వీటి గురించి.. పెళ్లికి ముందే తెలుసుకోండి!

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మంచిదని చెబుతుంటారు పెద్దలు. వైవాహిక బంధానికీ ఇది వర్తిస్తుంది. వివాహ బంధానికి నమ్మకం, నిజాయతీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అభిప్రాయాల్ని గౌరవించుకోవడం.. వంటివన్నీ ముఖ్యమే! కాబట్టి ఈ విషయాల్లో అభిప్రాయభేదాలు రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోబోయే జంటలు ఒకరికొకరు కొన్ని ప్రశ్నలు సంధించుకోవాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

Published : 23 Mar 2024 16:57 IST

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడడం మంచిదని చెబుతుంటారు పెద్దలు. వైవాహిక బంధానికీ ఇది వర్తిస్తుంది. వివాహ బంధానికి నమ్మకం, నిజాయతీ, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అభిప్రాయాల్ని గౌరవించుకోవడం.. వంటివన్నీ ముఖ్యమే! కాబట్టి ఈ విషయాల్లో అభిప్రాయభేదాలు రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోబోయే జంటలు ఒకరికొకరు కొన్ని ప్రశ్నలు సంధించుకోవాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అప్పుడే తామిద్దరూ ఒకే మాట మీదున్నామా? లేదా?, ఒకరికొకరు అడ్జస్ట్ అవగలమా? లేదా? అన్న విషయాలు తెలుస్తాయంటున్నారు. పెళ్లికి ముందే ఇలాంటి కచ్చితత్వం వస్తే దాంపత్య బంధం పది కాలాల పాటు శాశ్వతమవుతుందంటున్నారు. మరి, ఇంతకీ పెళ్లికి ముందే జంటలు వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలేంటో తెలుసుకుందాం రండి..

పిల్లలెప్పుడు?

పెళ్లంటే.. శాశ్వతంగా ఒకే బంధానికి కట్టుబడి ఉండడం. కానీ ఈ కాలపు జంటల్లో ఈ కమిట్‌మెంట్‌ కొరవడుతోంది. ఇందుకు కారణం.. దంపతుల మధ్య అవగాహన లోపమే! వైవాహిక బంధంలో ఇద్దరి మధ్య ఎన్నో అంశాల్లో ఏకాభిప్రాయం కావాలి. కెరీర్‌, పిల్లలు, ఇంట్లో పెద్దల బాధ్యత.. ఇలాంటి అంశాల గురించి పెళ్లికి ముందే ఇద్దరూ చర్చించుకొని ఒక తాటి పైకి రావాలి. పెళ్లయ్యాక ఉద్యోగం కొనసాగించాలా? వద్దా?, పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్‌ చేసుకోవాలి?, పెద్ద వాళ్ల బాధ్యత ఉంటే మీరు చూసుకోగలరా? లేదా?.. ఇలా ప్రతి విషయంలోనూ చర్చించుకొని ఇద్దరికీ సమ్మతమైతేనే అడుగు ముందుకు వేయాలి. అయితే కొంతమంది ఈ విషయాల్ని నిర్లక్ష్యం చేయడం, సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవడం వల్ల.. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు పొసగక గొడవలవుతుంటాయి. ఒక్కోసారి వీటితో అనుబంధానికీ ముప్పు వాటిల్లచ్చు. కాబట్టి ఇలా జరగకూడదంటే ఆయా విషయాల్లో ఇద్దరూ ఒకే మాట మీద ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.

గొడవ తీర్చగలరా?

దంపతులు ఎంత ప్రేమతో మెలిగినా, ఒకరికొకరు ఎంతగా అడ్జస్ట్ అయినా.. ఏదో ఒక విషయంలో అరమరికలొస్తుంటాయి. ఇవి చిన్న చిన్న గొడవలకు దారితీస్తుంటాయి. ఈ క్రమంలో అలకలు సహజమే! అయితే ఇలాంటి గొడవల్ని ఎంత సామరస్యంగా పరిష్కరించుకున్నామా అన్నదే ఇక్కడ ముఖ్యం. కానీ కొంతమంది ఎదుటివారి సహనాన్ని పరీక్షిస్తుంటారు. చిన్న విషయాన్నే భూతద్దంలో పెట్టి చూస్తూ, బుజ్జగించినా మరింత అలకబూనుతూ.. భాగస్వామికి విసుగొచ్చేలా చేస్తారు. ఇక వారిలో ఓపిక ఉంటే సరే సరి.. లేదంటే ఈ చిన్న గొడవలే చినికి చినికి గాలివానలా మారతాయి. అనుబంధాన్ని మధ్యలోనే తెంచేస్తాయి. అందుకే కాబోయే దంపతులు గొడవల్ని ఎంత సామరస్యంగా పరిష్కరించుకోగలరో ముందుగానే పరీక్షించుకోవాలి. ఈ క్రమంలో ఒకరికి తెలియకుండా మరొకరు చిన్న పరీక్ష పెట్టుకున్నా తప్పులేదు. ఫలితంగా ఇద్దరిలో ఉన్న ఓపిక, ఇద్దరూ ఒకరినొకరు ఎంతలా అర్థం చేసుకోగలరు? అన్న విషయాలు అవగతమవుతాయి. ఇవే ఇద్దరినీ శాశ్వతంగా కలిపి ఉంచుతాయి.

ఆర్థిక లక్ష్యాలేంటి?

డబ్బు ఎలాంటి అనుబంధంలోనైనా చిచ్చుపెడుతుంది. చాలావరకు ఆర్థిక పరంగా ఇద్దరి లక్ష్యాలు, ఆలోచనలు ఒకేలా ఉండవు. అందుకే దంపతుల మధ్య ఆర్థిక విషయాల్లోనే ఎక్కువ గొడవలు జరుగుతాయంటున్నారు నిపుణులు. అందుకే పెళ్లికి ముందే డబ్బు విషయంలోనూ ఇద్దరూ ఏకాభిప్రాయానికి రావాలంటున్నారు. కొంతమందికి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటుండచ్చు.. మరికొంతమంది అనవసర ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవడంపై దృష్టి పెట్టచ్చు. ఇలాంటి భిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరడం చాలా కష్టం. అందుకే మీ ఇద్దరి ఆర్థిక లక్ష్యాలేంటి? భవిష్యత్తులో డబ్బును ఎలా వినియోగించుకోవాలనుకుంటున్నారు? భిన్న ఆలోచనలున్నా ముందు ముందు ఆర్థికపరంగా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారా? డబ్బు విషయంలో పారదర్శకంగా ఉండగలరా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఇలా ఆయా విషయాల్లో ఇద్దరూ అడ్జస్ట్ కాగలిగితే సమస్య ఉండదు.. లేదంటే మాత్రం అడుగు ముందుకేసే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అప్పుడే దాంపత్య బంధంలో ఎలాంటి అరమరికలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

వాటిని మర్చిపోయారా? లేదా?

పెళ్లికి ముందు ప్రేమ.. ఈ తరం వారికి ఇది కామనైపోయింది. అయితే అన్ని ప్రేమకథలు కంచికి చేరాలని లేదు. ప్రేమ విఫలమవడం.. లేదా ఇతర కారణాల వల్ల ప్రేమించిన భాగస్వామితో ఏడడుగులు నడవలేకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆ జ్ఞాపకాల్ని మర్చిపోవడం చాలా కష్టం. అలాగని అవే జ్ఞాపకాలతో మరో అనుబంధంలోకి అడుగుపెడితే.. ఇటు మిమ్మల్ని మీరు, అటు మీ భాగస్వామినీ మోసం చేసిన వారవుతారు. పెళ్లయ్యాకా గత జ్ఞాపకాల్నే పదే పదే తలచుకుంటూ బాధపడడం, తద్వారా భాగస్వామిని సంతోషపెట్టలేకపోవడం.. వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తచ్చు.. ఇలాంటి అనుబంధం నిత్యనరకంగా మారుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితి రాకముందే జాగ్రత్తపడాలి. ఈ క్రమంలో ముందుగానే జంటలు తమ గత ప్రేమకథలు, వైఫల్యాల గురించి ఒకరితో ఒకరు పంచుకోవాలి. వాటిని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తున్నామన్న భరోసాను అవతలి వారికి కలిగించాలి. ఇలా ఇద్దరూ ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానాలకు కట్టుబడి ఉండడం వల్ల దాంపత్య బంధం నిత్యనూతనమవుతుంది.

వీటితో పాటు ఒకరి విలువల్ని మరొకరు గౌరవించుకోవడం.. ప్రతి విషయంలోనూ నమ్మకం-నిజాయతీతో మెలగడం.. వ్యక్తిగత సమయాలకు భంగం కలిగించకపోవడం.. ఇలా ఆయా అంశాల్లో ఇద్దరూ ఒకే మాట మీదుంటే వైవాహిక బంధం శాశ్వతమవుతుంది.. దాంపత్య బంధం నిత్యనూతనమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్