ఈ అలవాట్లు కొంపముంచేస్తాయ్‌!

కెరియర్‌లో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఎవరికుండదు? దానికోసం కష్టపడుతుంటాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ప్రవర్తనదీ ప్రధాన పాత్రే! దాన్నీ గమనించుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 07 Nov 2022 00:17 IST

కెరియర్‌లో ఉన్నతస్థాయికి వెళ్లాలని ఎవరికుండదు? దానికోసం కష్టపడుతుంటాం కూడా. అయితే ఈ ప్రక్రియలో ప్రవర్తనదీ ప్రధాన పాత్రే! దాన్నీ గమనించుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ప్రమాదమంటున్నారు.

* ఏమరుపాటో, తొందరపాటులో చూసుకోకపోవడమో.. కారణమేదైతేనేం తప్పులు సాధారణమే. కావాలని ఎవరూ చేయరు నిజమే. అయినా బాధ్యత తీసుకోక తప్పదు. పని చేస్తేనే పొరపాట్లు వస్తాయి. వాటిని అంగీకరించినప్పుడే పాఠాన్నీ నేర్చుకోగలుగుతారు. కాబట్టి, దాన్నో అవమానంగా తీసుకొని ఇతరులపై నెట్టే ప్రయత్నం చేయకండి.

* పని చేసేచోట నిరూపించుకోవాలి అనుకోవడం మంచిదే. ఇంట్లో చేస్తున్నాంగా.. ఆఫీసూ అలాగే అనుకొని అన్నీ సొంతంగా చేసేయాలన్న తాపత్రయమొద్దు. పనిభారం పంచుకుంటే ఎంత సులువవుతుందో.. ఒక్కరే మీద వేసుకుంటే అంత ఒత్తిడికి కారణమవుతుంది. దాని ఫలితమే పనిలో తప్పిదాలు, నాణ్యతా లోపాలు. నమ్మకస్తులను చుట్టూ ఉండేలా చూసుకోండి. వాళ్లతో పంచుకోండి. పనీ సులువవుతుంది, విజయాలూ త్వరగా దక్కుతాయి.

* రోజూ సమయం కంటే ముందొచ్చి కూర్చోమని ఎవరూ అడగరు. కానీ తరచూ ఆలస్యాన్ని మాత్రం ఎవరూ సహించలేరు. ఇల్లు, పిల్లల బాధ్యతలు ముగించుకొని రావడానికి సమయం పడుతుంది. నిజమే.. ఎప్పుడైనా అంటే సరే! కానీ తరచూ జరుగుతోంటే ఇతరులకీ ఇబ్బంది. సమయ పాలనని నియమంగా పెట్టుకోవాలి.

* ఆరోగ్యం బాలేదనో, ప్రతిదీ పద్ధతిగా జరగట్లేదనో తరచూ చెబుతోంటే ఎలా అనిపిస్తుంది? విసుగొస్తుంది కదా! మీరూ అలా చేయకండి. తరచూ ప్రతికూలంగా, ఫిర్యాదు చేస్తూ మాట్లాడేవాళ్లని ఎవరూ భరించలేరు. దీంతో దూరం పెడుతుంటారు. ఇక ఎదిగేదెలా?

* నలుగురూ పనిచేసే చోట అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయా? అలాగని మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరూ శత్రువులనుకోవద్దు. ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని వాళ్లేం చెప్పినా వ్యతిరేకించడం, ప్రతి విషయానికీ ఫిర్యాదు చేయడం లాంటివీ చేయొద్దు. బాస్‌సహా ప్రతి ఒక్కరితోనూ సత్సంబంధాలు నెరపండి. ఏ విషయంలోనైనా వాదించుకున్నా తిరిగి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అప్పుడే ముందుకు సాగగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్