రాజులూ రాణులతో కష్టమయ్యేది..!

వెయ్యేళ్ల నాటి కథ అది. అలనాటి రాజులు, పట్టపు రాణులను వెండితెరపై చూపడం పెద్ద సవాల్‌. ముఖ్యంగా ఆహార్యం, వస్త్రధారణ... అంతటి బాధ్యతను నిర్వర్తించే అవకాశం వస్త్ర డిజైనర్‌ 32 ఏళ్ల ఇకా లఖానీకి దక్కింది. ఏళ్ల పరిశోధన, అధ్యయనంతో ప్రశంసలనూ అందుకుంటోంది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రానికి పని చేసిన ఇకా స్వగతమిది...

Updated : 01 Oct 2022 08:03 IST

వెయ్యేళ్ల నాటి కథ అది. అలనాటి రాజులు, పట్టపు రాణులను వెండితెరపై చూపడం పెద్ద సవాల్‌. ముఖ్యంగా ఆహార్యం, వస్త్రధారణ... అంతటి బాధ్యతను నిర్వర్తించే అవకాశం వస్త్ర డిజైనర్‌ 32 ఏళ్ల ఇకా లఖానీకి దక్కింది. ఏళ్ల పరిశోధన, అధ్యయనంతో ప్రశంసలనూ అందుకుంటోంది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రానికి పని చేసిన ఇకా స్వగతమిది.

కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవుతాననుకున్నా.. మణిరత్నంతో కలిసి పనిచేస్తానని మాత్రం కల్లోనూ అనుకోలేదు. భారీ చిత్రానికి పని చేయాలనే నా కల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తీర్చింది. మాది ముంబయి. నాన్న టెక్స్‌టైల్‌ డిజైనర్‌. మాకు బ్లాక్‌ ప్రింటింగ్‌ యూనిట్‌ ఉండేది. వర్ణభరిత వస్త్రాల మధ్య పెరిగా. అందుకేనేమో డిజైనింగ్‌పై ఆసక్తి. తన వ్యాపారంలో చేరమని నాన్న అడిగేవారు. సరేనన్నా. పరిజ్ఞానం కోసం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశా. నైపుణ్యాలను పెంచుకోవాలని న్యూయార్క్‌ ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ తీసుకున్నా. ఆ తర్వాత ఇంటర్న్‌ షిప్‌ చేయాలనుకుంటున్నప్పుడు ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీకి సహాయకురాలిని వెతుకుతున్నారని తెలిసి, వెళ్లా. అప్పటికి ఆయన ‘రావణన్‌’ చేస్తున్నారు. కాస్ట్యూమ్‌ అసిస్టెంట్‌ బృందంలో చోటుందంటే చేరా. అక్కడ మణిరత్నంతో పనిచేస్తుంటే మళ్లీ కాలేజీకి వెళ్లినట్లు అనిపించింది. తర్వాత ఆయనతో కొన్ని సినిమాలు చేశా. మణిరత్నంతో పని చేసేటప్పుడు అంతా పక్కాగా ఉండాలి. తను చెప్పినట్లు చేసి చూపిస్తే, చాలా బాగా చేశావు. అద్భుతంగా ఉంది. మరింత బాగా చేద్దామని ప్రోత్సహిస్తారు. ఈ సినిమా అంగీకరించాక మణి ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవలను పంపి చదవమన్నారు. తంజావూరు వెళ్లి ఆలయాలు, శిల్పాలను అధ్యయనం చేయమన్నారు. అక్కడ ఆలయాలన్నీ తిరిగి, బొమ్మలు, శిల్పాలను నిశితంగా అధ్యయనం చేశా. అంత చేసినా చిత్రం స్క్రిప్టు చూశాక నేనింకా కష్టపడాలని అర్థమైంది. పైగా ఈ సినిమా మణిరత్నం 34 ఏళ్ల కల.

కాంచీపురం కళాకారులతో..

12వ శతాబ్దపు ఆహార్యాన్ని చూపడం కోసం ఆ కాలం సంప్రదాయం, దుస్తులు వంటి అంశాలపై పరిశోధన చేసిన వారిని కలిసి సమాచారాన్ని సేకరించా. కంచి చేనేత కళాకారులను సంప్రదించా. ఈ సినిమాలో పూర్తిగా అక్కడి చేనేత వస్త్రాలనే వినియోగించాం. బంగారు జరీ, ఎంబ్రాయిడరీతో దుస్తులను డిజైన్‌ చేశా. ఆ అధ్యయన ఫలితమే తెరపైన కనిపించింది. వీటికి వస్త్రాన్ని ఎంచుకునే విషయంలో మణి సర్‌ నాకు స్వేచ్ఛనిచ్చారు. చిత్రకారుడు మణియం బృందం ప్రతి పాత్రకూ వేసిన స్కెచ్‌లను పరిశీలనకు తీసుకునేవాళ్లం. అక్కడక్కడా కాటన్‌, మస్లిన్‌, మఖమల్‌ వస్త్రాల్నీ ఎంచుకొన్నాం. ఈ దుస్తుల డిజైనింగ్‌ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక ఫ్లోర్‌ను ఫ్యాక్టరీగా మార్చేశాం. డయింగ్‌తోపాటు టైలర్లు, సహాయ సిబ్బంది.. ఇలా వందల మందితో రద్దీగా ఉండేది. రాజులు, పట్టపురాణులు వంటి వారంతా సీన్‌లో ఉన్నప్పుడు మరింత పని ఉండేది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు అవకాశం వచ్చినందుకు ఓ పక్క సంతోషం.. మరోవైపు భయమూ.. నా ఈ 11 ఏళ్ల కెరియర్‌లో మణిరత్నం సహా రాజ్‌కుమార్‌ హిరాణి, కరణ్‌ జోహర్‌, గౌతం మీనన్‌ వంటి ప్రముఖులతో పని చేసే అదృష్టం దక్కింది. బయోపిక్‌, వెబ్‌ సిరీస్‌లు సహా 31 చిత్రాలకు పనిచేయగలిగా. పని పట్ల ప్రేమ, రాజీపడకపోవడం, నైపుణ్యాల్ని మెరుగు పరుచుకుంటూ ఉండటమే నా విజయ రహస్యాలు అనుకుంటాను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్