పిల్లలకు నచ్చేలా...

ఒకప్పుడు హోటల్‌కి వెళ్తేనే బయటి తిండి. అదీ పెద్దలతో కలిసి వెళ్తేనే కుదిరేది. కానీ ఇప్పుడో స్కూలు పిల్లలు కూడా ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టేస్తున్నారు. ఇలా అరుదుగా అయితే పరవాలేదు కానీ తరచుగా తింటే మాత్రం డబ్బుకు రెక్కలొచ్చేస్తాయి.

Published : 10 Nov 2022 00:07 IST

ఒకప్పుడు హోటల్‌కి వెళ్తేనే బయటి తిండి. అదీ పెద్దలతో కలిసి వెళ్తేనే కుదిరేది. కానీ ఇప్పుడో స్కూలు పిల్లలు కూడా ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టేస్తున్నారు. ఇలా అరుదుగా అయితే పరవాలేదు కానీ తరచుగా తింటే మాత్రం డబ్బుకు రెక్కలొచ్చేస్తాయి. అంతకంటే ముఖ్యంగా ఆరోగ్యం అడుగంటిపోతుంది. ఇంతా చేస్తే అవేమైనా అద్భుతమైన రుచులా అంటే కాదు. మనకు అంతకంటే నోరూరించే వంటకాలెన్నో ఉన్నాయి. పైగా అవి శరీరానికి హాని చేయవు. అయినా వాటికోసం వెంపర్లాట ఎందుకు? ఇకపై పిల్లల నాడి గ్రహించి ఇలా చేసి చూడండి...

* నీళ్లు కలపని చిక్కటి దోశల పిండిలో ఉల్లి, మిర్చి ముక్కలు, కాస్త అల్లం ముద్ద వేసి సన్నసెగలో ఊతప్పమ్‌ వేసి ముక్కలుగా కోయండి. టొమేటో, ఉల్లి, స్ప్రింగ్‌ ఆనియన్‌, క్యాప్సికం, కొత్తిమీర లాంటివి సన్నగా తరిగి పైన పేర్చండి. టొమేటోసాస్‌, చిల్లీసాస్‌లు కొద్దిగా వేసి ఇచ్చారంటే క్షణాల్లో తినేయడమే కాదు, పిజ్జా దీనిముందు బలాదూర్‌ అనేస్తారు చిచ్చరపిడుగులు.

* జపాన్‌ వాళ్ల రైస్‌బాల్స్‌ అంటే పిల్లలకు నోట్లో నీళ్లూరుతాయి. వీటిల్లో ఒకరకంలో అన్నాన్ని ఉండలుగా చేసి నువ్వులూ గట్రా అద్ది అలాగే తినేస్తే ఇంకో రకంలో వేయించి క్రిస్పీగా చేస్తారు. మొదటిది నువ్వులన్నం, జీరా రైస్‌ తరహాదే, రెండోది కచోరీని తలపిస్తుంది. ఇలాంటివీ, ఇంతకంటే రుచికరమైనవీ అనేకమున్నా మనం గార్నిష్‌ జోలికి వెళ్లం. కానీ చిన్నారులు దానికే ముచ్చట పడుతున్నారని అర్థమైంది కనుక ఆకర్షణీయమైన రంగులతో అలంకరిస్తే పోలా!

* మనలో చాలామంది కేక్‌ ఇంట్లోనే తయారు చేస్తుంటాం కదూ! కానీ సిసింద్రీలకి బేకరీల్లో కొన్న కేకులే నచ్చుతాయి. అందుకు ముఖ్య కారణం అలంకరణే. అందుకే రుచిగా ఉన్నా సరే ప్లెయిన్‌గా వదిలేయకుండా చెర్రీస్‌, డ్రైఫ్రూట్స్‌ లాంటివి అందంగా అమరిస్తే ఆహా అంటూ తింటారు.

* చిరుతిళ్లు చేసేంత సమయం లేనప్పుడు పండ్లు తీసుకోండి. ఒకే రకం కాకుండా ద్రాక్ష, యాపిల్‌, కివీ, చెర్రీస్‌, అరటిపండు, నల్ల ద్రాక్ష, బొప్పాయి.. ఇలా ప్లేటులో సర్ది ఇస్తే రంగురంగుల్లో అలరిస్తూ నచ్చేస్తాయి. వీలైతే వాటిని కూడా పొడవైన ముక్కలు, చతురస్రం, త్రిభుజం.. అలా వివిధ ఆకృతుల్లో కోసిపెడితే వహ్వా అనేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్