పని అలసట.. తప్పాలంటే!

వర్క్‌ బర్నవుట్‌.. ఈమధ్య ఎక్కువగా   వినిపిస్తోన్నమాట. పనిపై విరక్తి, సహ ఉద్యోగుల పట్ల విముఖత, విపరీతమైన అలసట.. దీని చిహ్నాల్లో కొన్ని. ఇల్లు, ఆఫీసు మధ్య నలిగిపోయే మనలో ఇదెక్కువగా కనిపిస్తోందట. ఫలితంగా కెరియర్‌ని వదులుకుంటున్న వారూ ఎందరో! దీన్నుంచి తప్పించుకోవాలా? నిపుణుల సూచనలివిగో!

Updated : 18 Oct 2022 05:27 IST

వర్క్‌ బర్నవుట్‌.. ఈమధ్య ఎక్కువగా  వినిపిస్తోన్నమాట. పనిపై విరక్తి, సహ ఉద్యోగుల పట్ల విముఖత, విపరీతమైన అలసట.. దీని చిహ్నాల్లో కొన్ని. ఇల్లు, ఆఫీసు మధ్య నలిగిపోయే మనలో ఇదెక్కువగా కనిపిస్తోందట. ఫలితంగా కెరియర్‌ని వదులుకుంటున్న వారూ ఎందరో! దీన్నుంచి తప్పించుకోవాలా? నిపుణుల సూచనలివిగో!

సకాలంలో పని అవ్వాలన్న తొందర మనకు. విరామాలనీ పట్టించుకోకుండా చేసేస్తుంటాం. రోజుల కొద్దీ అలాగే కొనసాగితే శరీరం ఎలా తట్టుకుంటుంది? ఆఫీసులో కొన్ని విషయాలు తెలియవు. పోనీ అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇదీ మానసిక అలసటకు దారితీస్తుందట. పక్కవాళ్లు వెక్కిరిస్తున్నారనో, ఏమనుకుంటున్నారో అన్న ఆలోచనలూ మెదడుపై భారం చూపుతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి, పనిని భారం అనుకోవద్దు.

పనన్నాక పొరపాట్లు మామూలే. పెద్దవైతే సరే! చిన్నవాటికీ తిడుతోంటే బాధనిపిస్తుంది కదూ. ఇంకోసారి ఎక్కడ పొరపాటు దొర్లుతుందో అన్న కంగారు. ఇదీ మెదడుకు భారంగా మారుతుందట. అలా కాక నెమ్మదిగా చెబితే మనమే ఇంకోసారి అలా జరక్కుండా జాగ్రత్త పడుతుంటాం కదా అనిపిస్తుంది. నిజానికి ఆ తీరు ఇంకా బాగా చేయాలి, తప్పులకు తావివ్వొద్దన్న ఆలోచనని ప్రేరేపిస్తుందట. మరి మీరూ ఇతరుల విషయంలో అలానే చేస్తున్నారా? లేకపోతే ఇప్పట్నుంచైనా అనుసరించండి. ఒక మంచి పని చేసినప్పుడు మనసుకు తెలియని ఆనందం. దాన్ని ఆఫీసులోనూ పాటించండి. సరిచేసుకునే వీలుంటే అవకాశమివ్వండి. ఇదీ సాయమే.

ఆఫీసుకు సమయం మించి పోతుందని హడావుడి. తిరిగి ఇంటికి చేరాలనే హడావుడి. దీంతో అలసట మామూలే. ఆ సమయంలోనూ చిన్న వ్యాపకాలను పెట్టుకోండి. అంటే.. డెస్క్‌ మీద ఓ మొక్కను పెట్టుకొని అలసటగా అనిపించినప్పుడు దాని బాగోగులు చూసుకోవడం, స్నేహితులతో భోజనాన్ని నింపాదిగా ముగించడం, వీలుంటే చిన్న కునుకు.. అలాగన్న మాట. స్నేహితులు, ఇంట్లో వాళ్ల బాగోగులు చూసుకోవడానికి వెనుకాడం. దాన్ని అతి ముఖ్యమైందిగా భావిస్తాం. మీ గురించి మీరూ అంతే శ్రద్ధ చూపండి. స్వీయప్రేమకు మించిన ఒత్తిడి తగ్గించే కారకం మరోటి ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్