Jet Lag Syndrome: సుదూర విమాన ప్రయాణాలా? ఇవి తెలుసుకోండి!
పని వేళల్లో కాస్త మార్పులొస్తేనే అసౌకర్యానికి గురవుతాం.. అలాంటిది వెంటవెంటనే దూర ప్రయాణాలంటే ఒళ్లు హూనమవుతుంటుంది. దానికి తోడు కాలమానాలు పూర్తి భిన్నంగా ఉండే చోటికి వెళ్లినప్పుడు నిద్ర కరువవుతుంటుంది.. ఫలితంగా శారీరకంగా, మానసికంగా....
పని వేళల్లో కాస్త మార్పులొస్తేనే అసౌకర్యానికి గురవుతాం.. అలాంటిది వెంటవెంటనే దూర ప్రయాణాలంటే ఒళ్లు హూనమవుతుంటుంది. దానికి తోడు కాలమానాలు పూర్తి భిన్నంగా ఉండే చోటికి వెళ్లినప్పుడు నిద్ర కరువవుతుంటుంది.. ఫలితంగా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. దీన్నే ‘జెట్ ల్యాగ్ డిజార్డర్ (Jet Lag)’ అంటారు. ప్రస్తుతం తానూ ఇదే సమస్యతో బాధపడుతున్నానంటోంది టాలీవుడ్ బ్యూటీ శృతీ హాసన్. సినిమా షూటింగ్స్, సంగీత ప్రదర్శనలంటూ తరచూ విమాన ప్రయాణాలు చేసే ఈ ముద్దుగుమ్మ.. ఈ నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నట్లు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఈ నేపథ్యంలో ‘జెట్ ల్యాగ్ డిజార్డర్’ను ఎలా గుర్తించాలి? దీన్నుంచి బయటపడే మార్గాలేంటి? తెలుసుకుందాం రండి..
అసలెందుకిలా..?!
షూటింగ్స్, వెకేషన్స్, ఇతర పనుల రీత్యా.. సినిమా తారలు, ప్రముఖులు సుదూర ప్రాంతాలకు విమాన ప్రయాణాలు చేయడం సహజమే! వీళ్లే కాదు.. కొంతమంది అత్యవసర పనుల రీత్యా.. ఉన్నట్లుండి ప్రయాణమవ్వాల్సి వస్తుంటుంది. ఈ క్రమంలో మనం అప్పటిదాకా ఉన్న కాలమానాలు.. మనం వెళ్లే ప్రాంతంలో కాలమానాలు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు.. భారత్, అమెరికా కాలమానాల్ని పరిశీలిస్తే.. మనం వారి కంటే పది గంటలు ముందుంటాం. అంటే.. ఉదయం 6 గంటలకు ఇక్కడ బయల్దేరితే.. ఆ సమయంలో వారికి రాత్రి ఆరంభమవుతుంది కాబట్టి.. మనం అక్కడికి చేరుకునేసరికి ఉదయం అవుతుంది. దీంతో మన జీవ గడియారానికి, వెళ్లిన ప్రదేశంలో కాలమానాలకు పొంతన కుదరక.. నిద్ర వేళల్లో తేడాలొచ్చి.. శారీరకంగా, మానసికంగా పలు సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ పరిస్థితినే ‘జెట్ ల్యాగ్ సిండ్రోమ్’గా పిలుస్తారు. ప్రస్తుతం తాను కూడా ‘తీవ్రమైన జెట్ లాగ్ డిజార్డర్‌ను ఎదుర్కొంటున్నా..’ అంటూ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో తన ఫొటోను పోస్ట్ చేసింది శృతి. అమెరికా లాంటి సుదూర ప్రయాణాలనే కాదు.. మన కాలమానంతో కనీసం 3 గంటల వ్యత్యాసం ఉన్న ప్రాంతాలకు వెళ్లినా.. మన జీవ గడియారం అక్కడి పరిస్థితులకు సర్దుకుపోలేక ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు.
ఈ లక్షణాలుంటే..!
ఉదయం నుంచి సాయంత్రం దాకా మెలకువతో ఉండి పనులన్నీ చక్కబెట్టుకోవడం, రాత్రి నిద్రపోవడం.. మన శరీరం ఈ రొటీన్‌కు అలవాటు పడిపోతుంది. అదే వెనువెంటనే ప్రాంతాలు మారడం వల్ల.. అక్కడి కాలమానాలు, నిద్ర సమయాలకు పొంతన కుదరక ‘జెట్ ల్యాగ్ సిండ్రోమ్’ బారిన పడుతుంటాం. అయితే ఈ తాత్కాలిక నిద్ర సమస్యను కొన్ని లక్షణాలతో గుర్తించచ్చంటున్నారు నిపుణులు.
⚛ వేళలతో పొంతన లేకుండా మనం కావాలనుకున్నప్పుడు నిద్ర పట్టదు.. అలాగే వివిధ పనుల రీత్యా త్వరగా నిద్ర లేవడం వల్ల సరిపడినంత సమయం నిద్రకు కేటాయించలేం. దీనివల్ల రోజంతా అలసిపోయినట్లుగా, మగతగా అనిపిస్తుంటుంది.. ఫలితంగా ఏ పనీ చేయలేం.
⚛ నిద్రా భంగం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.. తద్వారా చేసే పనిపై దృష్టి పెట్టలేం.
⚛ అలసట, నీరసం ప్రభావం శారీరక దృఢత్వం పైనా పడుతుంది. తద్వారా ఇంటి పనులు మునుపటిలా చేసుకోలేం. ఇది క్రమంగా బద్ధకానికి దారితీస్తుంది.
⚛ ఎలాంటి అనారోగ్యం లేకపోయినా.. జ్వరం వచ్చినట్లుగా, ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది.
⚛ జీవ గడియారంలో తేడాలొస్తే.. జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపునొప్పి, వికారం, మలబద్ధకం.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
⚛ ఈ తాత్కాలిక నిద్ర సమస్య మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. ఫలితంగా ఒత్తిళ్లు, ఆందోళన, చిరాకు.. వంటి సమస్యలొస్తాయి.
ముందు జాగ్రత్తగా..!
‘జెట్ ల్యాగ్ సిండ్రోమ్’తో బాధపడే కంటే.. కొన్ని ముందు జాగ్రత్తల వల్ల ఈ సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
⚛ అత్యవసర ప్రయాణాలు కాకుండా.. ముందే ప్రణాళిక వేసుకున్న వారు.. ఒకట్రెండు రోజుల ముందు నుంచే నిద్ర వేళల్లో కాస్త మార్పు చేసుకోవాలి. ఈ క్రమంలో మనం ఉన్న ప్రాంతం నుంచి తూర్పు దేశాలకు ప్రయాణించే వారు.. సాధారణ సమయం కంటే రెండు గంటలు ముందుగా; పశ్చిమ దేశాలకు ప్రయాణించే వారు రెండు గంటలు ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించాలట! తద్వారా మన శరీరం అక్కడి కాలమానాలకు కాస్త ఎడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుందట!
⚛ ఇలా వెళ్లి.. అలా పనులు చేసుకోవడం కాకుండా.. వీలైతే రెండు రోజుల ముందుగానే గమ్యస్థానాలకు చేరుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా అక్కడి సమయాలతో మన జీవ గడియారం కాస్త ఎడ్జస్ట్ అవుతుంది. ఫలితంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా.. వెళ్లిన పనులన్నీ చకచకా పూర్తిచేసుకోవచ్చు.
⚛ ప్రయాణాల కోసం సన్నద్ధమయ్యే వారు.. కొద్ది మొత్తాల్లో ఆహారం తీసుకోవడం మంచిది. తద్వారా జెట్ ల్యాగ్ సిండ్రోమ్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.
⚛ ఇక ప్రయాణాల్లోనూ.. నీళ్లు, ఇతర పానీయాలు ఎక్కువగా తీసుకుంటూ శరీరాన్ని తేమగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.
⚛ సుదూర ప్రయాణాలైతే గంటల తరబడి అలాగే కూర్చోవడం కాకుండా.. మధ్యమధ్యలో కాసేపు అటూ ఇటూ తిరగడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల.. శరీరం, మనసు.. రెండూ చురుగ్గా ఉంటాయి.
⚛ పగటి పూట ప్రయాణాలైతే మధ్యమధ్యలో అరగంట పాటు కునుకు తీయడం, రాత్రి పూటైతే ప్రశాంతంగా నిద్రపోవడం.. వల్ల ప్రయాణం పూర్తయ్యాక శరీరం, మనసు చురుగ్గా ఉంటాయి.
⚛ అలాగే ప్రయాణాల్లో టీ/కాఫీ/క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు.. వంటివి తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
ఇక వీటన్నింటితో పాటు ప్రయాణాలకు ఒకట్రెండు రోజుల ముందు నుంచే నిపుణుల సలహాలు పాటించడం, సమస్యలేవైనా ఎదురైతే డాక్టర్‌ను సంప్రదించి వారు సూచించే మందులు, ఇతర జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.