Published : 05/10/2022 00:36 IST

తోటివారి నుంచి నేర్చుకుంటే..

రమ ఎనిమిదేళ్ల కూతురు ఇంట్లో ఎవరూ మాట్లాడని అమర్యాదకరమైన పదాలను ప్రయోగించడం మొదలుపెట్టింది. తన ప్రవర్తనలో అకస్మాత్తుగా కనిపిస్తున్న ఈ మార్పులకు కారణం తెలియక రమకు ఆందోళన మొదలైంది. తోటిపిల్లలతో కలిసినప్పుడు వారి నుంచి కొత్త అలవాట్లను పిల్లలు తేలికగా నేర్చుకుంటారని చెబుతున్నారు నిపుణులు. వాటిలో  మంచీ చెడూ విడమర్చి చెప్పడం అమ్మానాన్నల బాధ్యత అంటున్నారు.

చిన్నారులపై స్నేహితుల ప్రభావం చాలా ఉంటుంది. మంచీ చెడుకూ మధ్య తేడా తెలియని వయసులో వారిపై ఇతరుల ప్రభావం తేలికగా పడుతుంది. కొత్తపదాలను విన్నప్పుడు గుర్తుపెట్టుకొని, ఎవరినుంచైనా వారికి అసౌకర్యం ఎదురైందని అనిపించిన వెంటనే వాటిని వాడుతుంటారు. ఇంట్లో ఎవరూ ప్రవర్తించని విధానం లేదా పలకని పదాలను పిల్లలు మాట్లాడుతున్నారంటే బయటి నుంచి నేర్చుకుంటున్నారని గుర్తించాలి. అప్పుడు వారిని కోప్పడకూడదు, అలాగని ప్రోత్సహించకూడదు. మృదువుగా మాట్లాడి, ఎవరిలా మాట్లాడతారో అడిగి, ఆ పిల్లలను కలుసుకోవాలి. ఆ తరహా ప్రవర్తన తప్పు అని వారిలో అవగాహన కలిగించాలి. ఇంట్లో చిన్నారులకూ ఇది సరైనది కాదని, మరొకసారి జరగకూడదని హెచ్చరించాలి.

అబద్ధాలు..

అప్పటివరకు నిజం చెప్పే పిల్లలు అకస్మాత్తుగా అబద్ధాలు చెబుతున్నారని గుర్తిస్తే తక్షణం ఆ అలవాటును మాన్పించడానికి ప్రయత్నించాలి. అందరి దృష్టినీ ఆకర్షించడం లేదా అనుకున్నది సాధించడం వంటి కారణాలు చిన్నారులతో ఇలా చేయిస్తాయి. దీన్ని అలవాటుగా మార్చుకోకముందే వారిని మార్చడానికి ప్రయత్నించకపోతే జీవితాంతం అబద్ధాలు చెప్పడం మానరు. నిజం చెబితే కలిగే ప్రయోజనాలు వారికి హత్తుకునేలా చెప్పాలి. అబద్ధం ఎప్పటికైనా సమస్యగా మారి ఎలా ఇబ్బంది పెడుతుందో కథలద్వారా వివరించాలి. అప్పటికీ మానకపోతే, గుర్తించిన ప్రతిసారీ క్షమాపణ ఉత్తరం రాయిస్తే, క్రమేపీ ఈ అలవాటుకు దూరమవుతారు.

వెనుక మాట్లాడటం..

తోటి పిల్లల గురించి మరొకరి వద్ద తప్పుగా మాట్లాడటం, మిగతాపిల్లలు, తోబుట్టువులపై ఫిర్యాదులివ్వడం వంటివి చేస్తున్నప్పుడు వారిపై కోప్పడకూడదు. అలాగని గుర్తించనట్లు ఉండటం లేదా ప్రోత్సహించడం చేయకూడదు. అది సరైన విధానం కాదని సున్నితంగా చెప్పాలి. ఈరకమైన ప్రవర్తన ఉంటే ఇప్పుడే కాదు, పెద్దయ్యాకా ఇతరుల నుంచి మర్యాద పొందలేమని వివరించాలి. చాడీలు చెప్పే అలవాటు మంచిది కాదనే అవగాహన వారిలో కలిగించగలగాలి. దాని వల్ల మానవ సంబంధాలు ఎలా పాడవుతాయో వారికి అర్థమయ్యేలా వివరించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని