Deepika Padukone: డ్రీమ్ గర్ల్ ‘శాంతిప్రియ’ మళ్లీ తిరిగొచ్చింది!

సినిమా రంగంలో ఎంత గుర్తింపు సంపాదించుకున్నా.. అంతర్జాతీయంగా జరిగే చిత్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం చాలా తక్కువమందికి దక్కుతుంది. తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని అందుకుంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె.

Updated : 19 Feb 2024 18:41 IST

(Photos: Instagram)

సినిమా రంగంలో ఎంత గుర్తింపు సంపాదించుకున్నా.. అంతర్జాతీయంగా జరిగే చిత్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం చాలా తక్కువమందికి దక్కుతుంది. తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని అందుకుంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె. ప్రతిష్టాత్మక ‘బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (BAFTA)’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా చరిత్రకెక్కిందామె. ఈ వేడుకలో రెడ్‌కార్పెట్‌పై హొయలు పోవడమే కాదు.. ప్రజెంటర్‌గానూ వ్యవహరించి ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుందీ ముద్దుగుమ్మ. విశ్వవేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరకట్టుతో కనికట్టు చేసిన దీప్స్‌ శారీ లుక్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA)’ అవార్డు.. బ్రిటిష్‌, అంతర్జాతీయ సినిమా/టీవీ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందించే పురస్కారమిది! లండన్‌లోని రాయల్‌ ఫెస్టివల్‌ హాల్‌లో తాజాగా జరిగిన ఈ అవార్డుల వేడుకలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె పాల్గొంది. తద్వారా బాఫ్టాలో పాల్గొన్న తొలి భారతీయ నటిగా కీర్తి గడించింది.

ది బాఫ్టా గోస్‌ టూ..!

బాఫ్టా వేదికపై తొలిసారి మెరిసిన దీపిక.. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. ఇందులోభాగంగానే ‘ఉత్తమ ఆంగ్లేతర చిత్రం’ కేటగిరీలో అవార్డును ప్రకటించి.. విజేతకు పురస్కారం అందించిందామె. పోలిష్‌ (పోలండ్‌ అధికారిక భాష)లో రూపుదిద్దుకున్న చరిత్రాత్మక చిత్రం ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’కు ఈ విభాగంలో అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని వెల్లడించేందుకు వేదిక పైకి చేరిన దీపిక.. ‘ఈ విభాగంలో నామినేట్‌ అయిన చిత్రాలు, వాటి కథలు, దక్కిన క్రెడిట్స్‌.. ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోతాయి.. ది బాఫ్టా గోస్‌ టూ.... ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’ అంటూ తనదైన రీతిలో వ్యాఖ్యానించింది దీప్స్‌. ఇలా ఆమె స్పీచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడే కాదు.. గతేడాది జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలోనూ వ్యాఖ్యాతగా సందడి చేసిందీ బాలీవుడ్‌ భామ. ఆ సమయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి ‘నాటు నాటు’ పాటకు అవార్డు దక్కిన ఆనందంలో.. ‘డు యు నో నాటు?.. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నుంచి నాటు నాటు పాట ఇదే’ అంటూ ఆస్కార్‌ వేదికపై ఆమె చేసిన ప్రసంగానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఇలా అప్పుడు ఆస్కార్‌, ఇప్పుడు బాఫ్టా వేదికలపై అదరగొట్టిందీ బాలీవుడ్‌ అందం.

‘శాంతిప్రియ’ను మరిపించేలా!

పార్టీ అయినా అవార్డుల వేడుకైనా ఎక్కువగా చీరకట్టుకే ప్రాధాన్యమిచ్చే దీపిక.. బాఫ్టా చిత్రోత్సవానికీ భారతీయత ఉట్టిపడేలా చీరలోనే ముస్తాబైంది. ఈ క్రమంలోనే సబ్యసాచి రూపొందించిన పేల్‌ షిమ్మరింగ్‌ శారీని ఎంచుకున్న ఆమె.. మ్యాచింగ్‌ స్ట్రాప్‌ బ్లౌజ్‌ ధరించింది. బన్‌ హెయిర్‌స్టైల్‌, స్టోకీ ఐ మేకప్‌ ఆమె లుక్‌ని మరింత పెంచేశాయని చెప్పచ్చు. అయితే ఈ లుక్‌లో దీప్స్‌ తన తొలి సినిమా ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’లో శాంతిప్రియ (దీపిక పాత్ర పేరు)ను తలపించేలా ఉందంటున్నారు నెటిజన్లు. ‘దీపికా పదుకొణె.. ది డ్రీమీ గర్ల్‌’, ‘బాఫ్టా వేదిక పైకి శాంతిప్రియ తిరిగొచ్చింది..’, ‘శాంతిప్రియ.. ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ’.. అంటూ ఆమె శారీ లుక్‌ని తెగ ప్రశంసించేస్తున్నారు. మరికొందరు ‘ఓమ్‌ శాంతి ఓమ్’ నుంచి ‘ఆఖో మే తేరీ’ అనే పాటను ప్లే చేయమని అలెక్సాను అడుగుతున్నారు. ఇలా మొత్తానికి దీపిక శారీ లుక్స్‌ మరోసారి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘ఫైటర్‌’తో హిట్టు కొట్టిన ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘కల్కి’లో నటిస్తోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్