కోరిక తీర్చమని వేధిస్తున్నాడు..!

నాకు పెళ్లై మూడు సంవత్సరాలవుతోంది. నాకు రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే జాబ్‌ చేస్తున్నాను. మొదట్లో నేను ఫ్రెషర్‌ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్ చేసేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. దాంతో నా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేదాన్ని. మొదట్లో బాగానే ఉన్నాడు.

Published : 30 May 2024 18:53 IST

నాకు పెళ్లై మూడు సంవత్సరాలవుతోంది. నాకు రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే జాబ్‌ చేస్తున్నాను. మొదట్లో నేను ఫ్రెషర్‌ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్ చేసేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. దాంతో నా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేదాన్ని. మొదట్లో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సందర్భాలలో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో అతన్ని దూరం పెట్టడం ప్రారంభించాను. అయితే అప్పటికి నేను ఉద్యోగానికి కొత్త కావడం వల్ల ఆఫీసులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు బాగానే ఉన్నా.. నాకు పెళ్లై, పాప పుట్టాక ఇప్పుడు మళ్లీ నన్ను ప్రేమిస్తున్నానని టార్చర్‌ చేస్తున్నాడు. నేను అతన్ని చీట్‌ చేశానని, వాడుకున్నానని అంటున్నాడు. ఎలాగైనా సరే తన కోరిక తీర్చమని టార్చర్‌ పెడుతున్నాడు. నా భర్తకి నేను అబ్బాయిలతో మాట్లాడడమే నచ్చదు. ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తాడు. అందువల్ల నా బాధంతా నా భర్తకు చెప్పాలని ఉన్నా.. చెప్పలేకపోతున్నా. నాకు నా భర్త, పాప కావాలి. పైగా సొంతూరులో మావి ఉన్నత విలువలున్న కుటుంబాలు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జ. అతను మీతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడే మీరు గట్టిగా బుద్ధి చెప్పకపోవడంతో ఎలాంటి భయం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పండి. ఇప్పటి నుంచైనా అతనితో కఠినంగా వ్యవహరించండి. మీరు మీ పరిధి దాటి అతనితో ప్రవర్తించలేదని చెబుతున్నారు. కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు. అతని అసభ్య ప్రవర్తన గురించి తోటి ఉద్యోగులకు తెలిసే విధంగా సూచనలివ్వండి. మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు అతను ఏదైనా అంటే దానికి మీరు బాధ్యులు కాదన్న విషయాన్ని తెలుసుకోండి.

మిగతా వారితోనూ అలానే చేస్తున్నాడా..?

ప్రస్తుతం ఇలాంటి సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు సంబంధించి POSH (Prevention of Sexual Harassment at Workplace) లాంటి చట్టాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మీ సమస్యను ఉన్నతాధికారులు, మానవ వనరుల విభాగం వారికి మొదట సూచనప్రాయంగా తెలిపే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలతో మిమ్మల్ని ఏవిధంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడో వివరించండి. ఒకరితో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న వ్యక్తి మిగతా వారితోనూ అసభ్యంగా ప్రవర్తించరన్న గ్యారంటీ లేదు. కాబట్టి, మీలాగే బయటకు చెప్పకుండా ఇబ్బంది పడుతోన్నవారు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఒక సమస్యను కలిసికట్టుగా చెప్పినప్పుడు ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి, అలా మీకు ఎవరైనా కనిపించినప్పుడు వారితో కలిసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే మీ భర్తకి ఉద్యోగ జీవితంలో ఇతర ఉద్యోగులతో మాట్లాడడం సాధారణమేనన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేయండి. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మీకు మీరు కొన్ని పరిధులు గీసుకోండి. ఎవరినుంచైనా ఇలాంటి ఇబ్బందికరమైన ప్రవర్తన ఎదురైనప్పుడు గట్టిగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్