పంచుకోవడం నేర్పుతున్నామా

ఎంతో ఇష్టంగా ఆడుకొనే తన బొమ్మను చింటూ మరెవ్వరికీ ఇవ్వడు. కానీ... పక్కింటి రాహుల్‌ కారు కావాలని పేచీ పెడుతుంటాడు. పిల్లలు చిన్నప్పటి నుంచి తమవద్ద ఉన్నదాన్ని తోటివారితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా.. తల్లిదండ్రులు గుర్తిస్తుండాలి.

Published : 28 Feb 2024 01:29 IST

ఎంతో ఇష్టంగా ఆడుకొనే తన బొమ్మను చింటూ మరెవ్వరికీ ఇవ్వడు. కానీ... పక్కింటి రాహుల్‌ కారు కావాలని పేచీ పెడుతుంటాడు. పిల్లలు చిన్నప్పటి నుంచి తమవద్ద ఉన్నదాన్ని తోటివారితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారా లేదా.. తల్లిదండ్రులు గుర్తిస్తుండాలి. ఎదుటివారి నుంచి తీసుకోవడమే కాకుండా తనవద్ద ఉన్నదాన్నివ్వడం కూడా నేర్పించాలి. లేదంటే ఇది భవిష్యత్తులో వారి వ్యక్తిత్వ లోపమయ్యే ప్రమాదం ఉంది.

పిల్లలు తమ బొమ్మలతో ఇతర పిల్లలనూ ఆడుకోనివ్వాలని చెబితే ఒప్పుకోకపోవచ్చు. ఈ అలవాటు రావాలంటే తగిన వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. నలుగురైదుగురిని బృందంగా ఒకచోట ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఆ సందర్భాన్ని వేదికగా తీసుకుని ఒకరి బొమ్మలను మరొకరు కలిసి పంచుకోవడమెలాగో నేర్పించాలి. అందరం ఒక్కటే అనే భావన వచ్చేలా చేయాలి. దీంతో తనకెంతో ఇష్టమైన బంతి లేదా కారు బొమ్మను మరొక పిల్లాడు తీసుకెళ్లిపోతాడేమో అనే భయం నెమ్మదిగా వారిలో దూరమవుతుంది. అవతలివాడి వద్ద ఉన్న అందమైన బొమ్మ తన వద్ద లేదనే అసూయా తగ్గుతుంది. ఇతరుల వస్తువును తీసుకోవడమే కాదు... తన బొమ్మల్ని వారితో పంచుకునే అలవాటూ ఏర్పడుతుంది.

సరదా ప్రాజెక్టులు... ఇంట్లో లేదా మైదానంలో అందరూ కలిసి ఆడుకునేటప్పుడు బాబు చేతిలో అందరికీ సరిపడా బిస్కెట్లో, చాక్లెట్లో ఇచ్చి అందరికీ సమానంగా పంచమనాలి. అది వారిలో ఐకమత్య భావనను తెస్తుంది. ఎదుటివారికి ఏదైనా ఇచ్చినప్పుడు కలిగే సంతోషం వారికర్థమవుతుంది. పిల్లలందరినీ ఒక చోట చేర్చి క్లే బొమ్మలు చేసి రంగులేయడం, చిత్రలేఖనాలు గీయడం వంటి ఆర్ట్‌ ప్రాజెక్టులను సరదాగా చేయించాలి. సమష్టిగా చేయించే తోటపని వారి మధ్య స్నేహబంధాన్ని పెంచుతుంది.

సాయం చేస్తూ... స్నేహితులతో ఆటవస్తువులు పంచుకోవడమే కాదు తెలియనివారికి సాయం చేయడమెలాగో కూడా బాల్యం నుంచే నేర్పాలి. నెలకోసారైనా అనాథాశ్రమాలకు తీసుకెళ్లి ఆ పిల్లలను పరిచయం చేయాలి. ప్రత్యేక దినాల్లో వారికి కానుకలిచ్చేలా ప్రోత్సహించాలి. ఈ అలవాటు కష్టంలో ఉన్నవారికి సాయం చేయాలనే ఆలోచనకు చిన్నవయసులోనే బీజం పడేలా చేస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దక్కే ఆనందమెలా ఉంటుందో కూడా తెలుసుకోగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్