‘అమ్మ’గా ఆ అనుభవాలు మాకెప్పటికీ ప్రత్యేకమే!

అమ్మయ్యే క్షణం మహిళలకెంతో అపురూపం! అందుకే ఆ మధుర జ్ఞాపకాల్ని జీవితాంతం గుర్తుంచుకోవడమే కాదు.. అమ్మతనంలోని ఆనందాన్ని, మధురానుభూతుల్ని అయినవాళ్లతో పంచుకుంటారు కూడా! సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు.....

Published : 08 May 2022 12:44 IST

అమ్మయ్యే క్షణం మహిళలకెంతో అపురూపం! అందుకే ఆ మధుర జ్ఞాపకాల్ని జీవితాంతం గుర్తుంచుకోవడమే కాదు.. అమ్మతనంలోని ఆనందాన్ని, మధురానుభూతుల్ని అయినవాళ్లతో పంచుకుంటారు కూడా! సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇందుకు మినహాయింపు కాదు. ప్రసవానంతర సమస్యలు, నిద్రలేని రాత్రులు.. ఇలా బిడ్డ పుట్టాక ఎన్ని సవాళ్లు ఎదురైనా అమ్మతనం ముందు అవన్నీ దిగదుడుపే అంటున్నారు ఇటీవలే కొత్తగా తల్లులైన పలువురు ముద్దుగుమ్మలు. ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా వారి అనుభవాలేంటో తెలుసుకుందాం రండి..


ఈ మధురానుభూతిని మర్చిపోలేను!

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వపు మధురిమల్లో తేలియాడుతోంది. 2020లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూతో ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఏప్రిల్‌ 19న పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. తాను తల్లైన క్షణం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటూ బిడ్డ పుట్టాక తన అనుభవాల్ని సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో అందరితో పంచుకుంది.

‘నా బిడ్డ నీల్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. నీల్ని  మొదటిసారి నా గుండెలకు హత్తుకున్న క్షణం నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఒక్క క్షణం నేను ప్రేమకు సంబంధించిన లోతైన భావన పొందాను. జీవితాంతం నేను పూర్తి చేయాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్నాను. నిజానికి ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులభమైన విషయం కాదు. డెలివరీకి మూడు రోజుల ముందు నిద్ర లేని రాత్రులు గడిపాను. పలు ఆరోగ్య సమస్యలూ ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడెప్పుడు నా బిడ్డను ఎత్తుకుందామా అన్న ఆతృత నన్ను నిలవనివ్వలేదు.. అదో అందమైన అనుభూతి!’ అంటూ తన మాతృత్వపు మధురానుభూతుల్ని పంచుకుంది కాజల్‌. అంతేకాదు.. ప్రస్తుతం బిడ్డ ఆలనా పాలనలో పూర్తిగా నిమగ్నమైన ఈ అందాల అమ్మ.. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాకూ దూరంగా ఉంటోంది.


ఇప్పుడు ఆ ఆనందం రెట్టింపైంది!

కమెడియన్‌ క్వీన్‌ భారతీ సింగ్‌ - హర్ష్‌ లింబాచియా దంపతులు ఏప్రిల్‌ 3న తల్లిదండ్రులైన విషయం తెలిసిందే! అయితే ప్రసవానికి ముందు వరకూ నిండు గర్భంతోనే విధులకు హాజరైన ఆమె.. బిడ్డ పుట్టాక కూడా అటు తన పాపాయిని, ఇటు తన పనిని బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లనూ సంతోషంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నానంటోంది.

‘నేను గర్భిణిగా ఉన్నప్పుడు చాలామంది నాతో ఒక విషయం చెప్పారు. కడుపుతో ఉన్న తొమ్మిది నెలలు ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తామని.. బిడ్డ పుట్టాక ప్రసవానంతర ఒత్తిళ్లతో ఆ ఆనందం ఆవిరవుతుందని! కానీ ఈ విషయంతో నేను అస్సలు ఏకీభవించను. ఎందుకంటే నా బాబు నా చేతిలోకొచ్చాకే మా సంతోషం రెట్టింపైంది. చాలాసార్లు బాబు కోసం రాత్రుళ్లు మెలకువగా ఉండాల్సి వస్తోంది. అయినా వాడి చూపులు మాకు థెరపీ లాగా పని చేస్తున్నాయి..’ అంటూ అమ్మతనంలో తాను ఎదుర్కొంటోన్న అనుభవాలను పంచుకుందీ బుల్లితెర కమెడియన్‌. బిడ్డ పుట్టిన 12 రోజులకే తిరిగి తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన భారతి.. ఈ క్రమంలో ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అయినా వాటిని పట్టించుకోకుండా వర్క్‌లైఫ్‌ బ్యాలన్స్‌ చేస్తూ సక్సెస్‌ఫుల్‌ మదర్‌గా ముందుకు సాగుతోంది.


తనకు ఆ స్వేచ్ఛనిస్తాను!

చాలామంది తల్లిదండ్రులు తమకు బిడ్డ పుట్టగానే అలా పెంచాలి.. ఇలా పెంచాలి.. అంటూ కలలు కంటుంటారు. వారు కాస్త పెద్దయ్యాక వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమివ్వకుండా తమ అభిరుచుల్ని వారిపై రుద్దాలని చూస్తుంటారు. అయితే తాను మాత్రం ఇందుకు భిన్నం అంటోంది స్టార్‌ మామ్‌ ప్రియాంక చోప్రా. ప్రియాంక-నిక్‌ దంపతులు ఈ ఏడాది జనవరిలో సరోగసీ పద్ధతి ద్వారా ఆడపిల్లకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటిస్తూ.. ప్రస్తుతం అమ్మతనంలో తాను ఆస్వాదిస్తోన్న మధురానుభూతుల్ని ఓ సందర్భంలో పంచుకుంది పీసీ.

‘మా పాప పేరు మాల్టీ మారీ చోప్రా జోనస్‌. తన రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. ఓ అమ్మగా నా పాప విషయంలో నేను ఒక్కటే ఆలోచిస్తున్నా. నా కోరికలు, భయాలు, పెంపకం తాలూకు ఒత్తిళ్లను తనపై రుద్దకూడదని! పిల్లలకు మనం జన్మనిస్తాం.. అలాగని ప్రతి విషయంలో వాళ్లను మనకు అనుగుణంగా తీర్చి దిద్దాలనుకోవడం సరికాదు. వాళ్ల జీవితాన్ని వాళ్లు తీర్చిదిద్దుకునే స్వేచ్ఛను వారికి అందించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా మనం వారికి చేయూతను అందించాలి. నా విషయంలో నా పేరెంట్స్‌ కూడా ఇదే చేశారు. కాబట్టి నా పాప విషయంలో నేనూ ఇదే చేయాలనుకుంటున్నా..’ అంటూ ఈ తరం తల్లిదండ్రులకు పేరెంటింగ్‌ పాఠాలు చెప్పుకొచ్చిందీ అందాల అమ్మ.


ఇదో అందమైన ప్రయాణం!

‘యే రిష్తా క్యా కెహ్‌లాతా హై’ అనే హిందీ సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది బుల్లితెర బ్యూటీ మోహెనా కుమారి. రెండేళ్ల క్రితం సుయేశ్‌ రావత్‌తో ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. ఏప్రిల్‌ 15న పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. తమ జీవితాల్లో కొత్త ప్రయాణం మొదలైందంటూ తన సంతోషాన్ని సోషల్‌ మీడియా పోస్ట్‌ రూపంలో పంచుకుందీ అందాల అమ్మ.

‘మా చిన్నారిని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన క్షణం మాకెంతో అపురూపం. ఈ జర్నీ ఎంతో భావోద్వేగంతో, సవాళ్లతో కూడుకున్నది. అయినా వాటిని సానుకూలంగా ఎదుర్కొంటూ సంతోషంగా ముందుకు సాగాం. ఇప్పుడు పేరెంట్స్‌గా కొత్త ప్రయాణం ప్రారంభమైంది. నా చిన్నారికి అడుగడుగునా అండగా ఉంటూ.. దృఢమైన సానుకూల దృక్పథం, ఇతరుల పట్ల దయాగుణం కలిగిన వ్యక్తిగా పెంచాలనుకుంటున్నా..’ అంటూ పేరెంటింగ్‌ విషయంలో తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చిందీ బుల్లితెర మామ్.

వీళ్లతో పాటు క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌-నటి హేజల్‌ కీచ్‌ దంపతులు, టీవీ నటి పూజా బెనర్జీ - స్విమ్మర్‌ సందీప్‌ సెజ్వాల్‌ జంట కూడా ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొంది.. తమ జీవితాల్ని సంపూర్ణం చేసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్