వాళ్లను చూస్తుంటే.. పెళ్లంటేనే భయమేస్తోంది..!

నాకు 34 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నా చుట్టూ ఉన్న జంటలను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు. ముఖ్యంగా మా అక్క పెళ్లైనప్పటి నుంచీ భర్త, అత్తమామలతో ఇబ్బందులు పడుతోంది. నాకు పెళ్లి వద్దని ఎంత చెప్పినా అమ్మానాన్నలు వినడం లేదు. నా గురించి చాలా బాధపడుతున్నారు....

Published : 20 May 2024 13:59 IST

నాకు 34 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నా చుట్టూ ఉన్న జంటలను చూస్తుంటే పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు. ముఖ్యంగా మా అక్క పెళ్లైనప్పటి నుంచీ భర్త, అత్తమామలతో ఇబ్బందులు పడుతోంది. నాకు పెళ్లి వద్దని ఎంత చెప్పినా అమ్మానాన్నలు వినడం లేదు. నా గురించి చాలా బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా నేను నా మనసు మార్చుకోలేకపోతున్నా. పెళ్లంటే భయం పోవడం లేదు. కౌన్సెలింగ్ తీసుకుంటే నాలో ఉన్న భయం పోతుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ వయసు 34 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని అంటున్నారు. మీకు తెలిసిన వారు, చుట్టుపక్కల జంటలు పడుతోన్న ఇబ్బందులను చూసి మీకు పెళ్లిపై నిరాసక్తి పెరిగిందని అంటున్నారు. పైగా ఇంట్లోనే మీ అక్క ఇబ్బంది పడుతుండడంతో మీ భయాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. చాలామంది ఒక రంగంలో ఇతరులు పడుతున్న ఇబ్బందులు చూసి దాని గురించి ముందే ఒక వ్యతిరేక అభిప్రాయానికి వస్తుంటారు. ఇలా చూస్తే మీకు అన్ని రంగాల్లోనూ ఇబ్బందులే కనిపిస్తుంటాయి. కొంతమంది పెళ్లి విషయంలో కూడా ఇలానే ఆలోచిస్తుంటారు. పెళ్లైన వారి ఇబ్బందులు చూసి తమకు కూడా ఇలానే జరుగుతుందనే భయాలు పెట్టుకుంటారు. మీ ఇంట్లోనే ఒకరికి ఇలా జరుగుతుండడంతో మీ భయాలు ఎక్కువయ్యాయి. అయితే ఏ విషయంలో అయినా సరే సానుకూల దృక్పథంతో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మీరు నాణేనికి ఒకవైపు మాత్రమే ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు కూడా చాలామంది ఉన్నారు. ఏ ఇద్దరి మధ్యనైనా అభిప్రాయభేదాలు రావడం సహజం. కాబట్టి, జీవితంలో అవన్నీ ఒక భాగమని ముందుకు సాగుతుండాలి. వాటిని భూతద్దంలో పెట్టి చూస్తే పెద్ద సమస్యలుగానే కనిపిస్తుంటాయి.
మీకు తెలిసిన, చుట్టుపక్కల ఉన్న జంటలు పడుతున్న ఇబ్బందులు చూసి మీరు భయపడుతున్నానని అంటున్నారు. అయితే దంపతుల మధ్య వచ్చే ఇబ్బందులు ఒక్కొక్కరివి ఒక్కో విధంగా ఉంటాయి. ఏ రెండు జంటల మధ్య సమస్యలు ఒకేలా ఉండవు. వాటి వెనుక పలు కారణాలు ఉంటాయి. వాటిని మీరు ఉదాహరణగా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనికి బదులుగా సానుకూలంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. వారు సంతోషంగా ఉండే క్షణాలను కూడా పరిగణనలోకి తీసుకోండి.
అప్పటికీ మీరు ఒక నిర్ణయానికి రాలేకపోతుంటే మానసిక నిపుణుల సహాయం తీసుకోండి. వారు మీ ఆలోచనా విధానాన్ని లోతుగా పరిశీలిస్తారు. పెళ్లిపై మీకున్న అభిప్రాయాలను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తారు. తద్వారా మీ అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా తగిన సలహా సూచిస్తారు. కాబట్టి, ఒకసారి వారిని కలిసే ప్రయత్నం చేయండి. సానుకూల దృక్పథంతో ఆలోచించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్