ఇవీ వివాహేతర సంబంధాలేనట!

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అంశాలు బోలెడుంటాయి. అందులో వివాహేతర సంబంధాలు కూడా ఒకటి. అయితే ఈ తరహా సంబంధం అనగానే చాలామంది అవతలి వారికి శారీరకంగా దగ్గరవడమే అనుకుంటారు.

Published : 07 Dec 2023 12:51 IST

భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసే అంశాలు బోలెడుంటాయి. అందులో వివాహేతర సంబంధాలు కూడా ఒకటి. అయితే ఈ తరహా సంబంధం అనగానే చాలామంది అవతలి వారికి శారీరకంగా దగ్గరవడమే అనుకుంటారు. కానీ ఇదొక్కటే కాకుండా.. ఇందులో విభిన్న రకాలున్నాయంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఒక్కో రకమైన సంబంధంలో అవతలి వారిపై ఒక్కోలా ఆధారపడతారని చెబుతున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఈ వ్యామోహం.. తాత్కాలికమే!

ప్రేమ, వ్యామోహం.. ఈ రెండూ భిన్న ధ్రువాలు. మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి కోసం ఎన్నేళ్లైనా వేచి ఉంటాం. అదే వ్యామోహంలో ఇలాంటి ఎదురుచూపులు ఉండవు. ఎక్కువ శాతం వివాహేతర సంబంధాల్లో కూడా ఎదుటివారిపై ఇలాంటి వ్యామోహంతో కూడిన భావాలే కలుగుతాయంటున్నారు నిపుణులు. దీన్నే ‘రొమాంటిక్‌ అఫైర్‌’గా పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా.. ముందూ వెనకా ఆలోచించకుండా, తమ జీవిత భాగస్వామితో అనుబంధం గురించిన కనీస ఆలోచన లేకుండా.. అవతలి వారికి శారీరకంగా దగ్గరవడమే లక్ష్యంగా పెట్టుకుంటారట! ఈ క్రమంలో ఒకరికొకరు తమ వ్యక్తిగత విషయాలు, భావోద్వేగాలు పంచుకోవడానికీ వెనకాడరట! అయితే ఈ తరహా వ్యామోహం శాశ్వతం కాదని.. శారీరక వాంఛ తీరిపోగానే ఇద్దరూ విడిపోయే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి క్షణికావేశంలో తప్పటడుగు వేయకుండా.. తప్పొప్పులు తెలుసుకొని మసలుకోవడం వల్ల దాంపత్య బంధాన్ని నిలుపుకోవచ్చంటున్నారు.

ఫ్రెండ్షిప్‌కు ఎక్కువ.. పార్ట్‌నర్‌కు తక్కువ!

దాంపత్య బంధమంటే సుఖాలే కాదు.. కష్టాలు, మనసులోని భావోద్వేగాల్నీ ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడే ఇద్దరి మధ్య చనువు మరింతగా పెరుగుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది దంపతులు ఈ సమయం కూడా తమకు దొరకట్లేదని అంటున్నట్లు కౌన్సెలింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం గడిపేది పని ప్రదేశంలోనే! కాబట్టి అక్కడే తమను ఆత్మీయంగా పలకరించే వ్యక్తులతో స్నేహం చేయడం, క్రమంగా మనసులోని భావోద్వేగాల్ని వారితో పంచుకోవడానికీ వెనకాడట్లేదట! ఈ తరహా వివాహేతర సంబంధాల్ని ‘ఎమోషనల్‌ అఫైర్స్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. అయితే ఈ తరహా అనుబంధంలో ఇద్దరూ స్నేహితులుగానే ఉండిపోవచ్చు.. లేదంటే ఓ అడుగు ముందుకేసి శారీరకంగానూ దగ్గరయ్యే అవకాశాలూ లేకపోలేదంటున్నారు.

ఏదేమైనా దీనివల్ల కూడా దాంపత్య బంధానికి ముప్పే.. కాబట్టి తెగే దాకా లాగకుండా.. సంయమనంతో ఆలోచించి.. మీ భాగస్వామితో మాట్లాడే ప్రయత్నం చేయండి.. ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ కలిసి గడిపే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొని.. మీలోని ఆలోచనలు, భావోద్వేగాల్ని కలిసి పంచుకోవడం వల్ల అనుబంధానికి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

ప్రతీకారమా? ముప్పు మీకే!

భార్యాభర్తలన్నాక గొడవ పడడం, తిరిగి కలిసిపోవడం.. కామనే! అయితే కొంతమంది ఈ గొడవల్ని భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. చిన్న సమస్యను పెద్దది చేస్తుంటారు. ‘నన్నే మోసం చేస్తావా? నేనూ నిన్ను మోసం చేయగలను!’ అంటూ ప్రతీకారంతో రగిలిపోతుంటారు. ఈ క్రమంలో మరో వ్యక్తికి దగ్గరయ్యే వారూ లేకపోలేదు. ఈ తరహా సంబంధాన్నే ‘ప్రతీకార వివాహేతర సంబంధం’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి తాము చేసేది తప్పని తెలిసినా.. తమ జీవిత భాగస్వామిపై ప్రతీకారం తీర్చుకోవాలని, తమ చేతలతో వారిని బాధ పెట్టాలన్న ముఖ్యోద్దేశంతోనే ఇదంతా చేస్తుంటారు. అయితే ‘తన కోపమే తన శత్రువు’ అన్నట్లుగా.. ఈ ప్రతీకారం మీకు, మీ భార్యాభర్తల మధ్య అనుబంధానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి తెలిసి తెలిసి తప్పటడుగు వేయకుండా.. ఆలుమగల మధ్య ఉండే సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు. దీనివల్ల నాలుగ్గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారం నలుగురిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

సైబర్‌ అఫైర్‌

వివాహం అనేది ఒక నమ్మకం. అయితే ఏళ్లు గడిచే కొద్దీ కొంతమంది దంపతుల మధ్య ఈ నమ్మకం క్రమంగా సడలుతుంటుంది. ఒకరిపై మరొకరికి ఆసక్తీ తగ్గిపోతుంటుంది. ఇందుకు ఒకరికొకరు సమయం కేటాయించలేకపోవడం, శృంగారం విషయంలోనూ ఒకరినొకరు దూరంగా పెట్టడం, అసూయద్వేషాలు.. వంటివి కారణమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది తమతో ఆత్మీయంగా మాట్లాడే వారికి దగ్గరవుతుంటారు. ఇది ప్రత్యక్షంగానే కాదు.. ఆన్‌లైన్‌ వేదికగానూ జరగొచ్చు. ఈ తరహా వివాహేతర సంబంధాన్ని ‘సైబర్‌ అఫైర్‌’ అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అవతలి వ్యక్తికి రొమాంటిక్‌గా సందేశాలు పంపడం, ఫొటోలు-వీడియోలు పంచుకోవడం.. వంటివి చేస్తుంటారట! అయితే శాశ్వతమైన పెళ్లి బంధాన్ని, జీవిత భాగస్వామిని వదిలేసి.. ఇలాంటి అక్రమ మార్గాల్ని అనుసరించడం వల్ల నష్టపోయేది మీరే అంటున్నారు నిపుణులు. కాబట్టి భార్యాభర్తల మధ్య నమ్మకం సడలడానికి, బంధం బీటలు వారడానికి గల కారణాలేంటో అన్వేషించి.. కలిసి పరిష్కరించుకుంటే ఫలితం ఉంటుంది.. అలాగే ఈ క్రమంలో దంపతులిద్దరూ రిలేషన్‌షిప్‌ నిపుణుల కౌన్సెలింగ్‌ కూడా తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్