సారీతో నేర్పించొచ్చు

పిల్లలే కాదు.. మనమూ తప్పు చేస్తుంటాం. వాళ్లని పొరబాటుగా అర్థం చేసుకోవడం, చేయని తప్పుకు నిందించడం లాంటివి. తీరా తెలిసినా ‘ఆ ఏం కాదులే’ అని వదిలేస్తున్నారా? ఆ పొరబాటే చేయొద్దంటున్నారు నిపుణులు. చిన్న సారీతో బోలెడు నేర్పించొచ్చంటున్నారు.

Published : 06 Jul 2022 01:23 IST

పిల్లలే కాదు.. మనమూ తప్పు చేస్తుంటాం. వాళ్లని పొరబాటుగా అర్థం చేసుకోవడం, చేయని తప్పుకు నిందించడం లాంటివి. తీరా తెలిసినా ‘ఆ ఏం కాదులే’ అని వదిలేస్తున్నారా? ఆ పొరబాటే చేయొద్దంటున్నారు నిపుణులు. చిన్న సారీతో బోలెడు నేర్పించొచ్చంటున్నారు.

* ఇంట్లో పిల్లలు అల్లరి చేయడమో, ఏదైనా విరగ్గొట్టడమో చేస్తుంటారు. అది మామూలే. దానికి మనం కోప్పడటమూ సమంజసమే. కానీ తను చేయకుండా కోప్పడినా, చేయి చేసుకున్నా ‘ఏం ఫర్లేదు’ అని సర్ది చెప్పుకోవద్దు. తప్పు చేసినా ‘క్షమించ’మని అడగకపోవడం మామూలే అన్న భావనకు వచ్చేస్తారు. కొన్నిసార్లు దాన్నో అవమానంగానో, చెడ్డ విషయంగానో భావించే అవకాశమూ ఉంది. కాబట్టి, మీ వైపు నుంచి తప్పు జరిగితే నిర్మొహమాటంగా, నిజాయతీగా సారీ అడిగేయండి.

* చూడక పిల్లల బొమ్మ విరగ్గొట్టారు.. కథ చెబుతానని మర్చిపోయారు. బయటకు తీసుకెళతానని చెప్పి మాట తప్పారు.. తెలిసీ తెలియక చేసినా అది మీ పొరబాటే కదా! వీటినీ వాళ్లకు గుర్తుండవనో, పెద్ద విషయాలు కావనో తోసి పుచ్చొద్దు. ‘సారీ.. చూడలేదు, ఫలానా కారణం చేత చేయలేకపోయా’ అని చెప్పండి. మీరు చేయలేకపోవడానికి కారణం వాళ్లకు అర్థం కాకపోయినా.. మాట తప్పడం తప్పనే విషయం అర్థమవుతుంది. తప్పును నిరభ్యంతరంగా ఒప్పుకోవడం తెలుస్తుంది.

* ‘సారీ’ రెండక్షరాలే. కానీ ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌కు విలువనివ్వడం, సమస్యను సామరస్యంగా పరిష్కరించడమే కాదు.. అవతలి వారిని క్షమించడం అనే లక్షణాన్నీ పిల్లల్లో అలవరుస్తుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, కథలు చెప్పినా వాళ్లు మొత్తం గుర్తుంచుకోలేరు. కానీ చేసి చూపించండి.. తప్పక అనుసరిస్తారు. కాబట్టి.. పొరబాటు జరిగిందా.. ‘సారీ’ చెప్పేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్