టి ఫొటో దిగినప్పుడల్లా ఆమెను ట్యాగ్ చేయడంతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది నవ్‌ప్రీత్‌. అయితే ఓ సందర్భంలో దీనిపై స్పందించిన పీసీ.. ‘నవ్‌ప్రీత్ ఫొటోను అమ్మకు చూపించి ఫూల్ చేద్దామని చూశా.. కానీ ఆఖర్లో గుర్తుపట్టేసింది’ అని సరదాగా చమత్కరించింది. జూనియర్‌ పీసీలా పేరు సంపాదించిన నవ్‌ప్రీత్‌ను ఇన్‌స్టాలో సుమారు మూడు లక్షల మంది ఫాలో అవుతున్నారు.


అనుష్కా శర్మ - జూలియా మైఖేల్స్

ఇక బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ, అమెరికన్ గాయని జూలియా మైఖేల్స్ కూడా చూడ్డానికి ‘అక్కచెల్లెళ్లేమో’ అనేలా ఉంటారు. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా అనుష్క తన మార్క్‌ని నిరూపించుకుంటే.. అమెరికన్‌ గాయనిగా, పాటల రచయిత్రిగా అదరగొడుతోంది జూలియా మైఖేల్స్. ముక్కు, పెదాలు, కళ్లు, నుదురు ఇలా ముఖకవళికలన్నీ అచ్చం అనుష్కను పోలి ఉండే జూలియాను ‘అనుష్కకు వైట్ వెర్షన్’ అంటుంటారు. వీరిద్దరూ పక్కపక్కన ఉంటే విరాట్ కూడా కనిపెట్టలేడు అంటూ సరదాగా కామెంట్లు పెట్టినవారూ లేకపోలేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్