Published : 06/07/2022 19:48 IST

పిల్లలు తక్కువ బరువుంటే..

అధిక బరువు వల్ల ఎలాగైతే వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయో.. అలాగే బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వెంటాడే ఆరోగ్య సమస్యలు బోలెడుంటాయి. ఇది కేవలం పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకీ వర్తిస్తుంది. చాలామంది తల్లిదండ్రులు వారి బుజ్జాయిల బరువు గురించి బాధపడుతూ ఉంటారు. ఈ క్రమంలో- వారిని ఓసారి పోషకాహార నిపుణులకు చూపించి, వారు సూచించిన సలహాలను క్రమం తప్పకుండా పాటించాలి. ఈ నేపథ్యంలో- మరీ తక్కువ బరువున్న పిల్లలు బరువు పెరగాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...

బలవంతపెట్టొద్దు!

కొంతమంది తల్లులు పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని టెన్షన్ పడుతూ.. వాళ్లకు ఎలాగైనా ఆహారం తినిపించాలని నిర్ణయించుకుని బలవంతంగా తినిపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తినే ఆహారంపై వారికి ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ పద్ధతి వల్ల వారు తినకుండా మరింత మొండికేస్తుంటారు. దీనివల్ల వారికి అందాల్సిన పోషకాలు పూర్తిగా అందకుండా పోతాయి. కాబట్టి పిల్లల్ని ఆహారం విషయంలో బలవంతపెట్టకుండా.. వారి కోసం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఏ పదార్థాలు, స్నాక్స్ ఇవ్వాలో ఓ ప్రణాళిక తయారుచేయాలి. దాని ప్రకారం వారికి పోషకాహారం అందించాలి. ఫలితంగా వారికి కావాల్సిన పోషకాలు అంది.. శరీర బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

వీటికి దూరంగా..

తల్లిదండ్రులు మామూలు సమయాల్లో టీవీ చూడనివ్వట్లేదని, కనీసం తినే సమయంలోనైనా టీవీ చూడచ్చని చాలామంది పిల్లలు ఆనందపడిపోతుంటారు. ఇక ఈ సాకుతో గంటలు గంటలు తినడానికే వృథా చేస్తుంటారు. అయితే ఇలా తినడం వల్ల వారి ధ్యాసంతా ఆహారం మీద కంటే టీవీ మీదే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అనే విషయాలేవీ వారు పట్టించుకోరు. అందులోని రుచి వారికి తెలియదు. ఈ క్రమంలో టీవీలో ఏవైనా ఆవేశపూరిత సన్నివేశాలొస్తే.. అవి వారి తిండి మీద, మనసు మీద ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఆటంకాల వల్ల వారు ఆహారం తీసుకోవడంపై మనసు లగ్నం చేయకపోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి పిల్లలు తినే సమయంలో టీవీ ఆఫ్ చేసేయడం, మొబైల్స్, కంప్యూటర్, ల్యాప్‌టాప్స్.. వంటి గ్యాడ్జెట్లు వారికి దూరంగా ఉంచడం.. వంటివి చేయాలి. అలాగే వీటి పైకి మనసు మళ్లకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పక్కనే కూర్చొని పిల్లలు తినే ఆహార పదార్థాలపై వారికి అవగాహన కల్పించాలి. దానికి తగినట్టుగానే ఆహారం రంగు, రుచి, వాసన ఉండేలా చూసుకోవాలి. తద్వారా వారిలో ఆహారం పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది.

క్యాలరీలూ ఆరోగ్యకరంగానే..

పిల్లలు తక్కువ బరువు నుంచి బయటపడాలంటే.. ముందుగా వారికి ఎక్కువ క్యాలరీలుండే ఆహారపదార్థాలు అందించాలి. అలాగని కేక్‌లు, స్వీట్లు, పిజ్జా, బర్గర్లు.. వంటివి పెట్టమని కాదు దానర్థం. చిక్కటి పాలు, మీగడ పెరుగు, ఆహారంలో భాగంగా నెయ్యి.. వంటి పదార్థాలతో పాటు విటమిన్లు, ఖనిజాలు అధికంగా లభించే పండ్లు, కూరగాయల్ని కూడా వారి రోజువారీ ఆహారంలో భాగం చేయాలి. దీనిపై సరైన అవగాహన లేకపోతే సంబంధిత పోషకాహార నిపుణులను సంప్రదించి వారు సూచించే ఆహారాన్ని పిల్లలకు రోజూ అందివ్వాలి.

ఎప్పటికప్పుడు..

వయసు, ఎత్తు.. వంటివి ఆధారంగా బరువును నిర్ణయిస్తారు. కాబట్టి ముందుగా నిపుణులను సంప్రదించి వారి ఎత్తు, వయసు ప్రకారం వారు ఎంత బరువుండాలో తెలుసుకోవాలి. తర్వాత వారు అందించే సూచనలు పాటిస్తూ పిల్లల బరువును క్రమంగా పెంచాలి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు వారు ఎంత బరువు పెరుగుతున్నారు? ఒకవేళ ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తక్కువైతే పెంచాల్సిన మార్గాలు.. వంటి విషయాలన్నింటిపై తల్లిదండ్రులకు మంచి అవగాహన ఉంటే మంచిది. కాబట్టి తక్కువ బరువు నుంచి వారిని బయటపడేయాలంటే ఇలా ఎప్పటికప్పుడు వారి బరువును చెక్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించడం ముఖ్యం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని