కెరీర్‌లో బ్రేక్ తీసుకున్నారా?వీటిని ప్రయత్నించి చూడండి..

ఈ రోజుల్లో చాలామంది మహిళలు మూసధోరణులు, గ్లాస్‌ సీలింగ్ను బద్దలుకొడుతూ తమదైన ప్రతిభతో ముందుకు వెళుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఉద్యోగాన్ని వీడుతున్నవారు కూడా ఉంటున్నారు. ఓ సర్వేలో ప్రతి 10 మందిలో ఏడుగురు మహిళలు ఉద్యోగం...

Published : 06 Nov 2022 13:15 IST

ఈ రోజుల్లో చాలామంది మహిళలు మూసధోరణులు, గ్లాస్‌ సీలింగ్ను బద్దలుకొడుతూ తమదైన ప్రతిభతో ముందుకు వెళుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల మధ్యలోనే ఉద్యోగాన్ని వీడుతున్నవారు కూడా ఉంటున్నారు. ఓ సర్వేలో ప్రతి 10 మందిలో ఏడుగురు మహిళలు ఉద్యోగం వీడుతున్నారని వెల్లడైంది. దీనికి పని వేళలు అనుకూలంగా లేకపోవడంతో పాటు ప్రసవానంతరం విరామం తీసుకోవడం వంటి కారణాలూ ఉంటున్నాయి. ఇలాంటి వారు ఫ్రీ లాన్సింగ్‌, వర్క్ ఫ్రం హోమ్‌ ద్వారా ఇంటి దగ్గరే పనిచేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. మరి, అలాంటి అనువైన కొన్ని ఉద్యోగాల గురించి తెలుసుకుందామా...

వర్చువల్‌ అసిస్టెంట్..

తల్లైన తర్వాత పిల్లల బాధ్యతలను చూసుకునే క్రమంలో ఆఫీస్‌కు వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలాంటివారు తిరిగి కెరీర్‌ ప్రారంభించడానికి ఇంటి దగ్గరే ఉండి చేసే ఉద్యోగాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో వర్చువల్‌ అసిస్టెంట్‌ ఒకటి. దీనిని పూర్తిగా ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు. వర్చువల్‌ అసిస్టెంట్స్‌ వ్యక్తిగతంగా లేదా బృందాలకు అడ్మినిస్ట్రేటివ్‌ సహాయాన్ని అందిస్తుంటారు. ఈ-మెయిల్స్ పంపడం, సోషల్‌ మీడియా ఖాతాలు నిర్వహించడం, వివిధ కార్యక్రమాలు, పర్యటనలకు సంబంధించిన వివరాలను షెడ్యూల్ చేయడం వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారికి ఈ ఉద్యోగం సరైన ఎంపిక. దీనిని పార్ట్‌టైమ్‌ లేదా ఫుల్టైమ్‌గానూ చేయచ్చు.

గ్రాఫిక్‌ డిజైనర్..

గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో మంచి ఉపాధి అవకాశాలున్నాయి. గ్రాఫిక్‌ డిజైనింగ్‌ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన ఉండి, సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇది మంచి అవకాశంగా మారుతుంది. గ్రాఫిక్‌ డిజైనర్లు వినియోగదారులను ఆకర్షించే లోగోలు, బ్రోచర్లు, బ్యానర్లను డిజైన్‌ చేస్తుంటారు. అలాగే వివిధ వెబ్‌సైట్లకు డిజైనింగ్‌ సపోర్ట్‌ కూడా ఇస్తుంటారు. ఈ నైపుణ్యాలు ఉన్నవారు ఇంటి దగ్గరే ఉండి ఫ్రీ లాన్సింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అనువైన పనివేళలు కావాలనుకునేవారు దీనిని ఎంచుకోవచ్చు.

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..

ఈ రోజుల్లో సోషల్‌ మీడియా ప్రాముఖ్యత ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు ఈ మాధ్యమాల ద్వారా తమ సృజనాత్మకతను ఉపయోగించి డబ్బు కూడా సంపాదిస్తున్నారు. ఇందుకు చేయాల్సిందల్లా ఆసక్తికరమైన కంటెంట్‌తో ఫొటోలు, వీడియోల ద్వారా అభిమానులను సొంతం చేసుకోవడమే. అభిమానుల సంఖ్య పెరిగే కొద్దీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రకటనలు వస్తుంటాయి. వీటితో డబ్బుతో పాటు పాపులారిటీ కూడా వస్తుంటుంది.

క్రియేటివ్‌ రైటింగ్..

ఈ రోజుల్లో చాలామంది వివిధ అంశాల గురించి తెలుసుకోవడానికి వివిధ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కంటెంట్‌కి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఆలోచించి వివిధ అంశాలపై వ్యాసాలు రాసేవారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి నైపుణ్యాలు ఉంటే వివిధ వెబ్సైట్లకు క్రియేటివ్‌ రైటర్‌గా కొనసాగవచ్చు. సొంతంగా చేసుకోవాలనుకునే వారు ఇంటి దగ్గరే ఉండి ఫ్రీలాన్సింగ్‌ వెబ్‌సైట్లలో రిజస్టర్‌ చేసుకోవడం ద్వారా అవకాశాలను సృష్టించుకోవచ్చు.

ఫుడ్‌ బ్లాగర్‌గా..

కొంతమంది మహిళలు ఎప్పుడూ చేసే వంటలకు భిన్నంగా వెరైటీ వంటకాలను చేయాలనుకుంటారు. కానీ చదువు, ఉద్యోగాల్లో పడడం వల్ల వారికి సమయం లభించదు. మీరూ ఈ జాబితాలో ఉన్నారా? తిరిగి కెరీర్‌ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. వెరైటీ వంటకాలను ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం ద్వారా ఫుడ్‌ బ్లాగర్‌గా మారచ్చు. తద్వారా ఒకవైపు ఆసక్తిని నెరవేర్చుకోవడంతో పాటు డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్