బాల్యం నేర్పిన పాఠం ఇది..

పరిస్థితులు అనుకూలించనప్పుడు.. వైఫల్యాలు వెక్కిరించినప్పుడు... జీవితంతో రాజీపడాల్సిన అవసరం లేదు. అవే మనలోని శక్తిని వెలికితీస్తాయి అని నిరూపించింది ఇటలీకి మొదటి మహిళా ప్రధానిగా ఎంపికైన జార్జియా మెలోనీ...

Published : 28 Sep 2022 01:04 IST

పరిస్థితులు అనుకూలించనప్పుడు.. వైఫల్యాలు వెక్కిరించినప్పుడు... జీవితంతో రాజీపడాల్సిన అవసరం లేదు. అవే మనలోని శక్తిని వెలికితీస్తాయి అని నిరూపించింది ఇటలీకి మొదటి మహిళా ప్రధానిగా ఎంపికైన జార్జియా మెలోనీ...

‘నా పేరు జార్జియా.. నేనొక మహిళని, నేనొక అమ్మను...’ అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకొన్న జార్జియా జీవితం చిన్నతనం నుంచీ ఘర్షణలమయమే. తండ్రి ఫ్రాన్‌సిస్కో టాక్స్‌ అడ్వైజర్‌. జార్జియాకి ఏడాది వయసున్నప్పుడు కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడతను. తల్లి అన్నా పెద్దపిల్ల అరియానానీ, పసికందుగా ఉన్న జార్జియానీ తీసుకుని పుట్టింటికి వచ్చింది. పిల్లలని పోషించడం కోసం ఆమె ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ఉద్యోగాలు చేసింది. జార్జియా తాతయ్య దగ్గరే ఎన్నో విషయాలు నేర్చుకుంది. పురుషాధిక్య ప్రపంచంలో ఎదురీదడం ఎలానో నా బాల్యమే నాకు నేర్పించింది అంటుందామె. యూనివర్సిటీ చదువులు చదువుకోలేదు. బతకడం కోసం డిస్కోక్లబ్‌లో బార్‌టెండర్‌గా పనిచేసింది. రోడ్డు వారన వస్తువులు పెట్టి అమ్మే ఫ్లీమార్కెట్లు నడిపింది. పిల్లలకు కాపలా ఉండే బేబీసిట్టర్‌గా పనిచేసింది. ఇవన్నీ చేస్తూనే సమాజంలో సమస్యల్నీ చదివింది. వాటిని అడ్డుకోవాలనుకుంది. పదిహేనేళ్ల వయసులో తన ఇంటికి దగ్గర్లో.. ముస్సోలిని అభిమానులు నడిపే ఎమ్‌ఎస్‌ఐ పార్టీ నిర్వహించిన ఓ సమావేశానికి వెళ్లింది. ‘ఆ సభలో ఉన్న వాళ్లలో చిన్న వయసు పిల్ల. లేత ముఖం. భావాలు మాత్రం దృఢ[ంగా ఉండేవి. పార్టీ పనుల పట్ల అంకిత భావం ఎక్కువ. ఆ తీరే ఆమెని 29 ఏళ్ల చిన్నవయసులో పార్లమెంటులో అడుగుపెట్టేలా చేసింది. ఆ తర్వాత మంత్రిని, ఇప్పుడు ప్రధానిని చేసిందం’టారు ఆ రోజు ఆ సభని నిర్వహించి తర్వాత ఆమెకు మెంటార్‌గా మారిన మార్కోమార్‌సిలియో. నాలుగేళ్ల క్రితం ఆమె ‘బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ’ పార్టీని ప్రారంభించినప్పుడు 4 శాతం ఓట్లు కూడా రాలేదు. అలాగని నిరాశ పడలేదు. అక్రమ వలసలు, స్థానిక సమస్యలు, గర్భస్రావాలు, ఎల్‌జీబీటీ అంశాలపై తన గొంతుని బలంగా వినిపించింది. అలుపెరగని పోరాటమే ఆమెకు తిరిగి గెలుపుని దక్కించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్