పరధ్యానంగా ఉంటే...

రమ్య తన ఆరేళ్ల కూతురికి ఏం చెప్పినా పరధ్యానంగానే వింటుంది. తిరిగి అడిగితే చెప్పలేనంటుంది. చాలామంది చిన్నారులు చదువులోనే కాదు, తినేటప్పుడు, తోటి పిల్లలతో ఆడుకునేటప్పుడు, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కూడా పరధ్యానంగా ఉంటుంటారు. దీన్ని దూరం చేయడానికి కొన్ని సూచనలిస్తున్నారు నిపుణులు...

Published : 30 Jul 2022 00:37 IST

రమ్య తన ఆరేళ్ల కూతురికి ఏం చెప్పినా పరధ్యానంగానే వింటుంది. తిరిగి అడిగితే చెప్పలేనంటుంది. చాలామంది చిన్నారులు చదువులోనే కాదు, తినేటప్పుడు, తోటి పిల్లలతో ఆడుకునేటప్పుడు, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కూడా పరధ్యానంగా ఉంటుంటారు. దీన్ని దూరం చేయడానికి కొన్ని సూచనలిస్తున్నారు నిపుణులు.

పిల్లల మెదడు నిండా పరిసరాలకు సంబంధించిన చాలా అంశాలు ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ దేనిపైనా ఏకాగ్రత చూపించలేరు. పరధ్యానంగా ఉంటారు. అటువంటి వారిని తల్లిదండ్రులు గుర్తించి ఏకాగ్రత నేర్పడానికి ప్రయత్నించాలి. లేదంటే హోంవర్క్‌ చేస్తూ, అకస్మాత్తుగా మరో ఆలోచనలోకి వెళ్లిపోతారు. అలాకాకుండా ఫలానాది రాసి ఉంచు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతే పిల్లలు ఆ సంగతే మర్చిపోయి వేరే ఆటలోకి మరలుతారు. చిన్నారుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తేనే వీలైనంత త్వరగా వారికి ఏకాగ్రతను తెప్పించొచ్చు.

ధ్యానంతో.. రోజూ పదినిమిషాలు ధ్యానం చేయించడం మంచిది. ఇది వారి మెదడును ప్రశాంతంగా మారుస్తుంది. ఏకగ్రంతో, స్థిరంగా కూర్చోడం నేర్పిస్తుంది. ఇది పెద్దల పర్యవేక్షణలో జరగాలి.

చదివించడం.. హోంవర్క్‌ అంటే ఆమడదూరం పారిపోతున్న పిల్లలను కథల పుస్తకంతో అరనిమిషంలో ఒక చోట కూర్చోబెట్టొచ్చు. దాన్ని అమ్మానాన్నలు చదవడం కాకుండా, పిల్లలనే చదివి వినిపించమని చెప్పాలి. అక్షరాలను కూడబలుక్కొని వారు చదువుతుంటే పెద్దవాళ్లు వినడానికి ఆసక్తి చూపించాలి. అలా రోజుకో గంట కూర్చోబెట్టగలిగితే చాలు, ఏకాగ్రత దానికదే వస్తుంది.

టీవీ టైం.. గంటలతరబడి టీవీ ముందు కూర్చోనివ్వకుండా నియమిత సమయాన్ని కేటాయించాలి. చేయాల్సిన పనులు పూర్తి చేస్తేనే టీవీ అన్న నియమం పెట్టాలి. పని పూర్తిచేస్తే ప్రశంసించాలి. పెన్‌, పెన్సిల్‌, డ్రాయింగ్‌ పుస్తకం, రంగులు వంటి చిన్నచిన్న కానుకలు అందివ్వాలి. టీవీ కన్నా క్రీడలపై ఆసక్తిని పెంచాలి.  ఇవన్నీ వారిలో గెలవాలన్న తపనని పెంచుతాయి. తద్వారా ఎక్కువసేపు ఏకాగ్రతతో ఉండటం అలవరచుకుంటారు.

నిద్రతో.. రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర పిల్లల మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతకన్నా ఎక్కువసేపు నిద్ర పోనివ్వకుండా ఉంటే మంచిది. అలాగే ఒకే నిద్రవేళలుండాలి. వారి మెదడు దానికి అలవడితే రోజూ అదే సమయానికి విశ్రాంతి తీసుకుంటుంది. పోషకాహారాన్ని తీసుకోవడం అలవరచాలి. ఇవన్నీ వారిని హైపర్‌ యాక్టివిటీకి దూరం చేస్తాయి. భావోద్వేగాలపై అదుపునిస్తాయి. జ్ఞాపకశక్తితోపాటు శారీరక, మానసికారోగ్యం పెంపొందేలా చేస్తాయి. పరధ్యానం పరార్‌ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్