Budget 2023 : నిర్మలమ్మ రికార్డులివీ!

ఆదాయ, వ్యయాల్ని లెక్కకడుతూ ఇంటికి ఒక ఆర్థిక ప్రణాళికను ఎలా రూపొందించుకుంటామో.. దేశ ఆర్థిక ప్రగతిలో బడ్జెట్‌ పాత్ర అంతే కీలకం! 130 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దును ఐదోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి....

Published : 31 Jan 2023 21:12 IST

ఆదాయ, వ్యయాల్ని లెక్కకడుతూ ఇంటికి ఒక ఆర్థిక ప్రణాళికను ఎలా రూపొందించుకుంటామో.. దేశ ఆర్థిక ప్రగతిలో బడ్జెట్‌ పాత్ర అంతే కీలకం! 130 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దును ఐదోసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించనున్నారు. అయితే ఇదనే కాదు.. గత నాలుగేళ్లుగా బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వస్తోన్న నిర్మలమ్మ.. పద్దు విషయంలో పలు కొత్త సంప్రదాయాలకు తెరతీశారు. మరికొన్ని రికార్డులూ తన పేరిట లిఖించుకున్నారు. కేంద్ర బడ్జెట్‌-2023కి సిద్ధమవుతోన్న వేళ.. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

డిజిటల్‌ బడ్జెట్

బ్రిటిష్‌ కాలం నుంచి ప్రవేశపెడుతూ వస్తోన్న కేంద్ర బడ్జెట్‌ ప్రతుల్ని.. 2018 దాకా లెదర్‌ సూట్‌కేస్‌లోనే పార్లమెంట్‌కు తీసుకొచ్చేవారు. కానీ 2019 నుంచి నిర్మలమ్మ ఈ సంప్రదాయానికి చెక్‌ పెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆ ఏడాది తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. వాటి తాలూకు ప్రతుల్ని ‘బాహీ ఖాతా’గా పిలిచే ఎరుపు రంగు క్లాత్‌ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం కూడా అమర్చారు. తద్వారా భారతీయ సంస్కృతికి తెర తీశారామె. ‘ఇకనైనా బ్రిటిష్‌ సంస్కృతికి చరమగీతం పాడి.. భారతీయ సంప్రదాయానికి తెరతీద్దాం.. పైగా బాహీ ఖాతా ద్వారా బడ్జెట్‌ ప్రతుల్ని మోసుకురావడం కూడా చాలా సులువు..’ అంటూ రెండేళ్ల పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించిన నిర్మలమ్మ.. 2021లో డిజిటల్‌ బడ్జెట్‌ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అటు కరోనాను, ఇటు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఈ మార్పు చేశారామె. ఇందులో భాగంగానే ఓ యాప్‌ను కూడా లాంచ్‌ చేశారు. బడ్జెట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్నీ సరళంగా, అందరికీ అర్థమయ్యేలా దీన్ని రూపొందించారు. ఆ ఏడాది నిర్వహించిన ‘హల్వా వేడుక’ (ఏటా బడ్జెట్‌కు ముందు రోజు నిర్వహించే వేడుక ఇది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి చేతుల మీదుగా బడ్జెట్‌లో పాలుపంచుకున్న వారందరికీ హల్వాను పంచిపెడతారు..)లో భాగంగా ఈ యాప్‌ను విడుదల చేశారు.

అరుదుగా ఐదోసారి!

2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. తద్వారా పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలమ్మ.. ఎక్కువసార్లు పద్దును ప్రవేశపెట్టనున్న మహిళా మంత్రిగా అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకోనున్నారు.

సుదీర్ఘ ప్రసంగం!

ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాదు.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం.. బడ్జెట్‌ చరిత్రలోనే సుదీర్ఘంగా నిలిచింది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జస్వంత్‌ సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. ఇక తన తొలి బడ్జెట్‌ ప్రసంగానికి సంబంధించిన రికార్డును ఆ మరుసటి ఏడాదే తిరగరాశారు నిర్మలమ్మ. 2020-21 లో 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది.

మినీ బడ్జెట్‌ ఘనతా ఆమెదే!

సాధారణంగా బడ్జెట్‌ను ఏడాదికి ఒకసారే ప్రవేశపెట్టడం తెలిసిందే! అయితే కరోనా కారణంగా 2021లో ఒకేసారి పెద్ద బడ్జెట్‌ కాకుండా.. నాలుగైదు చిన్న బడ్జెట్‌లను విడతల వారీగా ప్రవేశపెట్టారు నిర్మలమ్మ. ఆ సమయంలో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక ప్యాకేజీల రూపంలో మినీ బడ్జెట్‌లను రూపొందించారు. ఇలా మినీ బడ్జెట్‌లను తొలిసారి ప్రవేశపెట్టిన ఘనత కూడా నిర్మలమ్మ ఖాతాలోనే చేరిపోవడం విశేషం. ఇక కరోనా అనంతరం గతేడాది ఎప్పటిలాగే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలమ్మ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్