ఈ నైపుణ్యాలు చెక్‌ చేసుకున్నారా?

మంచి మార్కులు.. అదనంగా కొన్ని సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా వీటిపై దృష్టిపెడుతుంటాం. సంస్థలకు అవే సరిపోవడం లేదు.

Published : 05 Jan 2023 01:00 IST

మంచి మార్కులు.. అదనంగా కొన్ని సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా వీటిపై దృష్టిపెడుతుంటాం. సంస్థలకు అవే సరిపోవడం లేదు. ప్రవర్తనకీ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఏడాది దృష్టిపెడుతున్న కొన్ని నైపుణ్యాలు ఇవి.. ఇంటర్వ్యూలోనూ వీటిని పరిశీలిస్తారు.

* ఆసక్తి.. కొత్తవాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి సాధారణంగానే మన ఆడవాళ్లకు ఎక్కువ. ఆలోచనా పరిధిని విస్తరించే ఈ నైపుణ్యం కోసం సంస్థలు చూస్తున్నాయట. అందుకోసమే.. ఇంటర్వ్యూ సమయంలో ‘తరగతి గదిలో మీరడిగిన ఏ ప్రశ్న మీకు బాగా సాయపడింది/ ప్రశంసలు కురిపించింది’ వంటి ప్రశ్నలు అడుగుతున్నారట. దానికి ఉదాహరణతో మెప్పించగలిగితే ఉద్యోగం మీదే.

* నేర్చుకునే తత్వం.. చదువు.. అదైపోగానే ఉద్యోగం అన్న రోజులు కావివి. కాలంతో పరుగు తీయాలన్నా.. మారుతున్న సాంకేతికతను అంది పుచ్చుకోవాలన్నా నేర్చుకుంటూ ఉండటం తప్పనిసరి. కొత్తగా నేర్చుకుని.. వాటిని ప్రాక్టికల్‌గా ఉపయోగించినవీ.. నేర్చుకుంటున్నవీ చెబితే సరిపోతుంది.

* ఎదగాలి.. కొత్తగా ఈత నేర్చుకుంటున్న  వారికి ఒక్కసారే గోదారి ఈదమంటే కష్టమే. అలాగని చిన్న చిన్న లక్ష్యాలనూ ప్రయత్నించనంటే మాత్రం పొరపాటే. స్వల్ప స్థాయి లక్ష్యాలను పెట్టుకోండి. వాటిని సాధించడానికి ఎప్పుడూ ఎలా సిద్ధంగా ఉంటారో ఆలోచించుకోండి. ఈక్రమంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో కూడా చెప్పగలగాలి. ఇక్కడ మీ ఓపిక, పోటీతత్వం, అవకాశాలను అందిపుచ్చుకునే గుణాలను పరిశీలిస్తారు.

*  అవతలి కోణం.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన కోణంలో చూడటం, దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం మామూలే. అవతలి వారి కోణం నుంచీ చూసేవారే నిజమైన నాయకులు. ఇలాంటివారికే సంస్థలూ ప్రాధాన్యమిస్తాయి. ఏదైనా తగాదా, గొడవ.. వచ్చినప్పుడు ఎదుటివారి కోణం నుంచీ చూసి మీరు వెనక్కితగ్గారా? విభేదాల సమయంలో అవతలి వ్యక్తిని నేరుగా కలిసి మాట్లాడారా? గుర్తు చేసుకోండి.

* కలిసి మెలసి.. జీవితంలో గెలవాలని ఎవరికుండదు? ఏదైనా తిరస్కరణ ఎదురైతే అవతలి వాళ్లపై కోపం తెచ్చుకోవడం సహజమే! మరి వాళ్లూ అలాగే ఆలోచిస్తారు కదా! లేదు.. కాదు అని చెప్పేప్పుడు మీరు మాత్రం కచ్చితంగా ఉండటం, ఎవరైనా చెప్పినప్పుడు కోపం ప్రదర్శించడం మంచి లక్షణం కాదు. ఇది బృందస్ఫూర్తికి విరుద్ధం కూడా. సౌమ్యంగా.. నొప్పించని సమాధానాలు.. అందరితోనూ కలుపుగోలు ధోరణి అవసరం. ఇవన్నీ ఉంటే... ఇంటర్వ్యూలో మెప్పించడమే కాదు.. కెరియర్‌లో ముందుకెళ్లడమూ ఖాయం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్