మీది ‘ఫిమేల్ ఫ్రెండ్లీ’ ఆఫీసేనా?

మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పనిచేసుకునేందుకు.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వృత్తిగత జీవితాన్ని ఆస్వాదించేందుకు అనువుగా కొన్ని కంపెనీలు పలు సౌకర్యాలను, సౌలభ్యాలను మహిళలకు కల్పించడం పరిపాటే. ప్రస్తుతం అనేక బహుళజాతి సంస్థలతో పాటు పలు....

Updated : 05 Mar 2022 19:09 IST

మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పనిచేసుకునేందుకు.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వృత్తిగత జీవితాన్ని ఆస్వాదించేందుకు అనువుగా కొన్ని కంపెనీలు పలు సౌకర్యాలను, సౌలభ్యాలను మహిళలకు కల్పించడం పరిపాటే. ప్రస్తుతం అనేక బహుళజాతి సంస్థలతో పాటు పలు దేశీయ సంస్థలు కూడా కార్యాలయాల్లో మహిళలకు అవసరమైన అదనపు వసతులను సమకూర్చడానికి కృషి చేస్తున్నాయి. తద్వారా ‘ఫిమేల్ ఫ్రెండ్లీ’ ఆఫీసులుగా పేరు తెచ్చుకుంటున్నాయి. మరి, అలాంటి ఆఫీసుల్లో మహిళలకు ఎలాంటి సదుపాయాలుంటాయో తెలుసుకుందాం రండి..

ఉమెన్ కమిటీలు..

పని ప్రదేశంలో రక్షణ, ఇతర సురక్షితమైన అంశాల గురించి చర్చించడానికి వీలుగా.. మహిళా ఉద్యోగులందరూ కలిసి ‘ఎఫినిటీ కమిటీ’లను ప్రారంభించుకొనేందుకు కూడా కొన్ని సంస్థలు అనుమతిస్తున్నాయి. ఆ కంపెనీకే సంబంధించిన సీనియర్ అధికారిణి ఎవరైనా ఆ కమిటీకి నేతృత్వం వహించవచ్చు. పని ప్రదేశంలో ఈవ్ టీజింగ్, లైంగిక హింస, లింగ వివక్ష.. లాంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి కమిటీలు దోహదపడుతుంటాయి.

పరిశుభ్రతకు ప్రాధాన్యం..

ఆఫీస్‌ పరిశుభ్రత విషయంలో కొవిడ్‌ ముందు నుంచీ ప్రతి కంపెనీ కొన్ని ప్రమాణాల్ని అనుసరిస్తోంది. అయితే ఇప్పుడు వీటికి అదనంగా మరిన్ని నాణ్యతా ప్రమాణాల్ని జోడించాయి చాలా కంపెనీలు. వాష్‌రూమ్స్‌ను అధునాతనంగా తీర్చిదిద్దడం, టచ్‌ ఫ్రీ ట్యాప్స్‌, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లతో పాటు టిష్యూస్, టాయిలెట్ పేపర్ డిస్పెన్సర్స్, ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులో ఉంచడం, వాటిని నిర్వీర్యం చేసే మెషీన్లు.. ఇలా మహిళల వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ప్రస్తుతం చాలా కంపెనీల్లో మనం చూడచ్చు.

విశ్రాంతి గదులు..

మహిళలు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. వారు విశ్రాంతి తీసుకొనే విధంగా కొన్ని సంస్థలు ఆఫీసులోనే విశ్రాంతి గదులు ఏర్పాటుచేస్తున్నాయి. అలాగే సత్వర వైద్యసదుపాయం అందించడం కోసం ఇన్‌హౌస్ మెడికల్ లేదా ఎమర్జెన్సీ కేర్ (ఫస్ట్ఎయిడ్ లేదా నర్సింగ్ కేర్) లాంటి వాటిని కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. అంతేకాదు.. ఈ రోజుల్లో చాలామంది గర్భిణులు నెలలు నిండేదాకా విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే వారి సౌకర్యార్థం కింది అంతస్తుల్లోనే సీటింగ్‌ ఏర్పాటుచేయడం, సౌకర్యవంతమైన కుర్చీ.. వంటివి అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక కొత్తగా తల్లైన వారి కోసం క్రెష్‌ సౌకర్యాన్ని కూడా చాలా కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి.

స్టోర్స్‌లో ఇవి ఉండేలా..

ఆఫీసులో ఉండే ఇన్‌హౌస్ స్టోర్స్‌లో మహిళలకు సంబంధించిన అత్యవసరమైన వస్తువులన్నీ లభించేలా ప్లాన్ చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ స్టోర్స్‌లో అత్యవసర మందులు, ఇతర ఆరోగ్య ఉత్పత్తులతో పాటు శానిటరీ ప్యాడ్స్, వైప్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి. అలాగే ఆఫీసు క్యాంటీన్లలో పోషకాహారం, గ్లూకోజ్, పండ్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాదు.. ఆయా ప్రదేశాల్లో తగిన పరిశుభ్రతా ప్రమాణాలు సైతం పాటించేలా జాగ్రత్త పడుతున్నాయి.

వ్యాయామం కోసం..

కొన్ని బహుళజాతి సంస్థలు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్థలోనే ప్రత్యేక వ్యాయామశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు లేదా బ్రేక్ సమయంలో ఉద్యోగినులు వీటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా తమ ఫిట్‌నెస్‌ని పెంచుకుంటూ, ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవచ్చు. ఇలాంటి వ్యాయామశాలల్లో తమ వీలును బట్టి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ మానసిక ఉత్తేజాన్ని కూడా పెంచుకోవచ్చు. తద్వారా పనిలో ఉత్పాదకతనూ పెంచుకోవచ్చు. కొన్ని సంస్థలు మహిళల్లో మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నాయి.

ఇవి కూడా!

* పనిచేసే మహిళలు ఆఫీసులో గడిపే బిజీ షెడ్యూల్‌ను బట్టి వారి వ్యక్తిగత పనుల్లో సహాయపడేందుకు కూడా కొన్ని బహుళజాతి సంస్థలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉదాహరణకు ఫ్లైట్‌, ట్రైన్‌ టికెట్స్ బుకింగ్, కరెంటు బిల్లు కట్టడం.. లాంటి పనులు ఉద్యోగినుల తరఫున చేయడం కోసం కొంతమంది సర్వీసు ఏజెంట్స్‌ను కూడా నియమించుకుంటున్నాయి. కాబట్టి తమ వీలును బట్టి ఉద్యోగినులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

* మహిళల్లో ఉత్సాహాన్ని, సృజనాత్మకతను పెంపొందించడం కోసం.. వారికి వివిధ పోటీలు పెట్టడం, ప్రత్యేక సందర్భాలు-పండగలప్పుడు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రస్తుతం చాలా కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్నాయి. తద్వారా సహోద్యోగులతో చెలిమి పెరుగుతుంది.. పనిపై ఇష్టమూ ఏర్పడుతుంది.. ఈ రెండూ పని నాణ్యతను పెంచడంలో దోహదం చేస్తాయి.

ఐటీ కంపెనీల్లోనూ, బహుళ జాతి సంస్థల్లోనూ ఇలాంటి సౌకర్యాలన్నీ ఉండడం సహజమే. మీరు కూడా ఇలాంటి సౌకర్యాలను, సౌలభ్యాలను మీరు పనిచేస్తోన్న ఆఫీసుల్లో కల్పించేందుకు మీకున్న పరిధి మేరకు కృషి చేయచ్చు. ఇంకా మీకెలాంటి వసతులు కల్పిస్తే బాగుంటుంది.. మీ రక్షణ, భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సంస్థ అధికారులకు తెలియజేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్