మణిపురీ వధువులు ధరించే ‘పొట్లోయ్‌’ గురించి తెలుసా?

పెళ్లి దుస్తులనగానే చీరలు, భారీగా డిజైన్‌ చేసిన లెహెంగాలే గుర్తొస్తాయి. అయితే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో అక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి దుస్తుల్ని ఎంచుకుంటుంటారు వధువులు.

Published : 02 Dec 2023 12:50 IST

(Photos: Instagram)

పెళ్లి దుస్తులనగానే చీరలు, భారీగా డిజైన్‌ చేసిన లెహెంగాలే గుర్తొస్తాయి. అయితే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో అక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి దుస్తుల్ని ఎంచుకుంటుంటారు వధువులు. అలాంటి ఓ వెడ్డింగ్‌ అటైరే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అది మరెవరిదో కాదు.. బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్‌ హూడా సతీమణి లిన్‌ లైష్రమ్‌ది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ సెలబ్రిటీ జంట.. తాజాగా మణిపురీ సంప్రదాయం ప్రకారం పెళ్లిపీటలెక్కింది. వీరి పెళ్లి తంతు, వధూవరులు ధరించిన ట్రెడిషనల్‌ అటైర్స్‌ గురించే ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ మణిపురీ వధువు తన పెళ్లిలో బుట్టబొమ్మలా మెరిసిపోవడంతో.. అందరి దృష్టీ తన అటైర్‌పైనే పడింది. ఈ నేపథ్యంలో లిన్‌ ధరించిన ఆ వెడ్డింగ్‌ డ్రస్‌ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి..

బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హూడా చాలామందికి సుపరిచితమే! ఇక అతడి మనసు దోచిన లిన్‌ లైష్రమ్‌ నటిగా, మోడల్‌గా పేరుతెచ్చుకుంది. ‘ఓం శాంతి ఓం’, ‘మేరీకోమ్‌’, ‘జానే జాన్‌’.. వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రల్లో నటించిన ఆమె.. వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. ప్రస్తుతం ‘Shamooo Sana’ పేరుతో ఓ జ్యుయలరీ వ్యాపారం చేస్తోన్న ఆమె.. ఈ వేదికగా ప్రత్యేకమైన, కస్టమైజ్‌డ్‌ ఆభరణాలు రూపొందిస్తోంది.

ఇకపై ఇద్దరం కాదు.. ఒక్కరం!

రణ్‌దీప్‌, లిన్‌ జంట ఓ నాటక బృందంలో భాగంగా తొలిసారి కలుసుకుంది. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడిన వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తాజాగా తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకున్నారు. అయితే లిన్‌ మణిపూర్‌ అమ్మాయి కావడంతో ఈ సంప్రదాయాల ప్రకారమే వీరిద్దరి పెళ్లి జరిగింది. వివాహంలో వధూవరులిద్దరూ ధరించిన అవుట్‌ఫిట్స్‌ మొదలు.. పెళ్లి తంతులోని కొన్ని ఘట్టాలూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వధువు లిన్‌ బుట్టబొమ్మలాంటి స్కర్ట్‌లో ముస్తాబై పెళ్లి వేదికపైకి రావడం, వరుడిపై పూలు చల్లి నమస్కరించడం, మణిపురీ సంప్రదాయాల ప్రకారం ఒకరికొకరు దండలు మార్చుకోవడం, ఆపై ఏడడుగులు నడవడం.. ఇలా ఈ ఘట్టాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు. ‘ఇకపై మేం ఇద్దరం కాదు.. ఒక్కరం!’ అంటూ ఈ కొత్త జంట తమ పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

‘పొట్లోయ్‌’లో బుట్టబొమ్మలా!

రణ్‌దీప్‌, లిన్‌ వివాహ వేడుకలో వీరిద్దరూ ధరించిన పెళ్లి దుస్తులు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి. ముఖ్యంగా వధువు లిన్ ధరించిన మణిపురీ బ్రైడల్‌ అటైర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మణిపురీ వధువులు ఎంచుకునే ఈ డ్రస్‌ను ‘పొట్లోయ్‌’ లేదా ‘పొల్లోయ్‌’గా పిలుస్తారు. కాస్త మందంగా ఉన్న ఫ్యాబ్రిక్‌, వెదురు.. వంటి మెటీరియల్స్‌ని ఉపయోగించి ఈ బ్రైడల్‌ డ్రస్‌ని తయారుచేస్తారు. ఇది చూడ్డానికి స్థూపాకారంలో గుబురుగా ఉన్న స్కర్ట్‌ మాదిరిగా ఉంటుంది. దీనిపై ఎంబ్రాయిడరీతో హంగులద్దుతారు. ఈ స్కర్ట్‌కి జతగా మ్యాచింగ్‌/కాంట్రాస్ట్‌ కలర్‌ బ్లౌజ్‌ను ధరిస్తారు వధువులు. ఆపై అద్దాలు, మెరుపులతో హంగులద్దిన శాటిన్‌/మస్లిన్‌ శాలువాను దుపట్టాగా అలంకరించుకుంటారు. నిజానికి ఇది ఖరీదైన డ్రస్‌ కావడంతో చాలామంది మణిపురీ వధువులు తమ వివాహం కోసం ఈ పొట్లోయ్‌ని అద్దెకు తీసుకుంటారట! అయితే ఇలాంటి గుబురు అటైర్‌లోనే బుట్టబొమ్మలా మెరిసిపోయింది లిన్‌. ఇలా తన వెడ్డింగ్‌ అటైర్‌కు జతగా.. భారీ ఆభరణాలు, సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే కిరీటాన్ని అలంకరించుకొని ‘బ్యూటిఫుల్‌ బ్రైడ్‌’గా అందరిచేతా కితాబునందుకుందీ మిసెస్‌ హూడా. ఇలా పెళ్లిలోనే కాదు.. మణిపురీ సంప్రదాయ నృత్యకారిణులూ పొట్లోయ్‌ని ధరించి నృత్య ప్రదర్శనలిస్తుంటారు. ఇక వరుడు హూడా కూడా తెలుపు రంగు కుర్తా-ధోతీ ధరించి, తలపాగాతో సంప్రదాయబద్ధంగా ఆకట్టుకున్నాడు.


వధూవరులే రాధాకృష్ణులుగా..!

మణిపురీ వివాహాల్లో పెళ్లి దుస్తులే కాదు.. కొన్ని ఘట్టాలూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా ఈ వివాహ తంతును ‘మెయ్‌తీ వెడ్డింగ్‌’గా పిలుస్తారు. పెళ్లి రోజున వధూవరులను రాధాకృష్ణులుగా పరిగణిస్తారు. ‘Hinaba’ అనే వేడుకతో మణిపురీ సంప్రదాయ పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయి. ఇది ఒక రకంగా పెళ్లి చూపుల్లాంటిది. ఈ క్రమంలో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడితే నిశ్చితార్థం, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటారు. ఆపై అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటికి వెళ్తారు.. ఈ వేడుకను ‘Yathang Thanaga’ (మన భాషలో వరపూజ)గా పిలుస్తారు. ఆ తర్వాత వరుడి తరఫు కుటుంబ సభ్యులు ‘Waraipot Puba’ అనే వేడుకలో భాగంగా వధువుకు కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలు తీసుకెళ్తారు. ఇలా ఈ వేడుకలన్నీ పూర్తయ్యాక ‘Heijapot’ వేడుకలో భాగంగా ఇద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది. ఆపై పెళ్లి రోజున వధూవరులు తులసి కోట చుట్టూ కూర్చొని పెళ్లి చేసుకోవడం ఇక్కడి సంప్రదాయం. ఇక వివాహంలో భాగంగా దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం కీలక ఘట్టాలుగా పరిగణిస్తారు.

చేప పిల్లలు కలిసి ఈదితే..!

వివాహ తంతు పూర్తయ్యాక.. వరుడి పక్షం తరఫున ఒక మహిళ, వధువు తరఫు నుంచి వచ్చిన మరో మహిళ.. నీటి కొలనులోకి రెండు చేప పిల్లల్ని వదులుతారు. అవి కలిసి ఈదుకుంటూ ముందుకు సాగితే.. కొత్త దంపతులు కలకాలం కలిసుంటారని అక్కడి వారి నమ్మకం. ఇక ఆఖరుగా పెళ్లికొచ్చిన అతిథులు కానుకలిచ్చి నూతన జంటను ఆశీర్వదించడం, విందు భోజనాలతో పెళ్లి తంతు ముగుస్తుంది. వివాహం తర్వాత ఐదు రోజులకు ‘Mangani Chakouba’ అనే వేడుక జరుగుతుంది. ఇందులో భాగంగా కొత్త జంట వధువు ఇంటికి వస్తుంది. అక్కడే వారికి, అతిథులకు విందు భోజనం ఏర్పాటుచేస్తారు. ఇలా మణిపురీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్