Financial Tips: పిల్లలు పుట్టిన వెంటనే మొదలుపెడదాం!

భవిష్యత్తు బాగుండాలంటే ఆర్థికంగా దృఢంగా ఉండాలి. ఇది జరగాలంటే ఒక్కో బాధ్యతా మీద పడే కొద్దీ దానికి అనుగుణంగా చక్కటి ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి.

Published : 01 Aug 2022 19:28 IST

భవిష్యత్తు బాగుండాలంటే ఆర్థికంగా దృఢంగా ఉండాలి. ఇది జరగాలంటే ఒక్కో బాధ్యతా మీద పడే కొద్దీ దానికి అనుగుణంగా చక్కటి ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. అయితే చాలామంది దంపతుల్లో ఈ అవగాహన కొరవడడం వల్లే.. పిల్లలు పుట్టి కుటుంబం విస్తృతమయ్యాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతుంటారు. ముందు చూపు లేకపోవడం, భవిష్యత్‌ అవసరాల పట్ల నిర్లక్ష్యం, సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకోకపోవడం.. ఇవే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలు పుట్టాక ఆర్థికంగా  ఇబ్బంది పడకుండా ఉండాలన్నా, డబ్బు విషయంలో పిల్లలకు ఏ లోటూ రాకుండా ఉండాలన్నా.. పిల్లలు పుట్టినప్పట్నుంచే చక్కటి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం ముఖ్యమంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

చాలామంది దంపతులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటారు. వారి కోసం డబ్బు పొదుపు-మదుపుల గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఈ ఆలోచనల్ని ఆచరణలో పెట్టే విషయంలో మాత్రం కొందరే సక్సెసవుతారు. మరికొందరు సంపాదన చాలట్లేదనో, వాళ్లు కాస్త పెద్దయ్యాక మొదలుపెడదామనో.. ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనివల్ల పిల్లల విషయంలో మీరు కన్న కలలు నెరవేర్చడం కష్టమవుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే వాళ్లు పుట్టినప్పట్నుంచే చక్కటి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం ముఖ్యమంటున్నారు.

బీమాతో ధీమా!

సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా పాలసీ ఉండనే ఉంటుంది.. ఇక పిల్లలు పుట్టాక వారినీ ఇందులో చేర్చుకోవడం పరిపాటే! అయితే జీవిత బీమా విషయంలో ఇలా కుదరకపోవచ్చు. కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా చైల్డ్ ప్లాన్‌ ఒకటి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చుల్ని భరించడానికి, భవిష్యత్‌ అవసరాలు, పెళ్లి ఖర్చుల కోసం ఇది మంచి ఆప్షన్‌ అంటున్నారు. ఇక ఇందులోనూ రెండు రకాలున్నాయి. ఒకటి-యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ.. ఇందులో భాగంగా పాలసీ కోసం మీరు చెల్లించే డబ్బులో సగభాగం జీవిత బీమా కోసం, మిగతా సగ భాగం ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేలా రూపొందించారు. ఇక రెండోది- పొదుపు పథకాలు. ఇందులో మ్యూచువల్‌ ఫండ్స్‌, పీపీఎఫ్‌, ఆడపిల్లలైతే సుకన్య సమృద్ధి యోజన.. వంటి ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చు.

ఇదొక్కటే కాకుండా.. పేరెంట్స్‌ ముందు చూపుతో దీర్ఘకాలిక డిజెబిలిటీ ప్లాన్‌ తీసుకోవడం కూడా మంచి నిర్ణయమే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో ఏదైనా అనారోగ్యం లేదంటే ప్రమాదం కారణంగా భార్యా/భర్త, లేదంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయలేని పరిస్థితుల్లో ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది.

ఆ ‘నిధి’ పెంచాల్సిందే!

ఇంట్లో సభ్యులు పెరుగుతున్న కొద్దీ ఖర్చులే కాదు.. అవసరాలూ పెరుగుతాయి. పైగా ఎప్పుడు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం.. కాబట్టి ఇలాంటప్పుడు ఆర్థికంగా సమస్యలు రాకుండా ఉండడానికే చాలామంది అత్యవసర నిధి కింద కొంత డబ్బును పక్కన పెట్టుకుంటారు. అయితే పిల్లలు పుట్టాక ఈ నిధిని కాస్త పెంచమంటున్నారు నిపుణులు. అంటే.. భార్యాభర్తలిద్దరూ నెలనెలా తలా వెయ్యి రూపాయలు పక్కన పెడుతున్నట్లయితే.. మీ చిన్నారి పుట్టాక.. వాళ్ల కోసం అదనంగా మరో వెయ్యి రూపాయలు పక్కన పెట్టేలా ప్లాన్‌ చేసుకోవాలి. తద్వారా ఎవరి అత్యవసర నిధి వాళ్లకే ఉంటుంది. అలాగే అందరికీ ఒకేసారి డబ్బు అవసరం పడినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావు. కాబట్టి ఇంట్లో సభ్యులు పెరిగే కొద్దీ ఈ నిధిని కూడా పెంచుకుంటూ పోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఆస్తుల రూపంలో మంచిది!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి పేరు మీద పొదుపు, మదుపులే కాదు.. ఆస్తులూ సంపాదించి పెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. పైగా ఇవి వారికి దీర్ఘకాలిక భరోసాను అందిస్తాయి.. అలాగే ఇవి నగదు రూపంలో ఉండవు కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలన్న ఆలోచన కూడా రాదు. అందుకే తల్లిదండ్రులు ఈ విషయంలో ముందు చూపుతో ఆలోచించడం మంచిది. ఈ క్రమంలో తమకొచ్చే ఆదాయాన్ని బట్టి, పొదుపు-మదుపులు పోగా.. మిగిలిన డబ్బుతో స్థలం/ఇల్లు/ఫ్లాట్‌.. వంటివి కొనుగోలు చేయచ్చు. అది కూడా పిల్లలందరికీ సమానంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. లేదంటే పెద్దయ్యాక లేనిపోని గొడవలు జరిగినా అందుకు మీరే బాధ్యులవుతారు.

‘వీలునామా ఇప్పుడెందుకు?’ అనుకోవద్దు!

చాలామంది ఆస్తి పంపకాల విషయంలో జాప్యం చేస్తుంటారు. పిల్లలు చిన్న వారే కదా.. పెద్దయ్యాక పంపకాలు చేయచ్చులే అనుకుంటారు. అయితే మీ ఆలోచన ఇలా ఉన్నా.. భవిష్యత్తులో ఎప్పుడేమవుతుందో చెప్పలేం. అనుకోకుండా మీకు ఏమైనా జరిగితే.. ఆస్తిపాస్తుల విషయాల్లో తోబుట్టువుల మధ్య గొడవలు రావచ్చు.. అనుబంధాలూ తెగిపోవచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే వీలునామా చక్కటి మార్గం. మీరు సంపాదించిన ఆస్తుల్ని వారసులకు చెందేలా చట్టబద్ధత కల్పిస్తూ రాసే దస్త్రమిది. కాబట్టి దీన్ని జాప్యం చేయకుండా పిల్లలు కాస్త పెద్దయ్యాక లేదంటే యుక్త వయసులోకొచ్చాకైనా రాయడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలకు ఇవ్వాల్సిన వాటాల గురించి అందులో స్పష్టంగా తెలియజేయాలి. అలాగే ఒకవేళ పిల్లలు చిన్న వాళ్లైతే.. మీకు బాగా నమ్మకమైన వ్యక్తిని గార్డియన్‌గా నియమించుకొని.. మీ లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన అంశాలను మేనేజ్‌ చేసేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఆస్తి పంపకాల విషయంలో ముందే ఓ స్పష్టత ఉంటే వారసుల మధ్య గొడవలూ రావు.. ఎవరికి చెందాల్సిన ఆస్తి వారికి చెంది వారికి ఆర్థిక భరోసా కూడా ఉంటుంది.

పిల్లల్ని నిర్లక్ష్యం చేయద్దు!

భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం. దీనికి తోడు మన చుట్టూ జరిగే కొన్ని పరిణామాల వల్ల ఆర్థిక మాంద్యం ముప్పు కూడా పొంచి ఉంటుంది. ఇలాంటప్పుడు మన ఉద్యోగానికే ముప్పు రావచ్చు. అందుకే ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు’ పెద్దలు. అంటే.. సంపాదించినప్పుడే భవిష్యత్‌ అవసరాల కోసం కొంత డబ్బు వెనకేసుకోవాలన్నమాట! అందుకే ఉద్యోగంలో కొనసాగుతున్నప్పుడే.. చక్కటి ప్రణాళిక వేసుకుంటూ.. అనవసర ఖర్చులు తగ్గించుకొని.. డబ్బు రూపంలో, ఆస్తుల రూపంలో ఆర్థిక భరోసా పెంచుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగని ఈ హడావిడి, కెరీర్‌ బిజీలో పడిపోయి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకుండా.. వారినీ ఉన్నత చదువులు చదివించాలి. డబ్బు విలువ తెలియజేయాలి. అప్పుడే వారూ ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.. మీరు సంపాదించిన ఆస్తుల్ని అపురూపంగా కాపాడుకోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్