మీ ఉద్యోగం నచ్చిందా?

మాధవి చదువు పూర్తిచేసి ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టింది. వీలైనంత త్వరగా కొత్తవిషయాలు నేర్చుకుంటూ.. పై స్థాయికి చేరాలన్నది ఆమె లక్ష్యం. ఎంచుకున్న కెరియర్‌లో ఎదగాలంటే పలురకాల

Updated : 22 Nov 2022 15:26 IST

మాధవి చదువు పూర్తిచేసి ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టింది. వీలైనంత త్వరగా కొత్తవిషయాలు నేర్చుకుంటూ.. పై స్థాయికి చేరాలన్నది ఆమె లక్ష్యం. ఎంచుకున్న కెరియర్‌లో ఎదగాలంటే పలురకాల అవకాశాలను అందిపుచ్చుకోవాలంటున్నారు నిపుణులు.

మెంటరింగ్‌..  పని చేస్తున్న చోట మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ అవకాశముందేమో చూడండి. సంస్థే ఆ అవకాశం ఇస్తే వెనుకడుగు వేయకూడదు. మెంటర్‌ నుంచి కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ఎంతో అనుభవం ఉంటుంది కాబట్టి వారి సలహాలు, సూచనలు మీరు ముందుకు సాగడానికి సాయపడతాయి. మీ రంగంలో ఎదురయ్యే సవాళ్లు, ఎదుర్కొనే మార్గాలను వారు సూచించగలరు. కాబట్టి, ఏ లక్ష్యంతో మీరు అడుగుపెట్టారో మెంటర్‌కు వివరంగా చెప్పి, మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకోవాలో సలహా తీసుకోవచ్చు.

నాయకత్వం... ఉద్యోగంలో భాగంగా బృంద సభ్యులు నాయకత్వ బాధ్యతలు మీకప్పగించొచ్చు. దీన్నీ నేర్చుకోవచ్చు. ఇందుకు లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లకు హాజరవడం మంచిది. ఇది మిమ్మల్ని పూర్తిగా తీర్చిదిద్దుతుంది. కొత్త నైపుణ్యాలను అందిస్తుంది. నూతన విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు. మీ బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చే స్థాయికి చేరుకోవడానికి ఇది వారధిలా ఉపయోగపడుతుంది. వైఫల్యాలెదురైనా ధైర్యంగా వాటిని దాటి ముందడుగు వేయగలిగే ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఈ ప్రోగ్రామ్‌ ద్వారా పొందొచ్చు.

సామర్థ్యం.. చేసే పనిలో మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇందుకు నైపుణ్యాలు పెంచుకోవడమే సరైన మార్గం. ఉద్యోగ బాధ్యతల్లో ఒత్తిడి, ఆందోళన వంటివి దరి చేరకుండా జాగ్రత్తపడుతూ, అనుభవాన్ని సంపాదించుకోవడానికి కృషి చేయాలి. ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని నింపి, యాజమాన్యం ఏ బాధ్యతలిచ్చినా నెరవేర్చగలననే భరోసా మీకు కలిగిస్తుంది. ఎంచుకున్న కెరియర్‌లో తృప్తి, సంతోషం ఉంటేనే విజయాలను సాధించగలం. అలా అనిపించనప్పుడు అది మీకు సరైనది కాదని భావించి, మరొక రంగంలోకి అడుగుపెట్టడం మంచిది. లేదంటే మీ ఎదుగుదల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్