Interview Tips: ఇంటర్వ్యూలో తిరస్కరణా? ఇవి గుర్తుపెట్టుకోండి!

కలల ఉద్యోగం సాధించాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలన్నీ వదులుకోకుండా ప్రయత్నిస్తుంటాం. కష్టపడి సన్నద్ధమై ఇంటర్వ్యూలకు హాజరవుతుంటాం. అలాగని అన్నింట్లోనూ సఫలమవుతామా అంటే.. ఒక్కోసారి మనం కచ్చితంగా ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థే మనల్ని.....

Published : 16 Feb 2023 19:16 IST

కలల ఉద్యోగం సాధించాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలన్నీ వదులుకోకుండా ప్రయత్నిస్తుంటాం. కష్టపడి సన్నద్ధమై ఇంటర్వ్యూలకు హాజరవుతుంటాం. అలాగని అన్నింట్లోనూ సఫలమవుతామా అంటే.. ఒక్కోసారి మనం కచ్చితంగా ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థే మనల్ని తిరస్కరించచ్చు. ఇలాంటప్పుడు చాలామంది ప్రతికూల భావనలోకి వెళ్లిపోతారు. నిజానికి ఇలాంటి సమయంలోనే సంయమనంతో వ్యవహరించాలంటున్నారు నిపుణులు. ‘దీనికంటే మెరుగైన అవకాశం రావచ్చేమో!’ అన్న సానుకూల దృక్పథంతో ముందుకు సాగితేనే.. ఇటు లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు అటు కెరీర్‌లోనూ ఉన్నత స్థితికి చేరుకోవచ్చంటున్నారు. మరి, ఇంటర్వ్యూ తిరస్కరణ నుంచి బయటపడి తిరిగి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

మీరు ఒంటరి కాదు!

ఇంటర్వ్యూ అంటే మీరొక్కరే కాదు.. ఆయా ఉద్యోగ నైపుణ్యాలున్న చాలామంది అక్కడికి వస్తుంటారు. అందులో మీ స్నేహితులుండచ్చు, ఇంటర్వ్యూ సమయంలోనే మరికొందరు మీకు పరిచయం కావచ్చు. ఏదేమైనా ఇంటర్వ్యూకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలని లేదు. అందరిలోకెల్లా ఉత్తమ నైపుణ్యాలు కనబరిచిన వారినే సంస్థ ఎంచుకుంటుంది. ఈ క్రమంలో మీరు ఎంపిక కాలేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరొక్కరే కాదు.. అక్కడికొచ్చిన వారిలో చాలామంది ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురవుతుంటారు. కాబట్టి ‘ఎంత కష్టపడి ప్రిపేరైనా ఉద్యోగానికి ఎంపిక కాలేద’ని బాధపడకుండా.. వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి.. ఈ క్రమంలో మీ మనసులోని ఫీలింగ్స్‌ని వారితో పంచుకోవడంతో పాటు వారి గత అనుభవాల్ని కూడా వినండి. అలాగే ఈ ప్రతికూల భావన నుంచి ఎలా బయటపడచ్చో వారిని సలహాలూ అడగొచ్చు. తద్వారా ఒంటరి అనే భావన నుంచి బయటపడడంతో పాటు తదుపరి ఇంటర్వ్యూకు మరింత సానుకూలంగా సన్నద్ధమవ్వచ్చు.

ఫీడ్‌బ్యాక్‌ మంచిదే!

ఇంటర్వ్యూ పూర్తయ్యాక.. ఉద్యోగానికి ఎంపికైనా, కాకపోయినా.. సంస్థ మెయిల్‌ ద్వారా తెలియజేయడం కామనే! ఒకవేళ ఎంపికైతే సరే సరి.. అదే కాకపోతే మాత్రం ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తుంటారు చాలామంది. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. తాము ఎందుకు ఎంపిక కాలేకపోయామో.. సంబంధిత సంస్థ నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు. ఈ క్రమంలో నైపుణ్యాల పరంగా తాము ఎందులో వెనకబడి ఉన్నామో, తాము చేసిన పొరపాట్లేంటో తెలుసుకోవడంతో పాటు.. ఇంకా మెరుగుపరచుకోవాల్సిన అంశాల గురించీ అడిగి తెలుసుకోవడం మంచిదంటున్నారు. తద్వారా వెనకబడి ఉన్న అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఫలితంగా రాబోయే ఇంటర్వ్యూల్లో మరింత మెరుగ్గా రాణించి.. కలల ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.

మీకు మీరుగా..!

ఎంతో కష్టపడి కచ్చితంగా ఉద్యోగం సంపాదించాలనుకున్న సంస్థ మనల్ని ఎంపిక చేయకపోతే.. మన నైపుణ్యాలు, ప్రతిభ విషయాల్లో ఒక రకమైన ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోతాం. కానీ ఇలాంటి ప్రతికూల ఆలోచనల్లో కూరుకుపోవడం కంటే.. అసలు ఎందుకు ఎంపిక కాలేకపోయామో ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఈ ఇంటర్వ్యూలో చేసిన పొరపాట్లేంటో తెలుసుకొని తదుపరి ఇంటర్వ్యూలో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడడం.. అలాగే ఎందులో వెనకబడి ఉన్నారో ఆ నైపుణ్యాలను మెరుగుపరచుకునే ప్రయత్నం చేయడం.. వంటివి ముఖ్యం. ఈ క్రమంలో మీకేమైనా సందేహాలున్నా, సలహాలు కావాలన్నా మెంటార్ల సహాయం తీసుకోవడం మరీ మంచిది. తద్వారా వారిచ్చే సలహాలు, సూచనలు మీరు నిర్దేశించుకున్న లక్ష్యానికి మిమ్మల్ని చేరువ చేస్తాయి. మీ ఉన్నత కెరీర్‌కు బాటలు వేస్తాయి.

విరామం తీసుకోండి!

ఉద్యోగానికి ఎంపిక కాలేకపోతే.. ‘తాము ప్రతిభావంతులం కాద’ని, ‘ఇకపై తమకు ఎలాంటి అవకాశాలు రావేమోన’ని, ‘భవిష్యత్తులో ఉద్యోగం రాకపోతే ఎలా?’ అని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ప్రతికూల ఆలోచనతో సతమతమవుతుంటారు. నిజానికి దీనివల్ల ఒత్తిడి, ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యలు తప్ప మరే ప్రయోజనం ఉండదంటున్నారు నిపుణులు. ఇలాంటి ప్రతికూలతల నుంచి బయటపడేందుకు వీలైతే కొన్ని రోజుల పాటు ఉద్యోగాన్వేషణకు విరామం ప్రకటించడమే ఉత్తమమంటున్నారు. ఈ క్రమంలో అభిరుచులపై దృష్టి పెట్టడం, వెకేషన్‌కి వెళ్లడం.. వంటివి చేయడం వల్ల తిరిగి పునరుత్తేజితం కావచ్చు.. కెరీర్‌లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా పని ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు తాము ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తుంటామని చాలా సందర్భాల్లో చెబుతుంటారు కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్