FIFA : మెస్సీ విజయం వెనుక ఇష్టసఖి.. ఈ ప్రేమ కథ విన్నారా?

దూరంగా ఉన్నప్పుడే ప్రేమ బంధం మరింత దృఢమవుతుందంటారు. ఫిఫా ప్రపంచకప్‌ స్టార్ లియోనెల్‌ మెస్సీ, ఆయన భార్య ఆంటొనెలా రొకుజోల ప్రేమ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపు కాదు. చిన్ననాడే మనసులు ఇచ్చిపుచ్చుకున్న ఈ జంట.. ఏళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలతో ఆ బంధాన్ని.....

Published : 20 Dec 2022 13:05 IST

(Photos: Instagram)

దూరంగా ఉన్నప్పుడే ప్రేమ బంధం మరింత దృఢమవుతుందంటారు. ఫిఫా ప్రపంచకప్‌ స్టార్ లియోనెల్‌ మెస్సీ, ఆయన భార్య ఆంటొనెలా రొకుజోల ప్రేమ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపు కాదు. చిన్ననాడే మనసులు ఇచ్చిపుచ్చుకున్న ఈ జంట.. ఏళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలతో ఆ బంధాన్ని సంపూర్ణం చేసుకున్నారు. తమ మాటలు, చేతలతో ప్రతి సందర్భంలోనూ దంపతులకు ప్రేమ పాఠాలు నేర్పే ఈ ముద్దుల జంట.. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, ప్రశంసించుకోవడానికి వెనకాడరు. ఈ క్రమంలోనే తాజాగా తన భర్త విజయాన్ని ఓ ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంటూ సెలబ్రేట్‌ చేసుకుందీ లవ్లీ వైఫ్.

లియోనెల్‌ మెస్సీ - ఆంటొనెలా రొకుజో.. వీరిద్దరిదీ అర్జెంటీనాలోని రొసారియో పట్టణం. అక్కడి ఓ స్కూల్లో చదివే క్రమంలోనే ఇద్దరూ కలుసుకున్నారు. ప్రాణ స్నేహితులుగా మారారు. అదెంతలా అంటే.. ఒకరిని విడిచి మరొకరు క్షణమైనా ఉండలేనంతగా! కానీ తమ మధ్య ఉన్నది స్నేహం కాదు.. ప్రేమ అని తెలుసుకున్నది మాత్రం ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడే అంటున్నారీ లవ్లీ కపుల్.

విరహం పెంచిన ఎడబాటు!

అయితే మెస్సీకి చిన్నప్పట్నుంచీ ఫుట్‌బాల్‌ క్రీడంటే మక్కువ. ఈ ఇష్టంతోనే 12 ఏళ్ల వయసులో ఆటలో మరింత పట్టు సాధించడానికి స్పెయిన్‌ వెళ్లాడు. అప్పుడు కొన్నేళ్ల పాటు మెస్సీ - రొకుజోలకు ఎడబాటు తప్పలేదు. అప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట.. ఒక చేదు సంఘటన తర్వాత మరింత దగ్గరయ్యామంటున్నారు. ఓసారి రొకుజో ప్రాణ స్నేహితురాలొకరు కారు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయం స్పెయిన్‌లో ఉన్న మెస్సీకి తెలియడంతో.. రొకుజోను ఓదార్చడానికి హుటాహుటిన అర్జెంటీనా వచ్చేశాడు. ఇలా ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న ఈ జంట మధ్య అనుబంధం మరింతగా పెరిగింది.. తమ మనసులో దాగున్న ప్రేమనూ తెలుపుకొన్నారు. తమ అనుబంధం గురించి బయట ప్రపంచంతోనూ పంచుకున్నారు. ఇలా తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరు కొడుకులు పుట్టాక 2017లో పెళ్లిపీటలెక్కిందీ జంట. అత్యంత వైభవంగా జరిగిన వీళ్ల పెళ్లి.. అప్పట్లో ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా, ‘వెడ్డింగ్‌ ఆఫ్‌ ది సెంచరీ’గా నిలిచింది. ఇక పెళ్లి తర్వాత మూడో కొడుక్కి జన్మనిచ్చారీ లవ్లీ పెయిర్‌. ప్రతి అకేషన్‌, వెకేషన్‌లో చెట్టపట్టాలేసుకొని కనిపించే ఈ జంట.. తమ అనుబంధంతో భార్యాభర్తలందరికీ ప్రేమ పాఠాలు నేర్పుతుంటారు.

తనే.. నా గ్రేటెస్ట్‌ ఛీర్‌లీడర్!

ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. ఈ విషయానికొస్తే తన విజయ రహస్యం తన భార్యే అంటున్నాడీ సాకర్‌ స్టార్‌. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా.. ఇలా ప్రతి సందర్భంలోనూ తన భార్య తన వెన్నంటే ఉంటుందని, తననెంతగానో ప్రోత్సహిస్తుందంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు మెస్సీ.

‘నా భార్య ఆంటొనెలా.. తనతో నేను వేసే ప్రతి అడుగూ నాకు ప్రత్యేకమే! తనలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో ప్రశాంతంగా ఉండగలదు. తాను వివిధ సమస్యల్ని, సవాళ్లను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవడం చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది. ఇక రోజువారీ పనుల్ని ఎంతో చురుగ్గా, సులభంగా పూర్తి చేస్తుంటుంది. నిజంగా తను చాలా తెలివైంది.. ప్రతి అడుగులోనూ నన్ను ప్రోత్సహిస్తుంటుంది. అందుకే తనే నా గ్రేటెస్ట్‌ ఛీర్‌లీడర్‌!’ అంటూ తన ఇష్టసఖిని ఆకాశానికెత్తేశాడీ ఫిఫా హీరో.

డియర్‌.. నువ్వే అసలైన ఛాంపియన్‌వి!

తన భర్త తనను అంతలా ప్రశంసిస్తుంటే.. ఈ విషయంలో తానేమీ తక్కువ కాదంటోంది ఆంటొనెలా. ప్రతి మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ.. తన భర్త విజయాన్ని కాంక్షించే ఈ లవ్లీ వైఫ్‌.. తాజాగా ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లోనూ తన ముగ్గురు కొడుకులతో పాల్గొని సందడి చేసింది. ఇక అర్జెంటీనా విజయంలో కీలక పాత్ర పోషించిన తన భర్త పోరాటస్ఫూర్తిని ఓ ఇన్‌స్టా పోస్ట్ రూపంలో పంచుకుంది.

‘ప్రపంచ ఛాంపియన్‌.. డియర్‌ నీ విజయాన్ని ఎలా ప్రశంసించాలో నాకు మాటలు రావట్లేదు. చాలా గర్వంగా ఉంది. లక్ష్యాన్ని చేరుకునే దాకా విశ్రమించకూడదని నీ విజయంతో నిరూపించావు. ఇందుకోసం నువ్వు ఎన్నేళ్లుగా శ్రమ పడ్డావో నాకు తెలుసు! ఏదైతేనేం.. నువ్వు కలలు కన్న విజయం నిన్ను వరించింది..’ అంటూ భర్త విజయానికి ఉప్పొంగిపోయిందామె.

మోడల్‌ మామ్!

అసలైన అర్ధాంగిగా, ముగ్గురు పిల్లల తల్లిగా తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోన్న ఆంటొనెలా.. వృత్తిరీత్యా మోడల్‌గా, వ్యాపారవేత్తగానూ సుపరిచితమే! హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. అంతర్జాతీయంగా పలు ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్‌ చేసింది. అంతేకాదు.. పలు ఫిట్‌నెస్‌ బ్రాండ్లతోనూ కలిసి పనిచేసింది. ఇక సోషల్‌ మీడియాలోనూ ఎంతో చురుగ్గా ఉంటుందీ మిసెస్‌ మెస్సీ. తన కెరీర్‌ విషయాలు, తాను కుటుంబంతో కలిసి గడిపే క్షణాల్ని తరచూ ఫొటోల రూపంలో పంచుకునే ఈ మోడలింగ్‌ మామ్‌కు ఇన్‌స్టాలో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్