అభిరుచిని పంచుతూ ఎదిగారు!

ఒకప్పుడు సాధారణ అమ్మాయిలే... ఇప్పుడో లక్షల సబ్‌స్క్రైబర్లతో వందల ప్రముఖ సంస్థలకు ప్రచారకర్తలు. వాళ్లేమీ సినీ తారలో, ప్రముఖుల పిల్లలో కాదు... కానీ అభి‘రుచు’లతో లక్షల మందిని ఆకట్టుకుంటూ... పాతికేళ్ల వయసులోనే పేరుతో పాటు భారీగా ఆదాయాన్నీ పొందుతున్న సింగంపల్లి వాసంతి, సాయి సృష్టి లాడేగాంలను వసుంధర పలకరించింది.

Published : 06 Nov 2022 00:53 IST

ఒకప్పుడు సాధారణ అమ్మాయిలే... ఇప్పుడో లక్షల సబ్‌స్క్రైబర్లతో వందల ప్రముఖ సంస్థలకు ప్రచారకర్తలు. వాళ్లేమీ సినీ తారలో, ప్రముఖుల పిల్లలో కాదు... కానీ అభి‘రుచు’లతో లక్షల మందిని ఆకట్టుకుంటూ... పాతికేళ్ల వయసులోనే పేరుతో పాటు భారీగా ఆదాయాన్నీ పొందుతున్న సింగంపల్లి వాసంతి, సాయి సృష్టి లాడేగాంలను వసుంధర పలకరించింది.


మొదట్లో నిరుత్సాహం:వాసంతి

మాది హైదరాబాద్‌. నాన్న రవిబాబు ఉద్యోగి, అమ్మ శ్రీవిజయ, ఓ తమ్ముడు. ఇదీ మా మధ్యతరగతి కుటుంబం. కొత్త రకం ఫుడ్‌ కోసం వెతకడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగంలో చేరాకా ఇది కొనసాగింది. ఆ రుచుల్ని అందరికీ పంచాలని ఫేస్‌ బుక్‌లో రాసేదాన్ని. చాలామంది ఫాలో అయ్యేవారు. ఫుడ్‌బ్లాగింగ్‌ చేయొచ్చు కదా అని అందరూ అంటుంటే... 2018లో ‘టేస్టీడ్రిప్స్‌’ మొదలుపెట్టా. హైదరాబాద్‌లో కొత్త రకాలు, ప్రత్యేక ఫుడ్‌ వెతికి రుచి చూసి, ఇన్‌స్టాలో పోస్ట్‌ చేేయడం మొదలుపెట్టా. 10 వేల సబ్‌స్క్రైబర్లు రావడానికి ఏడాదిన్నర పట్టినా.. నిరాశ పడలేదు. ఇప్పుడు 1.18 లక్షలయ్యారు.

అందరూ అడుగుతోంటే సంతోషం..

ఇప్పుడు స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాళ్ల నుంచి నక్షత్ర హోటళ్ల వరకూ ఆహ్వానాలు పంపుతూ ఉంటాయి. చాలా సంస్థలు, బ్రాండ్స్‌ ప్రమోషన్స్‌కు సంప్రదిస్తుంటాయి. 500కుపైగా ప్రముఖ సంస్థలకు పనిచేశా. వారానికి కనీసం 3, 4 కొత్త రెస్టారెంట్స్‌ నుంచి పిలుపొస్తుంది. వెయ్యికిపైగా హోటల్స్‌లో 5వేలకుపైగా వంటకాల రుచి, అక్కడి పరిశుభ్రత, సర్వీస్‌ గురించి రివ్యూలు ఇచ్చా. కొత్త హోటల్స్‌, క్లౌడ్‌ కిచెన్స్‌ వాళ్లు వంటకాలను ఇంటికే పంపిస్తుంటారు. ఫలానా చోటున్నాం, దగ్గరలో మంచి హోటల్‌ ఉందా, ఇంట్లో వేడుక ఉంది... ఎక్కడి వంటకాలు బాగుంటాయి అని ఫాలోయర్స్‌ అడిగినప్పుడు సంతోష మనిపిస్తుంది. ఉద్యోగం చేస్తూనే, ఫుడ్‌ బ్లాగర్‌ గానూ ఉన్నా. లాక్‌ డౌన్‌లో ఇది నాకు సేవా మార్గంగానూ తోడ్పడింది... ఆ సమయంలో అమ్మ సాయంతో రకరకాల వంటకాలు చేసి ఇన్‌స్టాలో చూపేదాన్ని. క్లౌడ్‌ కిచెన్స్‌, స్టార్టప్స్‌ను ప్రమోట్‌ చేశా. ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉన్న వారికి ఆర్థిక సాయం అందేలా తోడ్పడ్డా. రక్తదానాన్ని ప్రోత్సహించా. పోషక విలువలు చెప్పా. ఎక్కడ, ఎన్ని తిన్నా, అమ్మ వండే పప్పు, చికెన్‌ పులావ్‌ అంటే మాత్రం చాలా ఇష్టం.


ఇంత తిండి పిచ్చేంటి అనేవారు:సృష్టి

వైద్య విద్య చదువుతూనే కొత్త రుచులను ఆస్వాదించడంలో ఆసక్తిగా ఉండేదాన్ని. పూర్తి స్థాయి ఫుడ్‌ బ్లాగర్‌ అవుతానని అనుకోలేదు. మాది హైదరాబాద్‌. అమ్మ భాగ్యరేఖ ఉద్యోగ విరమణ చేశారు. నాన్న ఏడేళ్ల క్రితం చనిపోయారు. ఇద్దరు తోబుట్టువులున్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి రకరకాల వంటల గురించి తెలుసుకుని, అవెక్కడ దొరుకుతాయో వెతికి తిని, ఆ రుచులను ఫేస్‌బుక్‌లో చెప్పే దాన్ని. దాంతో స్నేహితులు రుచుల వివరాలన్నీ నన్నే అడిగే వారు. వారి ప్రోత్సాహంతో 2016లో ‘హైదరాబాద్‌ ఫుడ్‌ ట్రిప్‌’ పేజీ ప్రారంభించా. మొదట్లో ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు చేసేదాన్ని. క్రమేపీ దీనికే అంకితమైపోయా. ఫుడ్‌బ్లాగర్‌గా మారడం అమ్మకు నచ్చలేదు. ఇది కూడా ఒక వృత్తి అని చాలా మందికి తెలీదు. తనకు నచ్చచెబుతుంటా. రెండేళ్ల వరకూ 10 వేల మంది ఉండే సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇప్పుడు 1.5 లక్షలకు పెరిగింది. 200కుపైగా ప్రముఖ బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేశా. ఆరువేల వంటల రుచులకు రివ్యూలిచ్చా. భాగ్యనగరం సహా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రేతర ప్రాంతాలన్నీ పర్యటించి అక్కడి వంటల గురించీ చెప్పా. ఇన్నిరకాలు, ఇంత ఫుడ్‌ తింటావేంటి.. ఇంత తిండి పిచ్చేంటి అనే వాళ్లున్నారు. అవేవీ పట్టించుకోను. ఫుడ్‌బుక్‌ రాయాలనేది నా లక్ష్యం. కొత్త వంటలు వండటం, ఫుడ్‌ ఫొటోగ్రఫీ కూడా నా అభిరుచులు.


ముక్తకంఠం...

* ఏదైనా మితంగానే తింటాం. ఫిట్‌నెస్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటాం.

* దేశవిదేశీ వంటకాల రుచులను అందరికీ పంచాలి.

* ఆసక్తి, పట్టుదల, ఓపిక ఉంటే మీరే వృత్తిలో ఉన్నా అభిరుచి కూడా ఆదాయ మార్గమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్