నీ కోసమే ఈ ఎదురు చూపులు.. కన్నా!

కడుపులో నలుసు పడ్డ మరుక్షణం నుంచి కాబోయే తల్లి ధ్యాసంతా పుట్టబోయే బిడ్డ పైనే ఉంటుంది. తన ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుంటానా అన్న ఆతృతతో ఆమె మనసు నిండిపోతుంది. ప్రస్తుతం తామూ అలాంటి నిరీక్షణలోనే ఉన్నామంటున్నారు బాలీవుడ్‌ కాబోయే అమ్మలు భారతీ సింగ్‌, సోనమ్‌ కపూర్‌. భారతి ఏప్రిల్‌ తొలి వారంలో అమ్మగా ప్రమోషన్‌.....

Updated : 21 Mar 2022 17:22 IST

(Photos: Instagram)

కడుపులో నలుసు పడ్డ మరుక్షణం నుంచి కాబోయే తల్లి ధ్యాసంతా పుట్టబోయే బిడ్డ పైనే ఉంటుంది. తన ప్రతిరూపాన్ని ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుంటానా అన్న ఆతృతతో ఆమె మనసు నిండిపోతుంది. ప్రస్తుతం తామూ అలాంటి నిరీక్షణలోనే ఉన్నామంటున్నారు బాలీవుడ్‌ కాబోయే అమ్మలు భారతీ సింగ్‌, సోనమ్‌ కపూర్‌. భారతి ఏప్రిల్‌ తొలి వారంలో అమ్మగా ప్రమోషన్‌ పొందనుండగా, సొగసుల సోనమ్‌ తాను తల్లి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించి తన ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తింది. తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతోన్న ఈ చక్కనమ్మలిద్దరూ తమ మనసులోని ఆలోచనల్ని సోషల్‌ మీడియా వేదికగా ఇలా పంచుకున్నారు.

నీ ప్రతి అడుగులో మేముంటాం..!

గత కొంత కాలంగా తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌కి ఎప్పటికప్పుడు చెక్‌ పెట్టుకుంటూ వచ్చింది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. తన చెల్లెలు రియా కపూర్‌ పెళ్లి సమయంలో కూడా సోనమ్‌ గర్భిణి అని వార్తలు వచ్చాయి. అయితే తన అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా గుడ్‌న్యూస్‌ చెప్పిందీ సొగసరి. ఈ ఏడాది సెప్టెంబర్‌-డిసెంబర్‌ మధ్యలో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ఓ కవితాత్మక పోస్ట్‌ పెట్టింది. తన భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి దిగిన బేబీ బంప్‌ ఫొటోల్ని పోస్ట్‌ చేస్తూ..

‘నాలుగు చేతులు..

నిన్ను అత్యంత గొప్పగా పెంచి పెద్ద చేయడానికి ఎదురుచూస్తున్నాయి..

రెండు హృదయాలు..

నువ్వు వేసే ప్రతి అడుగులో ధ్వనిస్తూనే ఉంటాయి..

ఒక కుటుంబం..

నీపై ప్రేమానురాగాల్ని కురిపించడానికి, సంపూర్ణ మద్దతును నీకు అందించడానికే నిరీక్షిస్తోంది..

నీ రాక కోసమే ఈ ఎదురుచూపులు.. కన్నా!’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది సోనమ్‌. గర్భిణిగా తాను ప్రతి రోజూ.. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. సెప్టెంబర్‌-డిసెంబర్‌ మధ్య తన కలల పంట ఈ భూమ్మీద అడుగుపెట్టబోతోందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ జంటకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


మెటర్నిటీ గ్లో ఉట్టిపడుతోంది!

గర్భిణిగా ఉన్న సమయంలో కాబోయే అమ్మలు వేసే ప్రతి అడుగూ అపురూపమే అంటోంది బాలీవుడ్‌ లాఫ్టర్‌ క్వీన్‌ భారతీ సింగ్‌. కొన్ని నెలల క్రితమే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన ఈ బబ్లీ బ్యూటీ.. ప్రెగ్నెన్సీలో తనకు ఎదురవుతోన్న అనుభవాల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే తన భర్త హర్ష్‌ లింబాచియాతో కలిసి తీయించుకున్న మెటర్నిటీ షూట్‌ ఫొటోల్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ నవ్వుల రాణి. ఇందులో భాగంగా పర్పుల్‌ షేడ్‌ అరియానా గౌన్‌ ధరించిన భారతి.. ‘కాబోయే అమ్మ’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది. ఈ మెటర్నిటీ అవుట్‌ఫిట్స్‌లో ఆమె ఏంజెల్‌లా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. తన ముఖంలో ప్రెగ్నెన్సీ గ్లో ఉట్టిపడుతోందంటూ ప్రశంసిస్తున్నారు.

రెండున్నర నెలల దాకా తెలుసుకోలేకపోయా!

ఇక మరోవైపు.. కాబోయే అమ్మగా తనకెదురైన అనుభవాలపై స్పందిస్తూ.. ‘కాస్త లావుగా ఉంటే గర్భం ధరించామన్న విషయం కూడా తెలియదు. నెల తప్పి రెండున్నర నెలలయ్యాక గానీ నేను గర్భిణినని తెలుసుకోలేకపోయా. ఈ క్రమంలోనే నచ్చింది తినడం, షూటింగ్స్‌కి వెళ్లడం, రోజులాగే పరుగు/వ్యాయామాలు చేయడం.. వంటివి రొటీన్‌గా చేశాను. అంతేనా.. ‘డ్యాన్స్‌ దీవానా’ షోలో డ్యాన్స్‌ కూడా చేశా. ఆ తర్వాత సందేహం కలిగి ఓసారి చెక్‌ చేసుకున్నా. ఫలితం.. పాజిటివ్‌ వచ్చింది. ఇదే విషయం నా భర్తతో చెప్పా. ఒక్కసారి ఎగిరి గంతేశాడు. నిజంగా ఇది మాకు సర్‌ప్రైజే! ఎందుకంటే బిడ్డను కనాలని మేము అప్పటికి ఎలాంటి ప్లాన్‌ చేసుకోలేదు..

నన్ను పసిపాపలా చూసుకుంటున్నాడు!

ఏదేమైనా గర్భిణిగా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నా. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు తమ భర్తలు తమ పక్కనే ఉండి సేవలు చేయాలని కోరుకుంటారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినని చెప్పాలి. ఎందుకంటే హర్ష్‌ నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎప్పుడైనా నేను నడుం నొప్పితో బాధపడితే తనే వేడి నీళ్లతో కాపడం పెడతాడు. అలాగే నాకు తినాలనిపించిన పదార్థాల్ని తనే చేసి పెడుతున్నాడు. నిజానికి నాకు పనీర్‌/పాల పదార్థాలంటే అంటే అస్సలు నచ్చదు. కానీ ప్రస్తుతం అవే ఎక్కువగా తినాలనిపిస్తోంది. ఇక ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి వివిధ రకాల ఫుడ్‌ యాప్స్‌లో చెక్‌ చేసి మరీ చేసిపెడుతున్నాడు..’ అంటూ తన భర్త చేస్తోన్న సపర్యల గురించి చెప్పుకొచ్చింది భారతి.

సిజేరియన్‌ అంటే భయం!

ఓవైపు గర్భం ధరించినా మరోవైపు వృత్తినీ కొనసాగిస్తోందీ ఈ లాఫింగ్‌ బ్యూటీ. అలాగే యోగా, ఇతర వ్యాయామాలు కూడా చేస్తున్నానని.. అయితే ఇదంతా సహజ ప్రసవం కోసమే అని చెబుతోంది భారతి. ‘రోజు విడిచి రోజు యోగా చేస్తున్నా. షూటింగ్స్‌కీ హాజరవుతున్నా. ఇదంతా సహజ ప్రసవం కావాలనే! నిజానికి నాకు సిజేరియన్‌ అంటే భయం.. సి-సెక్షన్‌ తర్వాత ఎంత నొప్పి భరించాల్సి వస్తుందో తెలుసుకున్నాక ఈ భయం మరింత పెరిగింది. పైగా భవిష్యత్తులో వర్కింగ్‌ మదర్‌గా కొనసాగాలంటే ఎలాంటి సమస్యల్లేకుండా ఆరోగ్యంగా ఉండాలి కదా! అందుకే నార్మల్‌ డెలివరీ వైపే మొగ్గు చూపుతున్నా. ఈ క్రమంలోనే డాక్టర్‌ సలహాల్ని పాటిస్తున్నా. ఉదయాన్నే గంట సేపు నడకకు సమయం కేటాయిస్తున్నా..’ అంటోందీ లాఫింగ్‌ బ్యూటీ. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి అయిన భారతి.. ఏప్రిల్‌ మొదటి వారంలో బుజ్జాయికి జన్మనివ్వబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్