Money Tips : ఇరవైల్లోనే జాగ్రత్త పడండి!

మన జీవితంలో చాలా అంశాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకుంటే చాలా సమస్యలు సులభంగా ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 20ల్లో ఉండే యువత ఆర్థిక విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Published : 20 Apr 2024 20:12 IST

మన జీవితంలో చాలా అంశాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకుంటే చాలా సమస్యలు సులభంగా ఎదుర్కోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా 20ల్లో ఉండే యువత ఆర్థిక విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

బడ్జెట్‌ ప్రణాళిక!

ఆర్థిక క్రమశిక్షణలో మొదటి, ముఖ్యమైన అంశం బడ్జెట్‌ ప్రణాళిక వేసుకోవడం! ఈ క్రమంలో మీ ఆదాయ వ్యయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అధిక ఖర్చులకు కళ్లెం వేసుకోవాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొంత డబ్బును పొదుపు చేసుకోవడం, లాభాలొచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టడం.. వంటివీ ముఖ్యమే! ఇలా మీరు పెట్టుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండడం తప్పనిసరి! ఇక ఈ విషయాల్లో అవగాహన కోసం, సందేహాల నివృత్తి కోసం నిపుణుల్ని సంప్రదించచ్చు.. లేదంటే పలు మొబైల్స్‌ యాప్స్‌నీ ఆశ్రయించచ్చు.

క్రెడిట్‌ స్కోర్‌ పెంచుకోవాలి...

కొన్ని లక్ష్యాలను సాధించడానికి అధిక మొత్తంలో డబ్బు అవసరమవుతుంటుంది. అలాంటి సందర్భాల్లో లోన్‌ కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సిన అవసరం రావచ్చు. అలాగే మరికొన్ని అవసరాల కోసం క్రెడిట్‌ కార్డును ఉపయోగించాల్సి వస్తుంది. అయితే దీన్ని పొందాలంటే బ్యాంకులు క్రెడిట్‌ స్కోర్‌ను చెక్‌ చేస్తుంటాయి. ఈ స్కోరే మీ ఆర్థిక క్రమశిక్షణను నిర్ణయిస్తుంది. కాబట్టి ఇరవైల్లో ఉన్నప్పటి నుంచే మీ క్రెడిట్‌ స్కోర్‌ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం నెలవారీ బిల్లులు ఏవైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు చెల్లించాలి. అలాగే క్రెడిట్‌ కార్డుకి సంబంధించిన లావాదేవీలను సాధ్యమైనంత మేరకు అదుపులో పెట్టుకోవాలి. ఆ బిల్లులను కూడా గడువు లోపు చెల్లించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇల్లు కొనుక్కోవడం, సొంతంగా బిజినెస్‌ పెట్టుకోవడం వంటి లక్ష్యాల కోసం డబ్బును బ్యాంక్‌ లోన్ల ద్వారా సులభంగా పొందచ్చు.

రెండో ఆదాయం కూడా!

ప్రముఖ వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ ‘ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడద్దు. పెట్టుబడులతో ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలి’ అని చెబుతుంటారు. ఈ పద్ధతిని ఇరవైల్లో ఉన్నవారు పాటిస్తే మంచి ఫలితాలను రాబట్టచ్చు. చాలామంది కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కేవలం ఆ సంపాదనపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో మిగతా సమయాన్ని వృథా చేస్తుంటారు. అయితే దీనికి బదులుగా రెండో ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవచ్చు. ఇందుకోసం ఫ్రీలాన్సింగ్‌ చేయడం, పార్ట్‌టైమ్‌ బిజినెస్‌ పెట్టుకోవడం.. ఇలా ఆలోచిస్తే ఎన్నో ఆదాయ మార్గాలున్నాయి. ఇది మీ ఆర్థికాభివృద్ధితో పాటు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది.

అత్యవసర నిధి!

అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేయకుండా అత్యవసర నిధి కాపాడుతుంది. ఇందుకోసం ప్రతి నెలా మీ వేతనంలో కొంత మొత్తాన్ని కేటాయించాలి. ఆ డబ్బుని ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి వీలు లేకుండా ప్రత్యేక ఖాతాను ఓపెన్‌ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న వయసులోనే ఇలాంటి పద్ధతిని పాటించడం వల్ల.. భవిష్యత్తులో ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సులభంగా బయటపడగలుగుతారు.

దానికి పెట్టుబడులే సంకేతం..

వృథా ఖర్చులు చేయద్దన్నారుగా అని కొంతమంది డబ్బులన్నీ సేవింగ్‌ ఖాతాలో జమ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు నిపుణులు. నెలవారీ ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఎఫ్‌డీ, మ్యూచువల్‌ ఫండ్స్‌, SIP.. వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాల్ని ఆర్జించచ్చంటున్నారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం మరీ మంచిదంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్