Sexual Health: అది ‘డర్టీ టాక్’ కాదు.. అచ్ఛీ బాత్!

భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉండాలంటారు. ఇదే ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచి అనుబంధాన్ని దృఢం చేస్తుంది. లైంగిక ఆరోగ్యం, శృంగారానికి సంబంధించిన అంశాలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే చాలామంది వీటిని ‘డర్టీ టాక్’గానే పరిగణిస్తుంటారు.

Published : 04 Apr 2024 12:33 IST

భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉండాలంటారు. ఇదే ఇద్దరి మధ్య నమ్మకాన్ని పెంచి అనుబంధాన్ని దృఢం చేస్తుంది. లైంగిక ఆరోగ్యం, శృంగారానికి సంబంధించిన అంశాలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే చాలామంది వీటిని ‘డర్టీ టాక్’గానే పరిగణిస్తుంటారు. ఈ క్రమంలోనే లైంగిక సమస్యలున్నా, ఈ విషయంలో ఏవైనా సందేహాలున్నా వాటిని భాగస్వామి ముందు వ్యక్తపరచడానికి ఇష్టపడరు. శృంగారం విషయంలో చాలామందిలో ఉన్న అపోహలే ఇందుకు కారణం. అయితే ఈ సమస్యల్ని తమలోనే దాచుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు అనుబంధానికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అందుకే లైంగిక ఆరోగ్యం, వాటికి సంబంధించిన అంశాల గురించి భాగస్వామితో పారదర్శకంగా చర్చించాలంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తిరస్కరిస్తారన్న భయమా?

జీవిత భాగస్వామితో ఎన్నో విషయాల గురించి చర్చిస్తుంటాం.. మనకున్న సమస్యల్ని పంచుకుంటూ వారి నుంచి తగిన పరిష్కార మార్గాల్ని పొందుతాం. అయితే ఇలా అన్ని విషయాల్లో పారదర్శకంగా ఉన్నా.. లైంగికాంశాల దగ్గరికొచ్చే సరికి మాత్రం పెదవి విప్పరు చాలామంది. ఇందుకు సిగ్గు, బిడియం, ఇతర అపోహలే ప్రధాన కారణంగా చెప్పచ్చు. వీటితో పాటు ఇతర అంశాలూ ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..?!

⚛ చాలామంది తమలో ఉన్న శృంగార కోరికలు/ఫ్యాంటసీలు, లైంగిక అనారోగ్యాలు భాగస్వామితో పంచుకోవడానికి సిగ్గుపడుతుంటారు.. ఏదో తెలియని ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఇందుకు కారణం.. అవతలి వారు ఎలా ప్రతిస్పందిస్తారో, తమను ఎక్కడ తిరస్కరిస్తారోనన్న భయమే! అలాగే భాగస్వామి ముందు తామెక్కడ చులకన అయిపోతామోనని మరికొందరు ఆలోచిస్తుంటారు. అందుకే ఈ విషయాల్ని దాస్తుంటారు.

⚛ శృంగారం విషయంలో ఈ సమాజంలో ఎన్నో సామాజిక కట్టుబాట్లు, అపోహలు, మూసధోరణులు ఉన్నాయి. చాలామంది ఈ విషయాల్లో గోప్యంగా వ్యవహరించడానికి ఇవీ కారణాలే అంటున్నారు నిపుణులు.

⚛ కొంతమంది గతంలో లైంగిక వేధింపుల్ని ఎదుర్కోవచ్చు.. అత్యాచారానికి సంబంధించిన చేదు అనుభవాలూ వారి మనసును ప్రభావితం చేసి ఉండచ్చు. ఇలాంటి ప్రతికూల అనుభవాలూ వారిని ఆయా అంశాల గురించి భాగస్వామితో పంచుకోకుండా చేస్తుంటాయి.

⚛ జీవిత భాగస్వామే అయినా కొందరు తమ మనసులోని మాటను వారితో స్పష్టంగా, నిర్మొహమాటంగా చెప్పలేకపోవచ్చు. ఇలాంటి వారు లైంగిక విషయాల్నీ వారితో అంత సులభంగా పంచుకోరు. నిజానికి ఈ కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు.

⚛ కొంతమందికి తమ భాగస్వామిపై నమ్మకం ఉండదు.. వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ అభద్రతా భావానికి లోనవుతుంటారు. వీటి కారణంగా ఎప్పుడూ ఏదో ఒక గొడవకు దిగుతూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వాలున్న దంపతులు లైంగిక విషయాల్ని ఎలా పంచుకోగలుగుతారు? ఒకవేళ పంచుకోవాలని ఉన్నా అవతలి వారు తమను ఎక్కడ అనుమానిస్తారో, అవమానిస్తారోనన్న భయంతో వెనకడుగు వేసే వారే ఎక్కువ.

ఎందుకు మాట్లాడాలి?

అయితే ఈ భయాలు, బిడియాలు, అపోహలు పక్కన పెట్టి ఇరువురి లైంగిక ఆరోగ్యం, ఈ విషయంలో ఉన్న సమస్యలు-సందేహాలు ఒకరితో ఒకరు పంచుకోవడం, పరిష్కరించుకోవడం.. వంటివి చేస్తే ఇద్దరి మధ్య నమ్మకం రెట్టింపవుతుందంటున్నారు నిపుణులు. ఇదే అనుబంధాన్ని దృఢం చేస్తుందని చెబుతున్నారు. అలాగే లైంగిక ఆరోగ్యం విషయంలో ఏవైనా సమస్యలున్నా భాగస్వామితో పంచుకోవడం వల్ల వారు మిమ్మల్ని మరింత కేరింగ్‌గా చూసుకోవడం, నిర్ణీత వ్యవధుల్లో నిపుణులను సంప్రదించి తగిన చికిత్స ఇప్పించడం, శృంగారం విషయంలో మిమ్మల్ని నొప్పించకుండా మీ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమివ్వడం, సురక్షితమైన పరిధులు గీసుకోవడం.. వంటివన్నీ దాంపత్య బంధాన్ని దృఢం చేసేవే! ఇలా ఆయా విషయాల గురించి పారదర్శకంగా చర్చ జరగడం వల్ల లైంగిక ఆరోగ్యం మరింతగా దెబ్బతినకుండా ఉంటుంది.. అలాగే మీకున్న అనారోగ్యాల కారణంగా మీ భాగస్వామి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చు.. ఇవన్నీ పరోక్షంగా అనుబంధాన్ని దృఢం చేసే అంశాలే అంటున్నారు నిపుణులు.


అసలు ఎలా మాట్లాడాలి?

దాంపత్య బంధంలో శృంగారం అనేది ఎంత కీలకమైన అంశమో.. అంత సున్నితమైన విషయం కూడా! అందుకే దీని గురించి భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే అన్ని విషయాలూ పారదర్శకంగా పంచుకోగలమని చెబుతున్నారు.

⚛ లైంగిక విషయాల గురించి చర్చించేందుకు ఏకాంతంగా, ఇద్దరికీ సౌకర్యంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా చర్చను కొనసాగించచ్చు.

⚛ భార్యాభర్తలిద్దరూ ఎలాంటి టెన్షన్స్‌ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే లైంగిక అంశాల గురించి చర్చించడం మంచిదంటున్నారు నిపుణులు. అప్పుడే ఆయా సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

⚛ లైంగిక అనారోగ్యాలు, ఇతర అంశాల గురించి భాగస్వామితో ఎంత నిజాయతీగా మాట్లాడితే.. అవతలి వారూ అంతే నిజాయతీగా తమ సమస్యల్ని బయటపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి విషయాల్లో ఒకరినొకరు జడ్జ్ చేసుకోకూడదు.

⚛ దంపతులిద్దరూ ఈ విషయాల గురించి యాక్టివ్‌గా చర్చించినప్పుడే అన్ని సమస్యలు బయటపడతాయి. వాటికి తగిన పరిష్కార మార్గాలూ దొరుకుతాయి.

⚛ అలాగే ఎప్పుడూ మీ సమస్యే మీ భాగస్వామి వినాలనుకోవడం కాకుండా.. వాళ్ల మనసులోని మాటల్నీ మీరు ఓపిగ్గా వినాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. ఒకరికొకరున్నారన్న భరోసా ఏర్పడుతుంది.

⚛ లైంగిక ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్యలున్నా ఇద్దరూ నిర్ణీత వ్యవధుల్లో అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సమస్య నిర్ధారణ అయ్యాక డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడడం, ఆరోగ్యం కుదుటపడేవరకు ఒకరికొకరు సహకరించుకోవడం ముఖ్యం.

⚛ కొంతమందిలో లైంగిక సంక్రమణ వ్యాధులు బయటపడచ్చు. ఇలాంటప్పుడు సమస్యతో బాధపడుతోన్న భాగస్వామిని మాటలు, చేతలతో ఇబ్బంది పెట్టకుండా.. వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటప్పుడు శృంగారం విషయంలో నిపుణుల సలహా మేరకు తగిన సురక్షితమైన పద్ధతులు పాటించాలి.

⚛ లైంగిక ఆరోగ్యం, ఈ విషయంలో ఎదురయ్యే సమస్యల గురించి భాగస్వామి ఎప్పటికప్పుడు తెలియజేసేలా వారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలో వారికి సౌకర్యవంతమైన, అనువైన వాతావరణం ఏర్పాటుచేయడం వారి జీవిత భాగస్వామి బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

ఇలా లైంగిక ఆరోగ్యం, దానికి సంబంధించిన ఇతర అంశాలపై భార్యాభర్తలిద్దరి మధ్య ఆరోగ్యకరమైన, సానుకూల చర్చ జరిగినప్పుడు.. వారు శృంగార జీవితాన్ని మరింతగా ఆస్వాదించగలుగుతారు. ఇది వారి ఆరోగ్యాన్ని పెంపొందిస్తూనే.. అనుబంధాన్నీ దృఢం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్