ఎయిర్‌హోస్టెస్‌ కావాలనుకుంటున్నారా? అయితే ఇవి తప్పనిసరి!

ప్రపంచాన్ని చుట్టేయాలని ఎవరికుండదు చెప్పండి? అదీ పైసా ఖర్చు లేకుండా వివిధ దేశాలు తిరిగే ఛాన్సొస్తే? నేటి యువతులకు ఆ అవకాశం కల్పిస్తోంది ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం. మంచి పలుకుబడితో పాటు లక్షల కొద్దీ జీతం ఉన్న ఈ వృత్తి నేటి తరం అమ్మాయిల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది.

Published : 10 Jan 2024 11:43 IST

ప్రపంచాన్ని చుట్టేయాలని ఎవరికుండదు చెప్పండి? అదీ పైసా ఖర్చు లేకుండా వివిధ దేశాలు తిరిగే ఛాన్సొస్తే? నేటి యువతులకు ఆ అవకాశం కల్పిస్తోంది ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగం. మంచి పలుకుబడితో పాటు లక్షల కొద్దీ జీతం ఉన్న ఈ వృత్తి నేటి తరం అమ్మాయిల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. మరి, గగనసఖిగా స్థిరపడడమంటే అంత ఆషామాషీ విషయం కాదు.. అందుకు తగిన విద్యార్హతలతో పాటు శారీరక ఫిట్‌నెస్‌, చక్కటి వాక్చాతుర్యం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. మరి, ఎయిర్‌హోస్టెస్‌గా స్థిరపడాలనుకుంటే.. ఏయే అంశాలపై పట్టు పెంచుకోవాలో తెలుసుకుందాం రండి..

అర్హతలేంటి?

⚛ ఏ ఉద్యోగానికైనా సంబంధిత విద్యార్హతలు తప్పనిసరి! ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగానికీ ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి ఇంటర్‌ పూర్తిచేసి ఉండాలి.. లేదంటే బీఎస్సీ ఏవియేషన్‌/విమానయాన సంస్థల నియమనిబంధనల్ని బట్టి ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి. అందులో కనీసం 50 శాతం మార్కులొచ్చిన వారే అర్హులు.

⚛ ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగంలో అభ్యర్థి వయసు, వైవాహిక స్థితికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో 18-26 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఈ జాబ్‌కి అప్లై చేసుకునే సమయంలో మహిళ తప్పనిసరిగా అవివాహితై ఉండాలి.

⚛ గగనసఖిగా స్థిరపడాలంటే సంబంధిత విద్యార్హతలతో పాటు శారీరక/మానసిక ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, ఎత్తు, బరువు కూడా ముఖ్యమే! ఈ క్రమంలో ఆయా వయసుల్ని బట్టి బీఎంఐ మెయింటెయిన్‌ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 18 ఏళ్లున్న అమ్మాయిలు 50 కిలోల బరువు, 4’9’’ ఎత్తుండాలి. అలాగే 20-26 ఏళ్ల మధ్య వయస్కులు 56 కిలోలతో, కనీసం ఇదే ఎత్తులో ఉంటే ఉద్యోగానికి అర్హత సాధించచ్చు. అయితే ఫిట్‌నెస్‌, ఎత్తు, బరువు విషయాల్లో ఆయా విమానయాన సంస్థలు నిర్దేశించిన నియమనిబంధనల్ని పాటిస్తే మరీ మంచిది.

⚛ ఒక్కో విమానయాన సంస్థకు ఒక్కో రకమైన డ్రస్‌కోడ్‌ ఉంటుంది. వాటిలో చక్కగా ఇమిడిపోతేనే హుందాగా కనిపించచ్చు. ఇందుకోసం పైన పేర్కొన్నట్లుగా ఆయా ఫిట్‌నెస్‌ ప్రమాణాల్ని పాటించడం ముఖ్యం.

ఈ నైపుణ్యాలున్నాయా?

ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగానికి విద్యార్హతలతో పాటు కొన్ని అదనపు నైపుణ్యాలు కూడా అవసరమే! అవేంటంటే..!

⚛ గగనసఖి అంటే విమానంలో ప్రయాణికులతో ఎక్కువగా మమేకమవ్వాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారితో తడబడకుండా సంభాషించాలంటే హిందీ, ఇంగ్లిష్‌ భాషలు అనర్గళంగా మాట్లాడగలగాలి. ఒకవేళ అంతర్జాతీయ విమానాల్లో పనిచేయాల్సి వస్తే.. ఇంగ్లిష్‌తో పాటు ఇతర విదేశీ భాషలు వచ్చి ఉంటే మరీ మంచిది.

⚛ ప్రయాణికులతో స్నేహపూర్వకంగా, హుందాగా మాట్లాడేందుకు కావాల్సిన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరి. అలాగే అగ్రశ్రేణి కస్టమర్‌ సేవల్ని అందించే క్రమంలో ఓర్పు, నేర్పు అవసరం.

⚛ ఒక్కోసారి ప్రయాణంలో వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తచ్చు.. ఇలాంటప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగేలా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. అలాగే మరికొన్ని సార్లు ప్రయాణికుల ఫిర్యాదులకు సత్వరమే స్పందించి తగిన పరిష్కార మార్గాలు వెతికే నేర్పూ ముఖ్యమే!

⚛ ప్రస్తుతం దాదాపు అన్ని ఉద్యోగాల్లో బృందంతో కలిసి పనిచేయడం కామనైపోయింది. ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగమూ ఇందుకు మినహాయింపు కాదు. ఈ క్రమంలో తోటి గగనసఖులతో సులభంగా కలిసిపోయేలా, సౌకర్యవంతంగా పనిచేసేలా వారితో స్నేహభావాన్ని పెంచుకోవాలి. అలాగే ప్రయాణికులకు సౌకర్యవంగా సేవలందించేలా బృంద స్ఫూర్తిని చాటడమూ ముఖ్యమే!

⚛ ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగంలో సమయపాలన కూడా ముఖ్యమే! సమయానికి విధులకు చేరుకోవడం, సకాలంలో పనులు పూర్తిచేసుకోవడం వల్ల.. ఇంటిని, వృత్తిని సులభంగా బ్యాలన్స్‌ చేసుకోవచ్చు. అలాగే ఇది కెరీర్‌కూ ప్లస్‌ అవుతుంది.

శిక్షణ తప్పనిసరి!

సాధారణంగా ఉద్యోగానికి ఎంపికయ్యాక నిర్వర్తించాల్సిన పనుల్ని బట్టి శిక్షణ ఉంటుంది. కానీ ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగంలో ముందుగానే సంబంధిత శిక్షణ పూర్తిచేసి ఉండాలంటున్నారు నిపుణులు. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉండే ఈ సర్టిఫికేషన్‌ కోర్సులో భాగంగా థియరీ, ప్రాక్టికల్‌.. ఇలా రెండు రకాల అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో కస్టమర్‌ సేవలు, అత్యవసర సమయాల్లో స్పందించే తీరు, భద్రతా విధానం.. తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది. అంతేకాదు.. అత్యవసర సమయాల్లో తక్షణం స్పందించేలా ఆక్సిజన్‌ మాస్కులు/లైఫ్‌ ర్యాఫ్ట్స్‌.. వంటి పరికరాల్ని ఎలా వాడాలో కూడా ఇందులో నేర్పిస్తారు. నిజానికి ఈ తరహా శిక్షణ.. కొత్తగా ఎయిర్‌హోస్టెస్‌ విధుల్లో చేరినా నిర్భయంగా తమ పనులు తాము చేసుకుపోయేలా ముందస్తు అనుభవాన్ని అందిస్తుంది.

మూడంచెల పరీక్ష!

సంబంధిత విద్యార్హతలుండి, తగిన నైపుణ్యాలు సంపాదించడంతో పాటు ఎయిర్‌ హోస్టెస్‌ శిక్షణ పూర్తి చేసుకొని సర్టిఫికేషన్‌ పొందిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా విమానయాన సంస్థలు వారి రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ని బట్టి రాత పరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ.. నిర్వహిస్తాయి. ఈ క్రమంలో అభ్యర్థి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కస్టమర్‌ సేవా సామర్థ్యాలు, వ్యక్తిగత నైపుణ్యాలు.. వంటివన్నీ రిక్రూటర్లు పరీక్షిస్తారు. వీటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఎయిర్‌హోస్టెస్‌గా తమ కలల ఉద్యోగాన్ని సంపాదించచ్చు. అయితే ఇక్కడితో ఆగిపోకుండా.. విమానయాన సంస్థల అవసరాల్ని బట్టి ఎప్పటికప్పుడు నైపుణ్యాల్ని వృద్ధి చేసుకుంటూ, కొత్త కోర్సులు నేర్చుకుంటూ ముందుకు సాగితేనే కెరీర్‌లో ఉన్నతి సాధించచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్